ఆస్ట్రేలియా జట్టు (Australia) టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ (Tim Paine) ఇకపై ఆ పదవిలో కొనసాగడానికి ఇష్టపడటం లేదా? కెప్టెన్సీ (Captaincy) బాధ్యతల నుంచి తప్పుకొని వాటిని వేరే వారికి అప్పగించాలని భావిస్తున్నాడా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తున్నది. ఆస్ట్రేలియా జట్టుకు అనుకోకుండా కెప్టెన్ అయిన టిమ్ పైన్ జట్టను విజయాల బాట పట్టించాడు. అయితే ఇటీవల కాలంలో టీమ్ ఇండియాపై సొంత గడ్డ మీదే పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో కొంత కాలంగా టిమ్ పైన్ చాలా కుంగిపోయాడు. డిసెంబర్-జనవరి నెలల్లో ఇండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఓడిపోవడం టిమ్ పైన్‌ను చాలా బాధపెట్టినట్లు తెలుస్తున్నది. ఇప్పటికీ పైన్ ఆ దారుణ పరాజయాన్ని మరిచిపోలేక పోతున్నట్లు ఉన్నాడు. అందుకే 'టీమ్ ఇండియా మమ్మల్ని పక్కదోవ పట్టించి గెలిచింది' అని బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. అయితే అంతకు మించిన పెద్ద సవాలు టిమ్ పైన్‌కు ఈ ఏడాది చివర్లో ఎదురుకానున్నది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే యాషెస్ సిరీస్ టిమ్ పైన్కే కాకుండా ఆస్ట్రేలియా జట్టుకు కూడా కీలకం కానున్నది.
కాగా, యాషెస్ సిరీస్ గెలిస్తే తాను కెప్టెన్సీని వదిలేస్తానని టిమ్ పైన్ చెప్పాడు. స్టీవ్ స్మిత్‌కు పగ్గాలు అప్పగించి తాను ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెప్పాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకొని స్టీవ్ స్మిత్ కెప్టెన్సీని కోల్పోయాడు. అప్పుడే టిమ్ పైన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా ఆ తర్వాత అతడినే రెగ్యులర్ కెప్టెన్‌గా కొనసాగించింది. అయితే ఇప్పుడు కెప్టెన్సీని తాను స్మిత్‌కు ఇచ్చేస్తాను అని వ్యాఖ్యానించడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కెప్టెన్సీ ఏమైనా ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యవహారమా ? అని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు తనకు, స్మిత్‌కు మధ్య ఉన్న అనుబంధం మేరకే పైన్ ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
స్మిత్ ఒక మంచి క్రికెటర్ మాత్రమే కాదు అతడొక గొప్ప కెప్టెన్. అతడి నుంచి నేను చాలా నేర్చుకున్నాను అని పైన్ చెప్పాడు. రాబోయే యాషెస్‌ను 5-0తో గెలవడమే కాకుండా.. చివరి మ్యాచ్‌ను సెంచరీతో ముగించాలని భావిస్తున్నట్లు పైన్ చెప్పాడు. కాగా, ఇటీవలే యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదల అయ్యింది. రెండో టెస్టు అడిలైడ్‌లో డే/నైట్ గా నిర్వహించనున్నారు. అంతే కాకుండా సాధారణంగా సిడ్నీలో చివరి మ్యాచ్ నిర్వహించే వారు. కానీ 1995 తర్వాత తొలి సారిగా పెర్త్‌లో యాషెస్ చివరి మ్యాచ్ నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.