Team India : హమ్మయ్యా.. ఆ ముగ్గురికీ నెగెటివ్.. ఊపిరి పీల్చుకున్న టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్

ఆ ముగ్గురు సేఫ్.. తాజా పరీక్షల్లో నెగెటివ్ (PC: BCCI)

ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా క్రికెటర్లు కరోనా బారిన పడటంతో కలకలం రేగింది. అయితే కరోనా సోకిన వ్యక్తికి క్లోజ్ కాంటాక్ట్ అయి ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంటున్న ముగ్గురికి తాజా పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టు వచ్చింది.

  • Share this:
    ఇంగ్లాండ్ పర్యటనలో (England Tour) ఉన్న టీమ్ ఇండియాలో (Team India) కరోనా (Corona) కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. భారత జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మాన్ రిషబ్ పంత్ (Rishabh Pant) కరోనా బారిన పడి గత ఎనిమిది రోజులుగా ఒక ప్రత్యేక ప్రదేశంలో ఐసోలేషన్‌లో ఉన్నాడు. యూరో కప్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన పంత్ కరోనా బారిన పడినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఎనిమిది రోజుల క్రితమే అతడికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఒక ప్రత్యేక ప్రదేశంలో ఐసోలేట్ చేశారు. ప్రస్తుతం పంత్ కోలుకుంటున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఇక భారత జట్టు సపోర్టింగ్ స్టాఫ్‌లో ఒకరైన దయానంద్ గరాని కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడిని వెంటనే ఐసోలేట్ చేశారు. దయానంద్‌తో క్లోజ్ కాంటాక్ట్‌లోకి వెళ్లిన వృద్దిమాన్ సాహ, బ్యాకప్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌లను అప్పుడే క్వారంటైన్‌కు తరలించారు. తాజాగా ఈ ముగ్గురికీ చేసిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్దారణ అయ్యింది. తొలి రౌండ్ ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చినా.. ఇంకా వీరిని క్వారంటైన్‌లోనే ఉంచారు. శనివారం మరో సారి ఈ ముగ్గురికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయనున్నారు. అందులో కూడా నెగెటివ్ వస్తే జట్టుతో కలిసే అవకాశాలు ఉన్నాయి. వీరు ముగ్గురు ప్రస్తుతం లండన్‌లోని ఒక హోటల్‌లో హార్డ్ క్వారంటైన్‌లో ఉన్నారు.

    'కరోనా సోకిన వారికి క్లోజ్ కాంటాక్ట్‌కు వెళ్లిన ముగ్గురు కూడా ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్‌గా తేలారు. అయితే బ్రిటన్ ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్లు మరి కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉన్నది. అందుకే వృద్దిమాన్ సాహ, ఈశ్వరన్, భరత్ అరుణ్‌లు లండన్‌లోని హోటల్‌లోనే బస చేస్తారు. మిగిలిన జట్టు దుర్హామ్ వెళ్లిపోయింది' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న రిషబ్ పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. రాబోయే 7 రోజులు అతడు ఐసోలేషన్‌లోనే ఉంటాడని బీసీసీఐ తెలిపింది. తొలి సారి పాజిటివ్ వచ్చిన తర్వాత అతడికి మరో రెండు సార్లు పరీక్షలు జరిపారు. అయితే ఆ రెండింటిలోనూ పంత్ రిపోర్టు నెగెటివ్ వచ్చినట్లు తెలుస్తున్నది. దుర్హమ్ వేదికగా జరుగనున్న టూర్ మ్యాచ్‌లలో రెండో దానికి పంత్ అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది.

    కాగా, ఈ నెల 20 నుంచి దుర్హమ్‌లో తొలి టూర్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నది. రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహ ఇద్దరూ క్వారంటైన్‌లో ఉండటంతో కీపింగ్ ఎవరు చేస్తారనే దానిపై సందిగ్దత నెలకొన్నది. కేఎల్ రాహుల్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నది. మరోవైపు టీమ్ ఇండియా క్రికెటర్లలో కరోనా బయటపడటంతో బీసీసీఐ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇకపై ప్రతీ క్రికెటర్, సహాయక సిబ్బంది రోజూ కరోనా పరీక్షలు చేయించుకోవల్సి ఉంటుంది. ఆటగాళ్లు అందరూ కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా లేఖ రాశారు.



    ఇక టీమ్ ఇండియా క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది అందరికీ రెండో డోస్ కోవీషీల్డ్ వేశారు. ప్రస్తుతం అందరూ దుర్హమ్‌కు చేరుకున్నారు. చేరుకున్న వెంటనే హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో టీమ్ మీటింగ్ జరిగింది. ఈ మేరకు బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
    Published by:John Naveen Kora
    First published: