THREE INDIAN CRICKETERS INJURED IN ENGLAND TOUR TEAM MANAGEMENT REQUESTED FOR BACKUP JNK
Team India: ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ ఇండియాకు షాక్.. ముగ్గురు క్రికెటర్లు గాయాలతో ఔట్..
ఈ సారైనా టీమ్ మేనేజ్మెంట్ కోరికను బీసీసీఐ మన్నిస్తుందా? (Twitter)
ఇంగ్లాండ్ వెళ్లిన టీమ్ ఇండియాలో ముగ్గురు క్రికెటర్లు గాయపడి ఇంటికి తిరిగి వచ్చేశారు. దీంతో తమకు బ్యాకప్ కావాలంటూ టీమ్ మేనేజ్మెంట్ మరోసారి బీసీసీఐని కోరింది.
ఇంగ్లాండ్ పర్యటనకు (England tour) వెళ్లిన భారత జట్టుకు (Team India) పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (Test Series) ఇంకా ప్రారంభం కాక ముందే ముగ్గురు కీలకమైన క్రికెటర్లు గాయాలతో (Injuries) సిరీస్‌కు దూరమయ్యారు. టెస్ట్ సిరీస్‌కు మరో 2 వారాల సమయం ఉన్నది. కానీ ఇంతలోనే జట్టులో గాయాల బారిన పడిన ఆటగాళ్లు ఇండియాకు తిరిగి రావల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యూజీలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ సమయంలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. అతడు కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుండటంతో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక దుర్హామ్‌లో కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఇద్దరు క్రికెటర్లు గాయాలపాలయ్యారు. తొలి రోజు బౌలర్ ఆవేశ్ ఖాన్ బొటన వేలు చిట్లి గాయం కాగా.. రెండో రోజు వాషింగ్టన్ సుందర్ కూడా వేలికి గాయం చేసుకున్నాడు. వీరిద్దరూ వార్మప్ మ్యాచ్‌లో కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ తరపున బరిలోకి దిగడం గమనార్హం. కాగా, ఈ ముగ్గురు క్రికెటర్లలో తుది జట్టులో ఆడేది కేవలం శుభ్‌మన్ గిల్ మాత్రమే. మిగిలిన ఇద్దరు మెయిన్ టీమ్‌కు బ్యాకప్‌గా వెళ్లారు. మొత్తం 24 మంది క్రికెటర్లు ఇంగ్లాండ్ వెళ్లగా వారిలో ముగ్గురు గాయంతో సిరీస్ ప్రారంభానికి ముందే తిరిగి ఇంటికి వచ్చేశారు.
మరోవైపు భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో కోవిడ్ బారిన కూడా పడింది. వికెట్ కీపర్, బ్యాట్స్మాన్ రిషబ్ పంత్ కోవిడ్ బారిన పడి కోలుకున్నాడు. గురువారమే రిషబ్ పంత్ టీమ్ ఇండియా బయోబబుల్‌లోకి వెళ్లాడు. కాగా, మరో వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహ, బ్యాకప్ ఓపెనర్‌గా వెళ్లిన అభిమన్యు ఈశ్వరన్ కోవిడ్ పేషెంట్‌కు సన్నిహితంగా ఉండటంతో వారిని ఐసోలేషన్‌కు తరలించారు. జులై 24న వీరిద్దరి క్వారంటైన్ ముగియనున్నది. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించి నెగెటివ్ వస్తే వారు జట్టులో చేరనున్నారు. 'వాషింగ్టన్ సుందర్, ఆవేశ్ ఖాన్ గాయాల బారిన పడి ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరమ్యారు. వారిద్దరూ త్వరలోనే ఇండియాకు తిరిగి రానున్నారు' అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.
కాగా, ఇంగ్లాండ్ వెళ్లిన జట్టులో ముగ్గురు గాయాల బారిన పడటంతో బ్యాకప్ కింద ప్లేయర్లను ఇంగ్లాండ్ పంపించాలని బీసీసీఐను మరోసారి టీమ్ మేనేజ్మెంట్ కోరనున్నది. గతంలో శుభ్‌మన్ గిల్ గాయపడిన తర్వాత పృథ్వీషా, దేవ్‌దత్ పడిక్కల్‌ను ఇంగ్లాండ్ పంపాలని టీమ్ మేనేజ్మెంట్ కోరింది. కానీ బీసీసీఐ మాత్రం ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. బెంచ్ మీద తగినన్ని ఆప్షన్లు ఉన్నాయని.. సెలెక్టర్లు ఇప్పటికే మంచి జట్టునే ఇంగ్లాండ్ పంపారని స్వయంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు. అయితే అప్పటి పరిస్థితికి ఇప్పుడున్న స్థితికి చాలా తేడా ఉందని.. కాబట్టి బ్యాకప్ పంపించాల్సిందేనని టీమ్ మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.