Shreyas Iyer: 'నా జీవితంలో ఆ రోజులు చాలా కష్టంగా గడిచాయి.. నాకు జరిగిన దాన్ని జీర్ణించుకోలేకపోయాను'

అవి నా జీవితంలో చీకటి రోజులు అంటున్న శ్రేయస్ అయ్యర్ (PC: BCCI)

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం కోలుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2వ ఫేజ్ ఆడటానికి సిద్దపడుతున్న శ్రేయస్ అయ్యర్.. తన జీవితంలోని చీకటి రోజులను గుర్తు చేసుకున్నాడు.

 • Share this:
  టీమ్ ఇండియా (Team India) బ్యాట్స్‌మాన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) భుజం గాయం కారణంగా గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. మార్చి 23న ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా భుజం బెణికింది. గాయం తీవ్రంగా ఉండటంతో అప్పటికప్పుడు మైదానాన్ని వీడాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి స్కాన్ చేయగా భుజం బెణికినట్లు వైద్యులు చెప్పారు. అతడికి వెంటనే శస్త్ర చికిత్స చేసి మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. దీంతో శ్రేయస్ అయ్యర్ భారత జట్టుకే కాకుండా ఐపీఎల్‌ 2021లో (IPL 2021) ఢిల్లీ క్యాపిటల్స్‌కు (Delhi Capitals) కూడా దూరమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ స్థానంలో రిషబ్ పంత్‌ను (Rishab Pant) నియమించారు. అయితే గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకున్న అయ్యర్.. గాయం నుంచి కోలుకున్నాడు. త్వరలో యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్ 2021 రెండో ఫేస్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తున్నది. ఐపీఎల్‌లో కనుక తన ఫిట్‌నెస్ నిరూపించుకొని రాణిస్తే.. అతడికి టీ20 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం వస్తుంది. కాగా.. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ ఒక జాతీయ పత్రికతో మాట్లాడాడు. నా జీవితంలో గత కొన్ని రోజులు చాలా కష్టంగా గడిచాయని చెప్పాడు.

  'మార్చి 23న గాయం కారణంగా మైదానాన్ని వీడిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఏడ్చేశాను. నాకు జరిగిన విషయాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత శస్త్ర చికిత్స జరిగి ఇంట్లో ఉన్నప్పుడు బయట మ్యాచ్‌లు జరుగుతుంటే చాలా బాధగా ఉండేది. ఆ రోజులన్నీ చాలా భారంగా గడిచాయి. కానీ ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నాను. మరోసారి మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాననే ఆలోచన నన్ను సంతోషంగా ఉంచుతున్నది. ఇప్పటి వరకు నా జర్నీ చాలా సంతోషంగా గడిచింది. ఇక ముందు కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నాను. ఏదైనా ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. నేను ఆ ఆలోచనలు అన్నీ వదిలేశాను. మరింత బలంగా ఆడాలని నిర్ణయించుకున్నాను. గాయపడిన తొలి రోజుల్లో చాలా కష్టంగా ఉండేది. కానీ కాలంతో పాటు మనసుకు అయిన గాయం కూడా మానిపోయింది. గతంలో ఉన్న ఫామ్ తిరిగి వస్తుందా లేదా అనే ఆలోచన అయితే లేదు. కానీ ప్రతీ అథ్లెట్ కెరీర్‌లో ఇలాంటి ఫేజ్ ఒకటి వస్తుంటుంది. కానీ దాన్ని అధిగమిస్తే మరింత మంచి ప్రదర్శన చేయవచ్చు' అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

  Team India: టీమ్ ఇండియాకు పెద్ద ఎదురు దెబ్బ.. గాయంతో ఆసుపత్రిలో చేరిన స్టార్ ప్లేయర్.. నాలుగో టెస్టుకు డౌటే   ముంబైకి చెందిన శ్రేయస్ అయ్యర్ 2017 నవంబర్‌లో భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అదే నెలలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ‌లో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. డిసెంబర్ నెలలో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 2013 నుంచి ముంబై రంజీ జట్టుకు ఆడుతున్న అయ్యర్.. 2015 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ రాకతో ఐపీఎల్ 2వ ఫేజ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ బలం మరింత పెరుగనున్నది. అతడికే తిరిగి జట్టు పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నది.

  Published by:John Naveen Kora
  First published: