IPL 2021 : డేవిడ్ వార్నర్ అవమానంగా భావిస్తున్నాడా? సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌బై చెబుతాడా?

వచ్చే సీజన్‌లో వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి తప్పుకుంటాడా?

 • Share this:
  సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టుకు ఎన్నో ఏళ్ల నుంచి కీలక బ్యాట్స్‌మెన్, కెప్టెన్‌గా సేవలు అందిస్తున్న డేవిడ్ వార్నర్‌పై (David Warner) వేటు వేయడాన్ని ఎస్ఆర్‌హెచ్ అభిమానులే కాకుండా క్రికెట్ నిపుణులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. సన్‌రైజర్స్ జట్టు గెలిచి ఏకైక ఐపీఎల్ టైటిల్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోనే కావడం గమనార్హం. ఈ సీజన్‌లో జట్టుగా విఫలమైనా బ్యాట్స్‌మెన్‌గా మాత్రం విఫలం కాలేదు. స్ట్రైక్ రేట్ తక్కువగా ఉన్నదనే సాకు చూపించినా.. చెన్నైలోని పిచ్‌లు ఎలా ఉన్నాయో అందరూ చూశారు. ఐపీఎల్‌లో ఇంత వరకు టైటిల్ గెలవకుండా.. ప్రతీ ఏడాది పేలవ ప్రదర్శన చేస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం విరాట్ కోహ్లీని బాధ్యతల నుంచి తప్పించలేదు. గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పూర్తిగా విఫలమైనా ఎంఎస్ ధోనీని కూడా తప్పించలేదు. గత కొన్ని సీజన్లుగా వరుసగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటున్న జట్టు కెప్టెన్‌ను.. కేవలం ఆరు మ్యాచ్‌ల ప్రదర్శన చూసి వేటు వేయడం సబబు కాదని పలువురు అంటున్నారు. డేవిడ్ వార్నర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన బ్యాట్స్‌మెన్లలో ఒకడు. ఈ లీగ్‌లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి విదేశీ బ్యాట్స్‌మాన్ కూడా డేవిడ్ వార్నరే. గతంలో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన వార్నర్‌ను బ్యాటింగ్ సరిగా లేదని పక్కన పెట్టడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక క్రీడాకారుడి ఫామ్ ఒడిదుడుకులకు గురవ్వడం సహజమే.. అది ఎవరిని అడిగినా చెబుతారు. అలాంటి సమయంలో అండగా ఉండాల్సిన యాజమాన్యం అతడిని పక్కన పెట్టేసి మరింతగా అవమానించిందని ఫ్యాన్స్ అంటున్నారు.

  డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా తొలగించడం వరకు ఓకే కానీ.. తుది జట్టు నుంచి కూడా తీసేయడం తనను చాలా ఆశ్చర్యపరిచిందని హైదరాబాద్ జట్టు మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్ అన్నాడు. ఒక వేళ కెప్టెన్సీ కేన్ విలియమ్‌సన్‌కు ఇవ్వాలనుకున్నప్పుడు ప్లేయింగ్ లెవెన్‌లో డేవిడ్ వార్నర్‌ను ఉంచాల్సింది. అతడు ఒక అద్భుతమైన బ్యాట్స్‌మాన్. కానీ సన్‌రైజర్స్ అలా చేయకుండా అతడిని పూర్తిగా పక్కన పెట్టింది. దీంతో అతడు చాలా అసంతృప్తిగా ఉన్నాడు. బహుషా వచ్చే సీజన్‌లో అతడిని ఆరెంజ్ జెర్సీలో మనం చూడలేక పోవచ్చు అని స్టెయిన్ అభిప్రాయపడ్డాడు.

  డేవిడ్ వార్నర్ కూడా తనను కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులు ఉన్న ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. అందులో ఐ మిస్ యూ అని రాసి ఉన్నది. అంటే వార్నర్ జట్టు నుంచి వెళ్లిపోదామని మానసికంగా డిసైడ్ అయ్యాడా అనే అనుమానాలు వస్తున్నాయి. ఏదేమైనా వార్నర్‌ను జట్టు యాజమాన్యం అవమానించిందని.. అతడు వచ్చే సీజన్‌కు ఉండకపోవచ్చనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి.
  Published by:John Naveen Kora
  First published: