Cricket World Cup: వీళ్లు క్రికెట్‌లో తోపులు.. కానీ ఒక్క వరల్డ్ కప్, ఐపీఎల్ కప్ కూడా గెలవలేదు పాపం.. ఎవరో చూడండి..

ఈ క్రికెటర్లు ఇంత వరకు ఐపీఎల్, వరల్డ్ కప్ గెలవలేదు (PC: BCCI/ICC)

ప్రతి క్రికెటర్ తమ కెరీర్లో ఒక్కసారైనా ఐసీసీ ప్రపంచ కప్, ఐపీఎల్ ట్రోఫీలను ముద్దాడాలని అనుకుంటాడు. ఎందుకంటే వారి క్రికట్ జీవితంలో అవి సాధించడం చాలా గొప్పగా భావిస్తారు. కానీ ఈ క్రికెటర్లు మాత్రం తమ జీవితంలో ఒక్కాసారి కూడా ప్రపంచ కప్, ఐపీఎల్‌లను ముద్దాడలేదు.

  • Share this:
ప్రతి క్రికెటర్ తమ కెరీర్లో ఒక్కసారైనా ఐసీసీ ప్రపంచ కప్ (World Cup), ఐపీఎల్ (IPL) ట్రోఫీలను ముద్దాడాలని అనుకుంటాడు. ఎందుకంటే వారి క్రికట్ జీవితంలో ఈ రెండు ఈవెంట్లు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రపంచ కప్ నాలుగేళ్లకు ఓ సారి వస్తే, ఐపీఎల్ 2008 నుంచి ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ రెండింటినీ నెగ్గిన జట్టులో ఉండటం ఆటగాళ్ల కీర్తిని ఉన్నత శిఖరానికి చేరుస్తుంది. అయితే చాలా మంది దిగ్గజ క్రికెటర్లు ఆ కల నెరవేరకుండానే ఆట నుంచి నిష్క్రమించారు. కొద్దిమంది ఇప్పటికీ ప్రపంచకప్, ఐపీఎల్ ట్రోఫీలో సత్తా చాటాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్‌తో పాటు, ఐపీఎల్ ట్రోఫీని అందుకోని టాప్-10 దిగ్గజ ఆటగాళ్లెవరో చూద్దాం.

1. సౌరవ్ గంగూలీ.. (Saurav Ganguly)
భారత క్రికెట్ జట్టు అత్యుత్తమ సారథుల జాబితాలో సౌరవ్ గంగూలీ పేరు ప్రస్తావించకుండా ఉండలేం. 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మన దాదా 1996 ప్రపంచ కప్‌లో తొలిసారి ఆడాడు. 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో వరల్డ్ కప్ కలను మాత్రం తీర్చుకోలేకపోయాడు. 2003 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో భారత్ ఓటమి పాలవ్వడంతో దాదా కల అలాగే మిగిలిపోయింది. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌కు గంగూలీ గుడ్ బై చెప్పాడు. అయితే ఐపీఎల్ ట్రోఫీని కూడా అందుకోలేకపోయాడు. కేకేఆర్, పుణె తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2008 నుంచి 2010 వరకు కేకేఆర్ కు ఆడాడు. 2012లో టోర్నీ నుంచి రిటైరయ్యాడు.

2. క్రిస్ గేల్.. (Chris Gayle)
ఈ యూనివర్సల్ బాస్ 1999లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రిస్ గేల్ ఒక్కసారి కూడా ఐసీసీ వరల్డ్ కప్, ఐపీఎల్ ట్రోఫీని అందులేకపోయాడు. ప్రస్తుతం 41 ఏళ్ల వయసున్న ఈ విధ్వంసకర బ్యాట్స్ మన్ ఇంకా తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. 2003లో తొలిసారిగా వరల్డ్ కప్ ఆడిన గేల్ ఇప్పటి వరకు ఐదు సార్లు ప్రపంచ కప్ సమరంలో తలపడ్డాడు. 2019 ప్రపంచకప్ లో చివరిసారిగా వన్డే ఆడాడు. 45 ఏళ్లు వచ్చేవరకు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనని గేల్ ఇటీవలే ప్రకటించాడు. దీన్ని బట్టి చూస్తే 2023 వరల్డ్ కప్పే అతడికి చివరిది అవ్వనుంది. కరేబియన్ జట్టు 2019లో సెమీ ఫైనల్ కు కూడా అర్హత సాధించలేకపోయింది. ఐపీఎల్లోనూ పలు జట్లలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ టైటిల్ మాత్రం అందుకోలేకపోయాడు.

3. రాహుల్ ద్రవిడ్.. (Rahul Dravid)
సౌరవ్ గంగూలీ మాదిరిగానే మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ కూడా ప్రపంచ కప్, ఐపీఎల్ ట్రోఫీలు అందుకోలేకపోయాడు. 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో మూడు వరల్డ్ కప్స్(1999 నుంచి 2007 వరకు) ఆడాడు. 1999 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు(8 మ్యాచుల్లో 461 పరుగులు) చేసిన బ్యాట్స్ మన్ గా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ కెరీర్లో 2010 వరకు ఆర్సీబీ తరఫున ఆడాడు. 2009, 2010 ఐపీఎల్ సీజన్లలో ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ కొద్దిలో ట్రోఫీని చేజార్చుకుంది. 2011 నుంచి 2013 వరకు రాజస్థాన్ తరఫున ఆడాడు. 2013లో రిటైరయ్యాడు.

4. ఏబీ డివిలియర్స్.. (AB Divillers)
2005లో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ దక్షిణాఫ్రికా విధ్వంసకారుడు.. తన కెరీర్లో ఒక్కసారి కూడా ప్రపంచ కప్, ఐపీఎల్ ట్రోఫీలను అందుకోలేకపోయాడు. 2015 వరల్డ్ కప్ సెమీస్‌లో సఫారీ జట్టు న్యూజిలాండ్ పై కొద్దిలో మ్యాచ్ చేజార్చుకుని కప్పు ఆశలపై నీళ్లు చల్లుకుంది. దీంతో డివిలియర్స్ వరల్డ్ కప్ కల నెరవేరలేదు. ఐపీఎల్లోనూ ఏబీకి అదృష్టం కలిసిరాలేదు. ప్రస్తుతం ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడు. 2011, 2016లో బెంగళూరును ఫైనల్ వరకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన డివిలియర్స్ ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయాడు. 2021లోనైనా ఆ ఆశ తీరుతుందేమో చూడాలి.

5. మహేలా జయవర్ధనే.. (Mahela Jayawardane)
1998లో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ లంక బ్యాట్స్ మెన్ వరల్డ్ కప్ ఆశను మాత్రం తీర్చుకోలేకపోయాడు. 1999 నుంచి 2015 వరకు ఐదు ప్రపంచ కప్ టోర్నీలో ఆడిన జయవర్ధనే 2007, 2011లో ఫైనల్‌కు చేరిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఈ రెండు సార్లు శ్రీలంక తుదిపోరులో ఓటమి పాలై రన్నరప్ గా మిగిలిపోయింది. ఐపీఎల్లో 2012 వరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, దిల్లీ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అయితే అక్కడ కూడా అతడికి అదృష్టం కలిసి రాలేదు.

6. కుమార సంగక్కర.. (Kumara Sangakkara)
ప్రతిభ ఎంత ఉన్నప్పటికీ దురదృష్టం వెంట ఉంటే విజయం వరించదు అంటారు. ఈ విషయంలో కుమార సంగక్కర ముందుంటాడు. ఐపీఎల్, ప్రపంచకప్ రెండింటిని అందుకోకుండానే అతడు కెరీర్ ముగించాడు. 2003 నుంచి 2015 వరకు నాలుగు ప్రపంచ కప్ టోర్నీలు ఆడిన సంగక్కర ఒక్కదాంట్లోనూ జట్టును విజేతగా నిలపలేకపోయాడు. 2007, 2011 టోర్నీల్లో శ్రీలంకను ఫైనల్ వరకు తీసుకెళ్లిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ దురదృష్టవశాత్తు రెండు సార్లు జట్టును గెలిపించలేకపోయాడు. ఐపీఎల్ లోనూ వరుసగా ఆరు సీజన్లలో ఆడినప్పటికీ అందులోనూ అతడిని విజయం వరించలేదు. డెక్కన్ ఛార్జర్స్, సన్ రైజర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సీఎస్కే తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

7. డేనియల్ వెటోరీ.. (Daniel Vettori)
1999లో 20 ఏళ్ల వయసులో తొలిసారిగా అంతర్జాతీయ క్రెకెట్లో అరంగేట్రం చేసిన ఈ న్యూజిలాండ్ ప్లేయర్.. 18 ఏళ్ల కెరీర్లో తన జట్టును ప్రపంచకప్ విజేతగా నిలపలేకపోయాడు. ఐదు ప్రపంచకప్ టోర్నీలు ఆడిన వెటోరీ 2015లో రిటైరయ్యాడు. ఐపీఎల్లో రెండు ఫ్రాంఛైజీలకు ఆడాడు. 2011లో ఆర్సీబీ ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే సీఎస్కే చేతిలో బెంగళూరు జట్టు పరాజయం పాలైంది. దీంతో ఐపీఎల్ ట్రోఫీ కూడా అందుకోలేకపోయాడు.

8. అనిల్ కుంబ్లే.. (Anil Kumble)
1990లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ కప్‌ను మాత్రం ముద్దాడలేకపోయాడు. 2003లో ఫైనల్ చేరిన ఇండియన్ జట్టులో కుంబ్లే ఉన్నప్పటికీ తుదిపోరులో భారత్ ఓటమి పాలయింది. 2007లో గ్రూప్ దశలోనే ఇండియా ఇంటిముఖం పట్టింది. ఐపీఎల్లోనూ కుంబ్లేకు అదృష్టం కలిసి రాలేదు. ఆర్సీబీ తరఫున ఆడిన అనిల్ కుంబ్లే 2009లో బెంగళూరును ఫైనల్‌కు చేర్చగా.. కొద్దిలో టైటిల్ మిస్ అయింది. 2010లో బెంగళూరు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న కుంబ్లే.. జట్టును ఆ సీజన్లో మూడో స్థానంలో నిలిపాడు.

9. డేల్ స్టెయిన్.. (Dale Steyn)
ఇతర దక్షిణాఫ్రికా దిగ్గజాల మాదిరిగానే డేల్ స్టెయిన్ కూడా తన ప్రపంచకప్ కలను తీర్చుకోలేకపోయాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన స్టెయిన్ రెండు ప్రపంచకప్(2011, 2015) టోర్నీల్లో ఆడాడు. 2015లో సెమీస్‌లో న్యూజిలాండ్‌పై సఫారీ జట్టు త్రుటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఐపీఎల్లోనూ స్టెయిన్‌కు అదృష్టం కలిసి రాలేదు. 2009 నుంచి 2010 వరకు ఆర్సీబీ తరఫున, అనంతరం 2013 వరకు హైదరాబాద్ తరఫున ఆడాడు. అయితే ఐపీఎల్ ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయాడు.

10. షాన్ పొలాక్.. (Shaun Pollak)
1996 ప్రపంచ కప్‌కు ముందే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ దక్షిణాఫ్రికా దిగ్గజం.. కెరీర్లో అత్యుత్తమ స్వింగ్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1996 నుంచి 2007 వరకు నాలుగు వరల్డ్ కప్ టోర్నీలు ఆడినా.. ఒక్క సారి కూడా జట్టును విజేతగా నిలపలేకపోయాడు. ఐపీఎల్లో కేవలం ఒకే ఒక్క సీజన్(2008)లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడాడు. అయితే ఆ సీజన్‌లో ముంబయి గెలవలేదు.
First published: