ఇండియాలో క్రికెట్ అంటే ఒక మతానికి ఉన్నంత క్రేజ్ ఉంది. క్రికెట్‌ను ఏదో ఎంజాయ్మెంట్ కోసం చూసే వాళ్లు కొందరైతే.. మరి కొంత మంది తమన అభిమాన ఆటగాళ్ల కోసం చూసే వారు మరికొందరు. టీమ్ ఇండియా క్రికెటర్లకు అయితే కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. మగ అభిమానులను పక్కన పెడితే.. మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియంలో సందడి చేసే అందమైన భామలకు కొదువ ఉండదు. తమ అభిమాన క్రికెటర్ పేరు రాసి 'ఐ లవ్ యూ', 'విల్ యూ మ్యారీ మీ' అనే ప్లకార్డులు పట్టుకొని తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. అయితే క్రికెటర్లు ఇలాంటి అమ్మాయిల ప్రేమకు ఓకే చెప్తారా? అలాంటి సంఘటనలు జరిగాయా? అంటే నిజమేనని అనుకోవాలి. అయితే ఈ ఫ్యాన్స్ గ్రౌండ్లో ప్లకార్డులు పట్టుకొని సందడి చేయకపోయినా.. తమ అభిమాన క్రికెటర్‌ను మాత్రం ఫ్యాన్‌గా కలసి తర్వాత వారి జీవిత భాగస్వాములుగా మారిపోయారు. అలాంటి నాలుగు క్యూట్ లవ్ స్టోరీస్ ఏంటో చూద్దాం.
మన్సూర్ అలీ ఖాన్ పటౌడి - షర్మిలా ఠాగోర్
క్రికెటర్-ఫ్యాన్ ప్రేమకు వీరు ఆడమ్-ఈవ్ లాంటి వారు. క్రికెట్లో తొలి ప్రేమ పెళ్లి వీళ్లదే. భారత జట్టుకు అతి చిన్న వయసులోనే కెప్టెన్‌గా వ్యవహరించిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. పటౌడీ క్రికెటర్‌గా ఉన్న సమయంలో షర్మిలా ఠాకూర్ బాలీవుడ్ యాక్ట్రెస్‌గా ఉన్నది. ఆమె బాలీవుడ్లో పాపులర్ నటి అయినా.. పటౌడీ అంటే విపరీతమైన అభిమానం. ఏదో ఒక రోజు అతడిని కలవాలని కలలు కనేది. అప్పడప్పుడు స్టేడియంకు వెళ్లి అతడి ఆటను కూడా చూసి వచ్చేది. అయితే తెలిసిన వాళ్ల ద్వారా ఒకసారి వీరిద్దరూ కలిశారు. అక్కడే మాటా మాటా కలసి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో మునిగి తేలారు. చివరకు 1969లో పెళ్లి చేసుకున్నారు. వీరి అబ్బాయే ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్.
సచిన్ టెండుల్కర్ - అంజలీ
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండులక్కర్ చిన్న వయసులోనే ఇండియా తరపున టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఎంతో మంది సీనియర్లకు రాని పేరు, సంపాదని 20 ఏళ్లకే సచిన్ సొంతమయ్యాయి. సచిన్ ఆడుతుంటే కోట్లాది మంది అభిమానులు కళ్లప్పగించి చూస్తుండే వాళ్లు. అతడికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారిలో ఒకరు డాక్టర్ అంజలి. సచిన్ అంతే ఆమెకు విపరీతమైన అభిమానం. మనసులో ప్రేమకూడా ఉన్నది. కానీ తన కన్నా 6 ఏళ్లు చిన్నవాడైన సచిన్‌ను ఎలా ప్రపోజ్ చేయాలో అర్దంకాకపోయేది. అయితే ఒకానొక రోజు ధైర్యం చేసి సచిన్‌కు తన ప్రేమను వ్యక్తం చేసింది. అప్పటికే వారిద్దరి మధ్య పరిచయం ఉన్నది. సచిన్ చాలా ఓపెన్ మైండెడ్‌గా ఉంటాడు. అంజలి ప్రపోజ్ చేయగానే సచిన్ కూడా ఒప్పుకున్నాడు. వీరిద్దరూ 1995 మేలో పెళ్లి చేసుకున్నారు.
రోహిత్ శర్మ - రితిక సజ్దా
టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు హిట్ మ్యాన్ అని పేరున్నది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉంటూ ఐదు సార్లు టైటిల్ అందించాడు. కోహ్లీ గైర్హాజరిలో టీమ్ ఇండియాను కూడా నడిపిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలవోకగా సిక్సులు బాదే రోహిత్.. ఒక అమ్మాయి మనసును కూడా అలాగే దోచుకున్నాడు. అయితే ఆమె అతడి ఫ్యాన్ మాత్రమే కాదు రోహిత్‌కు మేనేజర్‌గా కూడా వ్యవహరించేది. వీరిద్దరి మధ్య ఎన్నాళ్ల నుంచో పరిచయం ఉన్నది. రితిక మనసులో ప్రేమను చెప్పడానికి చాలా సమయం తీసుకున్నది. కారణం అతడు తన బాస్ కావడమే. కానీ ఒక రోజు ధైర్యం చేసి తన మనసులో మాట చెప్పేసింది. అయితే ఎన్నాళ్ల నుంచో రోహిత్ కూడా ఆమెను ఇష్టపడుతున్నాడు. దీంతో వెంటనే ఒప్పేసుకున్నాడు. 2015 డిసెంబర్లో వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఒకటయ్యారు.
ఎంఎస్ ధోనీ - సాక్షి
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన హెలికాఫ్టర్ షాట్లతో ఎంతో మందిని అలరించాడు. ధోనీకి ఆడవాళ్లతో మాట్లాడటం అంటే చాలా మొహమాటం. తనకు ఎంతో మంది లేడీ ఫ్యాన్స్ ఉన్నా వారితో అంతగా మాట్లాడేవాడు కాదు. అయితే ధోనీ మొదటి ఒక అమ్మాయిని లవ్ చేయగా ఆమె యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ తర్వాత అతడు తిరిగి ప్రేమలో పడలేదు. సాక్షి, ధోనీ తొలిసారిగా తాజ్ బెంగాల్ హోటల్లో కలుసుకున్నారు. అయితే ధోనీ ఫ్యాన్ అయిన సాక్షి తరచుగా అతడిని కలుస్తూ ఉండేది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఒక రోజు ఆమె ప్రేమను వ్యక్తపర్చగా మిస్టర్ కూల్ కూడా ఒప్పుకున్నాడు. 2010లో వీరిద్దరూ డెహ్రాడూన్లోపెళ్లి చేసుకున్నారు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.