ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021) ప్రారంభించినప్పుడు స్థానిక క్రికెటర్లకు (Cricketers) మరింత ప్రోత్సాహం లభిస్తుందని బీసీసీఐ (BCCI) చెప్పింది. దేశవాళీ క్రికెట్లో రంజీ ట్రోపీ ఉన్నప్పటికీ.. ఐపీఎల్ ద్వారా మరింత మంది స్థానిక క్రికెటర్లకు (Local Teams) అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నది. ఇక 2008లో ఈ మెగా లీగ్ మొదలు పెట్టినప్పుడు 8 ఫ్రాంచైజీలను ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని ఫ్రాంచైజీలలో సీనియర్లు అయిన స్థానిక క్రికెటర్లతో పాటు కొత్త వారికి కూడా చోటు కల్పించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో ద్రవిడ్, కుంబ్లే.. ముంబై ఇండియన్స్ టీమ్‌లో సచిన్, హైదరాబాద్ టీమ్ (అప్పట్లో డెక్కన్ చార్జర్స్)లో వీవీఎస్ లక్ష్మణ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌లో సౌరవ్ గంగూలీ, ఢిల్లీ క్యాపిటల్స్( అప్పట్లో డేర్ డెవిల్స్) టీమ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ వంటి క్రికెటర్లు తమ సొంత నగరాల జట్లకు ప్రాతినిథ్యం వహించారు. వీరిని వేలంలో పెట్టకుండా నేరుగా ఆయా జట్లకు కేటాయించడంతో సొంత నగరాల జట్లకే ఆడారు. అయితే ఐపీఎల్లో ఐదుగురు స్టార్ క్రికెటర్లు మాత్రం ఇప్పటి వరకు తమ సొంత నగరాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న జట్ల తరపున ఆడలేదు.
విరాట్ కోహ్లీ(Virat Kohli) :
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సొంత నగరం ఢిల్లీ. ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు కోహ్లీ ఒక అన్క్యాప్డ్ ప్లేయర్. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి ఎంపికవుతాననే ధీమాతో ఉన్న కోహ్లీకి ఆ ఫ్రాంచైజీ షాక్ ఇచ్చింది. కోహ్లీ బదులు ప్రదీప్ సాంగ్వాన్‌ను జట్టులోకి తీసుకుంది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం రూ. 12 లక్షలకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 14వ సీజన్ వరకు కోహ్లీ ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
హర్భజన్‌సింగ్ (Harbhajan Singh):
వెటనర్ బౌలర్ హర్భజన్ సింగ్ ఇంత వరకు తమ సొంత నగరానికి చెందిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించలేదు. ఐపీఎల్ 13వ సీజన్ మినహా అన్ని సీజన్లలోనూ ఆడిన భజ్జీ.. తన ఐపీఎల్ కెరీర్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు మాత్రమే ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఏడాది సీఎస్కే విడుదల చేయడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అతడిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ తరపున ఆడతాడని అందరూ భావించారు. కానీ ఆ ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు.
దినేశ్ కార్తీక్ (Dinesh Karthik):
తమిళనాడులోని చెన్నైకి చెందిన దినేశ్ కార్తీక్ 2004లోనే టీమ్ ఇండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో 8 ఫ్రాంచైజీలు ఉంటే దినేశ్ కార్తీక్ 6 ఫ్రాంచైజీల తరపున ఆడటం విశేషం. అయితే తన కెరీర్లో సొంత నగరం జట్టైన చెన్నై సూపర్ కింగ్స్ తరపున మాత్రం ఆడలేదు. ఐపీఎల్లో కార్తీక్‌కు మెరుగైన రికార్డే ఉన్నది. 196 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ 26 సగటుతో 3823 పరుగులు చేశాడు. సీఎస్కేలో వికెట్ కీపర్ - బ్యాట్స్‌మాన్‌గా ధోనీ కొనసాగుతుండటంతో కార్తీక్‌కు అవకాశం రాలేదు.
శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer):
టీమ్ ఇండియా భవిష్యత్ కెప్టెన్‌గా పిలవబడుతున్న శ్రేయస్ అయ్యర్ సొంత ఊరు ముంబై. ఐపీఎల్ 2015లో అయ్యర్ తొలిసారి లీగ్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరపునే ఆడుతున్నాడు. ఈ సీజన్ గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే గత 5 సీజన్లలో అయ్యర్ 30 సగటుతో 2200 పరుగులు చేశాడు. ఢిల్లీ తరపున అత్యధిక పరుగులు చేసిన ఘనత అయ్యర్ పేరిటే ఉన్నది. ఢిల్లీ జట్టుకు మూడు సీజన్లుగా కెప్టెన్‌గా వ్యవహరించిన అయ్యర్ రెండు సార్లు ప్లేఆఫ్స్‌కు తీసుకొని వెళ్లాడు. అయితే సొంత నగరానికి ప్రాతినిథ్యం వహించే ముంబై ఇండియన్స్‌కు మాత్రం ఏనాడూ ఆడలేదు.
దీపక్ చాహర్ (Deepak Chahar):
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన దీపక్ చాహర్‌ది విచిత్రమైన పరిస్థితి. రాజస్థాన్‌కు చెందిన చాహర్.. 2011, 2012వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కానీ ఏ రోజూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత అతడిని ఐపీఎల్లో ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ అతడిని కొనుగోలు చేసినా పెద్దగా అవకాశాలు రాలేదు. 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న చాహర్ 48 మ్యాచ్‌లలో 45 వికెట్లు తీసి కీలక బౌలర్‌గా ఎదిగాడు. ఐపీఎల్ ప్రదర్శన ద్వారానే అతడు టీమ్ ఇండియాలో కూడా స్థానం సంపాదించాడు. అయితే తన సొంత జట్టైన రాజస్థాన రాయల్స్‌కు ఆడాలనే తన కల మాత్రం ఇప్పటికీ తీరలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harbhajan singh, IPL 2021, Virat kohli