పెద్దన్న అమెరికాను డ్రాగన్ దెబ్బకొట్టింది. తన నంబర్‌వన్ స్థానాన్ని లాగేసుకుంది. అవును ఎన్నో ఏళ్లుగా ఇటు ఆర్థికపరంగా అటు ఆధిపత్యం పరంగా ప్రపంచాన్ని శాసిస్తూ వస్తున్న అమెరికాను చైనా వెనక్కునెట్టింది. ఇది ఎక్కడంటారా.. పతకాల వేటలో.. ఏళ్లుగా ఒలింపిక్స్‌లో అమెరికాదే ఆధిపత్యం. స్వర్ణాల వేటలో వారిదే అగ్రస్థానం. కానీ, ఈ సారి చైనా గట్టి దెబ్బే కొట్టింది. అగ్రరాజ్యాన్ని రెండో స్థానంలో నిలబెట్టి టాప్‌లో నిలిచింది. 37 స్వర్ణాలతో పెద్దన్నను ఓరగా చూస్తోంది. ఇప్పటికే ఆర్థికపరంగానూ తన స్థానానికి ఎసరు పెడుతున్న చైనా ఇపుడు ఒలింపిక్స్‌లోనూ దెబ్బకొట్టడం అమెరికాకు రుచించని విషయం. ఒలింపిక్స్ 28 సార్లు నిర్వహించగా అందులో 17 సార్లు అమెరికాదే అగ్రస్థానం. గత రియో ఒలింపిక్స్‌లో అమెరికా 46 స్వర్ణాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఇపుడు చైనా రావడం పెద్దన్న ఆధిపత్యానికి గండిపడటం లాంటిదే. ఇప్పటికే కరోనాను కట్టడి చేయడంలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా చైనా నిలిచింది. అన్ని దేశాల కంటే ముందే లాక్డౌన్ ఎత్తేసి ఔరా అనిపించుకుంది. పెద్దన్న మాత్రం కోవిడ్ దెబ్బకు కుదేలయ్యాడు. ఒలింపిక్స్ జరిగే చివరి రెండు రోజుల్లో 40కిపైగా ఈవెంట్లు ఉండటంతో అమెరికా అగ్రస్థానం కోసం ఆశలు పెట్టుకుంది. తన స్థానాన్ని డ్రాగన్ నుంచి తిరిగి సంపాదించుకోవాలని పట్టుదలగా ఉంది.
4 స్వర్ణాలే తేడా..
స్వర్ణాల రేసులో ఫ్రాన్స్, జపాన్, రష్యా, చైనాలు గట్టిగా పోటీపడినా ఈ సారి అమెరికాదే పైచేయిగా అందరూ భావించారు. కానీ, ఇప్పటివరకు కేవలం 33 స్వర్ణాలు 36 రజతాలు 32 కాంస్యాలతో రెండో స్థానంలో నిలిచింది. అదే డ్రాగన్ దేశం చైనా 37 స్వర్ణాలు 28 రజతాలు 17 కాంస్యాలతో అగ్రస్థానంలో ఉంది. మొత్తం పతకాలతో అమెరికాది టాప్ అయినా సాధారణంగా మొదటి స్థానం ఇచ్చేది మాత్రం స్వర్ణాల లెక్కమీదే. దీంతో ప్రస్తుతానికైతే చైనానే నంబర్‌వన్.
టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికాకు ప్రధానంగా జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్‌లో ఎదురుదెబ్బలు తగిలాయి. రియోలో అథ్లెటిక్స్‌లో అమెరికాకు 13 పతకాలు రాగా, టోక్యోలో కేవలం 5 పతకాలు మాత్రమే వచ్చాయి. ఇక గతంలో మైకెల్ ఫెల్ప్ష్ లాంటి వాళ్లు స్విమ్మింగ్‌లో ఆధిపత్యం చెలాయించి పతకాలు కొల్లగొట్టేవాళ్లు. కానీ, సారి అమెరికా స్విమ్మర్లు తేలిపోయారు. వారికి పోటీగా ఆస్ట్రేలియా 9 స్వర్ణాలతో దెబ్బకొట్టింది. ప్రస్తుతం యూఎస్‌కు 11 పతకాలు స్విమ్మింగ్‌లో వచ్చాయి. మరోవైపు జిమ్నాస్టిక్స్‌లో పేరుగాంచిన సిమోన్ బైల్స్ కూడా చాలా ఈవెంట్లలో బరిలోకి దిగకపోవడంతో స్వర్ణాలకు ఎసరు పడింది. ఏళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తున్న ఇలాంటి విభాగాల్లో పతకాలు తగ్గడంతో అమెరికా రెండో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చైనాలో జరిగిన ఒలింపిక్స్‌లో డ్రాగన్ దేశం మొదటిస్థానంలో నిలిచినా.. దేశం బయట జరిగిన ఒలింపిక్స్‌లో టాప్‌లో నిలవడం ఇదే తొలిసారి. ఏళ్లుగా అమెరికాకు చెక్ పెట్టి ప్రపంచంలో గుత్తాధిపత్యాన్ని సాధించాలనుకుంటున్న డ్రాగన్ దేశానికి టోక్సో ఒలింపిక్స్ ఊరటనిచ్చేదే. చూద్దాం చివరి రెండు రోజుల్లోనైనా అమెరికా చైనాకు చెక్ పెట్టేనా.. లేదా మొదటి స్థానాన్ని డ్రాగన్‌కే అప్పగిస్తుందా.. వెయిట్ అండ్ వాచ్...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Games, Gold, Tokyo Olympics, US-China