Team India : ఆ క్రికెటర్ ఇక టెస్టులు ఆడటం కష్టమే.. ఎందుకో రీజన్ చెప్పిన ఎమ్మెస్కే ప్రసాద్

ఆ క్రికెటర్ టెస్టు జట్టులోకి రావడం కష్టమే. (PC: BCCI)

కెరీర్ ప్రారంభంలో ఒక ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యా ఈ మధ్య పెద్దగా రాణించడం లేదు. వెన్నుపూసకు శస్త్ర చికిత్స జరిగిన నాటి నుంచి బౌలింగ్ కూడా చేయడం లేదు. మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ఇంకా ఏం చెప్పారంటే...

  • Share this:
    డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final), ఇంగ్లాండ్ టూర్ (England Tour) కోసం 24 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ (BCCI) సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అనూహ్యంగా ఈ జట్టులో పృథ్వీషా, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యాలకు (Hardik Pandya) చోటు దక్కలేదు. ఐపీఎల్ 2021లో వరుసగా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన పృథ్విషాను పక్కన పెట్టడం వెనుక అతడి గత రికార్డులే అని తెలుస్తున్నది. పృథ్వీషాకు ఇండియా పిచ్‌లపై మంచి రికార్డే ఉన్నా విదేశాల్లో మాత్రం పేలవమైన రికార్డులు ఉన్నాయి. విదేశీ పర్యటనల్లో పృథ్వీషా పెద్దగా రాణించలేదు. ఇక ఫిట్‌నెస్ కారణాలతో భువనేశ్వర్‌ను పక్కన పెట్టారు. ఐపీఎల్‌లో కూడా గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో అతడిని ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. ఇక జట్టులో ఆల్‌రౌండర్ల కొరత ఉండగా హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) తప్పించడం చర్చనీయాంశంగా మారింది. కెరీర్ స్టార్టింగ్‌లో పాండ్యా ఒక మంచి ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు. కానీ క్రమంగా తన ఫామ్ కోల్పోతూ వచ్చాడు. వెన్ను నొప్పి కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్యా అంతగా రాణించడం లేదు.

    మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పాండ్యాను ఎంపిక చేయకపోవడం పట్ల ఒక విశ్లేషణ చేశారు. 'హార్దిక్ పాండ్యా సర్జరీ తర్వాత తొలి సారిగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరస్‌కు ఎంపికయ్యాడు. కానీ ఈ సిరీస్‌లో అతడి చేత ఒక్క ఓవర్ కూడా వేయించలేదు. కేవలం బ్యాట్స్‌మాన్‌గానే తప్ప బౌలర్‌గా అసలు ఉపయోగించలేదు. ఒక ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్యా ఈ మధ్య బౌలింగ్ చేయడం లేదు. బ్యాటింగ్ చేస్తున్నా నిలకడ లేకుండా పోయింది. అందుకే ఇకపై అతడిని టెస్టులకు పరిగణించక పోవచ్చు' అని ఎమ్మెస్కే అన్నారు. కేవలం బ్యాట్స్‌మాన్ కావాలనుకుంటే టీమ్ ఇండియా వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయి. హనుమవిహారిని అందుకే ఎంపిక చేశారని ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప హార్దిక్ పాండ్యాను ఇకపై టెస్టు జట్టుకు ఎంపిక చేయడం కష్టమేనని ప్రసాద్ వెల్లడించారు.

    జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా న్యూజీలాండ్‌తో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరుగనున్నది. ఆ తర్వాత కూడా భారత జట్టు ఇంగ్లాండ్‌లోనే ఉంటుంది. అగస్టు-సెప్టెంబర్ నెలల్లో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనున్నది. కరోనా కారణంగా క్రికెటర్లు అందరూ బయోబబుల్‌లో ఉండాల్సి రావడంతో రెండు సిరీస్‌లకు 24 మంది సభ్యులతో కూడిన జంబో టీమ్‌ను ఎంపిక చేశారు. ఇందులో 20 మంది రెగ్యులర్ టీమ్ మెంబర్స్ కాగా, నలుగురు యువ పేసర్లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేసింది. మే నెలాఖరున టీమ్ ఇండియా ఇంగ్లాండ్ బయలు దేరి వెళ్లనున్నట్లు సమాచారం.
    Published by:John Naveen Kora
    First published: