Hanuma Vihari : తెలుగు క్రికెటర్ మంచి మనస్సు..ప్రేమోన్మాది చేతిలో గాయపడిన అమ్మాయికి సాయం..

Hanuma Vihari (File Photo)

Hanuma Vihari : హనుమ విహారీ.. (Hanuma Vihari ) ఈ తెలుగు క్రికెటర్ కరోనా సాయంలో హీరోగా మారాడు. తన బృందంతో కరోనా టైంలో ఎంతో మందికి అండగా నిలిచిన హనుమ విహారీ ఇప్పుడు మరో సారి తన మంచి మనసు చాటుకుని శభాష్ అన్పించుకుంటున్నాడు. ఇంతకీ ఈ క్రికెటర్ ఏం చేశాడంటే..

 • Share this:
  టీమిండియా టెస్ట్ బ్యాట్స్ మన్, తెలుగు క్రికెటర్ హనుమ విహారీ (Hanuma Vihari) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా సమయంలో బాధితులకు అండగా నిలిచి.. వారి సహాయార్థం తన మిత్రులతో కలిసి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా కరోనా బాధితులకు పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ సేవల్ని అందజేస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రేమోన్మాది చేతిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ అమ్మాయిని కాపాడాడు. సరైన సమయంలో విహారి డబ్బు అందించడంతో ప్రియాంక అనే అమ్మాయి ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటోంది. వివరాల్లోకి వెళితే... శ్రీకాంత్ అనే అబ్బాయి ప్రేమ పేరుతో ప్రియాంకను నిత్యం వేధించేవాడు. ఓ రోజు శ్రీకాంత్ ప్రపోస్ చేయగా.. ప్రియాంక నిరాకరించింది. దీంతో ఆవేశపడిన శ్రీకాంత్.. కత్తితో ప్రియాంక గొంతును కోశాడు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆపరేషన్ కోసం 6 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. అంత మొత్తం చెల్లించుకోలేని ప్రియాంక కుటుంబసభ్యులు సోషల్ మీడియాలో సాయం చేయాలనీ కోరారు. విషయం తెలుసుకున్న హనుమ విహారి.. వెంటనే 5 లక్షలు పంపాడు. ఆపరేషన్ చేయించుకున్న ప్రియాంక ప్రస్తుతం కోలుకుంటోంది. విహారి చేసిన సాయంపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌లో ఉన్న హనుమ విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంటకనిపెట్టుకున్నాడు.

  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం తన మిత్రుల సహకారం కోరగా.. వారంతా కలిసివచ్చారు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. వీరందరూ పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ లాంటి పలు సేవల్ని ప్రజలకు అందజేస్తున్నారు.


  27 ఏళ్ల హనుమ విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ డ్రా చేసుకున్న సిడ్నీ టెస్టులో విహారి.. ఆర్ అశ్విన్‌తో కలిసి నాలుగు గంటల పాటు పోరాడి జట్టును ఆదుకున్నాడు. కానీ ఈ మ్యాచ్‌ అయ్యాక గాయం కారణంగా స్వదేశానికి వచ్చేశాడు. ఆపై స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అతనికి అవకాశం దక్కలేదు. ఇక ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా సమరం కోసం విహారి ప్రాక్టీస్ చేస్తున్నాడు. పటిష్టంగా ఉన్న టీమిండియా తుది జట్టులో విహారీ చోటు దక్కించుకోవడం కష్టమే. ఒక వేళ బ్యాటింగ్ డెప్త్ అవసరం అనుకుంటే కచ్చితంగా విహారిని తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.
  Published by:Sridhar Reddy
  First published: