ఐసీసీ (ICC) పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) సూపర్ 12 మ్యాచ్‌లు ప్రారంభం కావడానికి మరో రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో (IPL 2021) పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమ్ ఇండియా (Team India) క్రికెటర్లు లీగ్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్ కప్ కోసం దుబాయ్‌లోనే ఉండనున్నారు. కీలకమైన మెగా టోర్నీకి ముందు టీమ్ ఇండియాకు పెద్ద షాక్ తగిలింది. టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతిని ఆపే క్రమంలో డైవ్ చేసి గాయపడటంతో ఫిజియో మైదానంలోకి వచ్చాడు. కాసేపు ప్రథమ చికిత్స అందించిన తర్వాత కూడా రోహిత్ కోలుకోకపోవడంతో అతడు మైదానాన్ని వీడాడు. అయితే రోహిత్‌కు ఎలాంటి గాయం అయ్యింది? అతడి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
రోహిత్ గాయంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కామెంట్రీ బాక్సులో ఉన్న హెడన్.. గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తున్నదని అన్నాడు. అదే జరిగితే రోహిత్ ప్లే ఆఫ్స్‌కు మాత్రమే కాకుండా టీ20 వరల్డ్ కప్‌కు కూడా దూరమయ్యే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చాడు. రెండో దశ ప్రారంభమైన తర్వాత మొదటి మ్యాచ్‌కు కూడా రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఆ తర్వాత కూడా ఒక మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే సమయంలో కూడా రోహిత్ శర్మ క్రీజులో అసౌకర్యంగా కనిపించాడు.
టీ20 వరల్డ్ కప్‌లో కీలకమైన రోహిత్ శర్మ గాయం ఇప్పుడు టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్‌ను కలవర పరుస్తున్నది. ఇప్పటికే బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు లేఖలు కూడా రాసింది. టీ20 వరల్డ్ కప్‌లో ఆడబోతున్న టీమ్ ఇండియా ప్లేయర్లకు తగినంత విశ్రాంతి కల్పించాలని కూడా కోరింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీని వదిలేస్తానని విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రోహిత్ శర్మ పాత్ర కీలకంగా మారింది. కాగా, గాయం చిన్నదే అయితే రెండు వారాల వ్యవధిలో కోలుకునే అవకాశం ఉన్నది. ఒక వేళ ముంబై ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాకపోతే రోహిత్ శర్మకు తగినంత విశ్రాంతి దొరికే అవకాశం ఉన్నది. ఇక టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ చీఫ్ సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. స్టాండ్ బై ప్లేయర్లుగా ముగ్గురు క్రికెటర్లను చేర్చింది.
టీమ్ ఇండియా : విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
రిజర్వ్ ప్లేయర్లు: శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rohit sharma, T20 World Cup 2021, Team India