ఐసీసీ (ICC) పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World cup) పూర్తి షెడ్యూల్ (Schedule) మంగళవారం విడుదలైంది. ఒమన్, యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి తొలి రౌండ్ మ్యాచ్‌లు జరుగనుండగా... సూపర్ 12 మెయిన్ డ్రా మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. దాయాది దేశాలు ఇండియా, పాకిస్తాన్ ఒకే గ్రూప్ (గ్రూప్ 2)లో ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ ప్రయాణంలో టీమ్ ఇండియా తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో (India Vs Pakistan) తలపడనున్నది. గత కొన్నేళ్లుగా ఇండియా-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ వైరం కారణంగా ద్వైపాక్షిక సిరీలు లేకపోవడంతో కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. ఇరు దేశాలు చివరి సారిగా 2019 వన్డే వరల్డ్ కప్‌లో తలపడ్డాయి. 2019 జూన్ 16న జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఇక రెండేళ్ల తర్వాత ఇండియా-పాకిస్తాన్ జట్లు అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా మరోసారి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడనున్నాయి. గత వరల్డ్ కప్ రికార్డులు పరిశీలిస్తే భారత జట్టు ఒక్క సారి కూడా పాకిస్తాన్‌పై ఓడిపోలేదు. వన్డే వరల్డ్ కప్‌లో 7 సార్లు, టీ20 వరల్డ్ కప్‌లో 5 సార్లు ఇరు జట్లు తలపడ్డాయి. అన్ని మ్యాచ్‌లు టీమ్ ఇండియానే విజయం సాధించింది. ఈ సారి కూడా టీమ్ ఇండియానే హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది.
పాకిస్తాన్ జట్టు గత కొన్నేళ్లుగా టీ20 మ్యాచ్‌లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నది. ముఖ్యంగా యూఏఈలో అనేక ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడిన అనుభవం ఉండటంతో అక్కడి పిచ్‌లపై పాకిస్తాన్ జట్టుకు అవగాహన ఉన్నది. మరోవైపు ఐపీఎల్ 2020, 2021 రెండో దశ యూఏఈ వేదికగానే జరుగుతున్నది. టీమ్ ఇండియాలో ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్ ఆడటం ద్వారా యూఏఈ పిచ్‌లకు అలవాటు పడటం కూడా కలసి రానున్నది. ఇక ఇరు జట్లు చెరో టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్నాయి. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది. ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి ధోనీ సేప అరంగేట్రం వరల్డ్ కప్ కైవసం చేసుకున్నది. ఇక పాకిస్తాన్ 2009లో జరిగిన టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇరు జట్లు ఆ తర్వాత ఒక్క టీ20 వరల్డ్ కప్ కూడా గెలవలేక పోయాయి. ఐసీసీ చివరి సారిగా ఇండియా వేదికగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించింది. ఐదేళ్ల విరామం తర్వాత యూఏఈ, ఒమన్ వేదికగా మరోసారి టీ20 వరల్డ్ కప్ జరుగనున్నది. వెస్టిండీస్ జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా.. ఇండియా, ఆస్ట్రేలియా, ఇండియా హాట్ ఫేవరెట్లుగా ఉన్నాయి.
టీమ్ ఇండియా ఉన్న గ్రూప్ 2లోనే పాకిస్తాన్‌తో పాటు న్యూజీలాండ్, అఫ్గానిస్తాన్ జట్లు ఉన్నాయి. వీటితో పాటు రౌండ్ 1లో జరిగే మ్యాచ్‌లలో గ్రూప్ ఏలో రెండో స్థానంలో నిలిచిన జట్టు, గ్రూప్ బిలో అగ్రస్థానం వచ్చిన జట్లు కూడా ఈ గ్రూప్‌లో చేరతాయి.
T20 WC Schedule: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?
ఇండియా పూర్తి షెడ్యూల్...
అక్టోబర్ 24 - ఇండియా Vs పాకిస్తాన్ - దుబాయ్ (రాత్రి 7.30)
అక్టోబర్ 31 - ఇండియా Vs న్యూజీలాండ్ - దుబాయ్ (రాత్రి 7.30)
నవంబర్ 3 - ఇండియా Vs అఫ్గానిస్తాన్ - అబుదాబి (రాత్రి 7.30)
నవంబర్ 5 - ఇండియా Vs బీ1 - దుబాయ్ (రాత్రి 7.30)
నవంబర్ 8 - ఇండియా Vs ఏ2 - దుబాయ్ (రాత్రి 7.30)
నవంబర్ 10 - సెమీఫైనల్ 1 - అబుదాబి (రాత్రి 7.30)
నవంబర్ 11 - సెమీఫైనల్ 2 - దుబాయ్ (రాత్రి 7.30)
నవంబర్ 14 - ఫైనల్ - దుబాయ్ (రాత్రి 7.30)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.