క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించక ముందే కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన దినేశ్ కార్తీక్(Dinesh Karthik), తనదైన స్టైల్‌లో అభిమానులను అలరిస్తున్నాడు. తొలి టెస్టు సమయంలో విరాట్ కోహ్లీ (Virat Kohli)ని ఇంటర్వ్యూ చేసి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను బయటకి తీసుకొచ్చిన కార్తీక్, ఇప్పుడు రోహిత్ శర్మ (Rohit Sharma)తో ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇక, 2011 ప్రపంచకప్ భారత్ నెగ్గిన విషయం తెలిసిందే. 28ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ప్రపంచ క్రికెట్ వేదికపై భారత జెండా రెపరెలాడింది. అయితే ప్రస్తుతం టీమిండియా టాప్ ఓపెనర్‌గా పేరు పొందిన రోహిత్ శర్మకు మాత్రం ఛాన్స్ దక్కలేదు. అప్పటికి జట్టులోకి రావడానికే రోహిత్ శర్మ అష్టకష్టాలు పడ్డాడు. అయితే తాజాగా రోహిత్ శర్మ అప్పటి తన పరిస్థితి గురించి వివరించాడు. ఆ సమయం తన జీవితంలో చీకటి కాలమని అన్నాడు. " 2011 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడం నిజంగా నా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లోనే చీకటి సమయం. అప్పుడు నన్ను నేనే తిట్టుకున్నాను. అయితే ప్రపంచకప్ ముందు నా ఆట అంత మెరుగ్గా లేకపోవడమే అందుకు కారణం అయి ఉండవచ్చు" అని రోహిత్ పేర్కొన్నాడు.అయితే 2019 ప్రపంచకప్‌లో కోహ్లీ నాయకత్వంలో బరిలోకి దిగిన భారత జట్టులో రోహిత్ అద్భుత ప్రదర్శనతో రాణించాడు. టోర్నీలో అత్యధికంగా 5 సెంచరీలు సాధించడమే కాకుండా.. 81 సగటుతో 648 పరుగులు చేసి టోర్నీలోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక, రితికా సజ్దేతో ప్రేమాయణం గురించి దినేశ్ కార్తీక్ ప్రశ్నించగా.. ఆమె తన వద్ద మేనేజర్‌గా పనిచేసేదని, ఆ క్రమంలో ఇద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లమే తప్పా తమకు ఆ ఆలోచనే లేదని రోహిత్ బదులిచ్చాడు. "అప్పుడు ఇప్పుడు నా మేనేజర్ రితికా సజ్దేనే. ఆ క్రమంలో మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. మంచి స్నేహితులయ్యాం. ముందుగా మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధంలేదు. అసలు మాకు ఆలోచన కూడా లేదు. కేవలం వర్క్‌కు సంబంధించిన రిలేషన్ తప్పా మరేది లేదు. కావాలంటే రితికా ఇక్కడే ఉంది అడగండి. అయితే మా మధ్య ఉన్న చనువు చూసి చాలా అనేవారు. కానీ మేం వాటిని పట్టించుకునేవాళ్లం కాదు.
నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మీరిద్దరూ క్యూట్ కపుల్‌గా ఉన్నారని, మీ ఇద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందనేవారు. నేను మాత్రం వాటిని తప్పుబట్టేవాడిని. అలాంటిదేం లేదని, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని గట్టిగా చెప్పేవాడిని. కానీ కొన్నాళ్లకు వారు చెప్పిందే నిజమైంది. అప్పుడు వాళ్లకు ఈ విషయం ఎలా చెప్పాలి అని ఆలోచించేవాడిని. ఎందుకంటే వాళ్లు చాలా రోజుల ముందే ఈ విషయం చెప్పారు. అయితే అఫిషియల్‌గా మేమిద్దరం డేటింగ్ చేసిన కొన్నాళ్లకు ఎలాగోలా వాళ్లకు చెప్పేసాను. వారికి చెప్పడానికి భయం కాదు కానీ అదో విభిన్నమైన ఫీలింగ్.
20 ఏళ్ల క్రితం నాకున్న చిన్ననాటి స్నేహితులు ఇప్పటికి నాతో టచ్‌లో ఉన్నారు. వారితో కలవడం, తిరగడం చాలా ఇష్టం. నా ఆటను వాళ్లు ఇష్టపడుతారు. అతనే నిజాయితీగా నా తప్పులను కూడా చెబుతారు. ఏం షాట్ ఆడవని, నువ్వు తప్పుచేసావ్, మంచి చేసావ్ అని నా క్లోజ్ ఫ్రెండ్స్ చెబుతారు. నేను కూడా వారితో అలానే ఉంటా. వారి వ్యక్తిగత విషయాలు నాతో పంచుకున్నప్పుడు కావాల్సిన సలహాలు కూడా ఇస్తాను. ఇప్పటికీ వాళ్లంతా నాతో టచ్‌లోనే ఉన్నారు. మా మధ్య అదే తరహా స్నేహం ఉంది." అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Dinesh Karthik, India vs england, Rohit sharma, Sports