TEAM INDIA SKIPPER VIRAT KOHLI HAS LEFT THE HIS DUTIES WHY INDIAS MOST SUCCESSFUL TEST SKIPPER BOWED OUT NOW SRD
Virat Kohli : విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం వెనుక కథేంటి..? టీమిండియా బెస్ట్ కెప్టెన్ ఇలా ఎందుకు చేశాడు..?
Virat Kohli
Virat Kohli : గత దశాబ్ద కాలంగా కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల గుండెచప్పుడుగా మారిన విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫ్యాన్స్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. అసలు విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయాల వెనుక కథేంటి...?
విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత దశాబ్ద కాలంగా కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల గుండెచప్పుడుగా మారిన విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫ్యాన్స్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఈ శతాబ్దపు అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీ ఇప్పుడు టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓటమి అనంతరం టీమ్ఇండియా (Team India) టెస్టు సారథి విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు సారథిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కొంతకాలంగా టీమిండియాలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులన్నీ కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ చుట్టునే జరుగుతుండడం గమనార్హం. ఇప్పటికే టీమిండియా టీ20, వన్డే కెప్టెన్సీకి దూరమైన కోహ్లీ ఈ నెల 15న టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించి పెను సంచలనం సృష్టించాడు.
దీంతో భారత జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ పూర్తిగా తప్పుకున్నట్లయింది. అంతేకాకుండా టీమిండియాతోపాటు అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్‌గా విరాట్ శకం ముగిసిందనే చెప్పుకోవచ్చు.టీమిండియా కెప్టెన్సీ హోదాలో విరాట్ కోహ్లీ తిరుగులేని శక్తి ఎదిగాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎంతటి ఆటగాడికైనా ఏదో ఒక రోజు జట్టులో వ్యతిరేకత ప్రారంభమవుతోంది. విరాట్ కోహ్లీ విషయంలోనూ అదే జరిగినట్లు అర్థమవుతోంది.
టీమిండియా ది బెస్ట్ కెప్టెన్ :
టీమిండియాకు కెప్టెన్సీ చేయడం అంటే ఆషామాషీ కాదు. ఎందరో దిగ్గజాలు టీమిండియాను టెస్టుల్లో సమర్ధవంతంగా నడిపించారు. అయితే, టెస్టుల్లో కోహ్లీ కెప్టెన్సీ రికార్డులు మరే ఇతర సారథి కూడా సాధ్యం కాలేదన్నది అక్షర సత్యం. 1932 లో టీమిండియాకు సీకే నాయుడు మొదటి కెప్టెన్ గా వ్యవహరించారు. అయితే, లాలా అమరనాథ్, టైగర్ పటౌడీ నేతృత్వంలోని టీమిండియానే ఫస్ట్ విదేశాల్లో విక్టరీ కొట్టింది. అయితే, ఈ శతాబ్దంలో బెస్ట్ కెప్టెన్లుగా పేరొందిన గంగూలీ, ధోనీలు కూడా కోహ్లీ దరిదాపుల్లో లేరు. కోహ్లీ కెప్టెన్సీ రికార్డులే అందుకు నిదర్శనం.
కోహ్లీ.. 68 మ్యాచుల్లో టీమిండియాను నడిపించగా 40 సార్లు గెలిపించాడు. కేవలం 17 మ్యాచుల్లోనే ఓటమి పాలయ్యాడు. మరో 11 మ్యాచులు డ్రా అయ్యాయ్. అతని విజయ శాతం 58.82. విరాట్ కోహ్లీ కన్నా ముందు స్టీవ్ వా (71.92 శాతం), రికీ పాంటింగ్ ( 62.33 శాతం) మాత్రమే ముందున్నారు. అలాగే, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో విదేశాల్లో టీమిండియా 16 టెస్ట్ మ్యాచుల్లో నెగ్గింది.
విరాట్ కోహ్లీ తప్పుకోవడానికి కారణమేంటి..?
నిజానికి భారత కెప్టెన్సీ మార్పు విషయం 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఓటమి అనంతరమే తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో సెలెక్టర్లు కోహ్లీ కెప్టెన్సీపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో అప్పుడే కెప్టెన్సీ మార్పునకు పునాదులు పడ్డాయని తెలుస్తోంది.
హెడ్ కోచ్‌గా రవి శాస్త్రి పదవి కాలం ముగిసి పోవడంతోనే కెప్టెన్‌గా కోహ్లీ టైమ్ కూడా అయిపోయిందని చెప్పుకోవాలి. అగ్రెసివ్ కెప్టెన్ అయినా కోహ్లీకి, కూల్ వ్యక్తి అయినా కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు మధ్య సఖ్యత కుదరలేదని తెలుస్తోంది. దీనికి తోడు జట్టులోని కొందరు ఆటగాళ్లు కోహ్లీ తీరుపై బీసీసీఐతోపాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో కెప్టెన్ అయినప్పటికీ కోహ్లీ నిర్ణయాలను మేనేజ్మెంట్ పట్టించుకోకుండా జట్టులో తమ నిర్ణయాలనే అమలు చేసిందట. దీంతో తీవ్ర మనో వేదనకు గురైన విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడని సమాచారం. అదిగాక, సౌతాఫ్రికా టూర్ ముందు గంగూలీ వ్యాఖ్యలకు కోహ్లీ కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే.
ముందుగానే కోహ్లీ నిర్ణయించుకున్నాడా..?
సఫారీ పర్యటలో టీమిండియా ఓడిపోతే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని సెలెక్టర్లు ముందే నిర్ణయించుకున్నారని తెలిసింది. అలాగే సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు ఓడిపోయింది. దీంతో మరోసారి సెలెక్టర్లతో అవమానకర రీతిలో వేటు వేయించుకోవడం కన్నా తనే తప్పుకోవడం బెటర్ అనే ఉద్దేశ్యంతో కోహ్లీ తప్పుకున్నాడని సమాచారం. కాగా టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ కోహ్లీపై సెలక్టర్లు గతంలో వేటు వేసిన సంగతి తెలిసిందే.
టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ ఎవరు..?
వన్డే, టీ-20ల కెప్టెన్.. రోహిత్ శర్మ ఈ రేసులో ముందంజలో ఉన్నాడు. అయితే, రోహిత్ టెస్ట్ జట్టుకు కూడా కెప్టెన్ అవుతాడా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మీడియా కథనాల ప్రకారం ఇది జరగడం చాలా కష్టమని తెలుస్తోంది. విరాట్ కోహ్లి రాజీనామా తర్వాత ప్రస్తుతం కేఎల్ రాహుల్ తదుపరి టెస్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్ టెస్టు జట్టులో భారత జట్టుకు కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టాడు. విరాట్ కోహ్లి టెస్ట్‌కు ముందు వెన్ను గాయంతో దూరమైన సంగతీ తెలిసిందే. ఆ తర్వాత కోహ్లీ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. అయితే కేప్ టౌన్ టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు.
మరోవైపు రోహిత్ శర్మకు తన వయస్సే పెద్ద అడ్డంకిగా మారనుంది. రోహిత్ శర్మ ప్రస్తుత వయస్సు 34 ఏళ్లు. ఈ వయస్సులో ఉన్నవారు టెస్టు క్రికెట్ ఆడే కాల పరిమితి చాలా తక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. దీంతో, వయస్సు రీత్యా రోహిత్ శర్మను పక్కన పెట్టే ఛాన్సు ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, రోహిత్ కు ఓ రెండేళ్లు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించి.. ఆ తర్వాత యంగ్ క్రికెటర్లకు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తో పాటు రిషబ్ పంత్ కూడా టెస్ట్ కెప్టెన్సీ రేసులోనే ఉన్నాడు. ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ కు నాయకత్వం వహించిన అనుభవం రిషబ్ సొంతం. యంగ్ క్రికెటర్లు, సీనియర్లను కలుపుకుపోవడంలో దిట్ట. అదీగాక, వికెట్ కీపర్ బ్యాటర్ కు మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయన్నది క్రీడా పండితుల అభిప్రాయం. దీంతో, రిషబ్ పంత్ వైపు కూడా బీసీసీఐ మొగ్గు చూపే ఛాన్సు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, రోహిత్, పంత్, కేఎల్ రాహుల్ మధ్య టెస్టు కెప్టెన్సీకి తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.