Prithvi Shaw : పృథ్వీ షా గోవా ట్రిప్ ను అడ్డుకున్న పోలీసులు..కారణమిదే..

Prithvi Shaw : పృథ్వీ షా గోవా ట్రిప్ ను అడ్డుకున్న పోలీసులు..కారణమిదే..

Prithvi Shaw : దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ కేంద్రం అన్ని విమానాలపై నిషేధం విధించింది. దీంతో చాలా మంది తమ సొంత వాహనాలనే నమ్ముకున్నారు.

 • Share this:
  దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజు రోజు కి పరిస్థితి దిగజారుతుండటంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ వైపు అడుగేస్తున్నాయ్. మరి కొన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయ్. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలంటే కచ్చితంగా రూల్స్ పాటించాల్సిందే. అయితే, టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడు. లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా.. అధికారుల అనుమతి లేకుండా గోవాకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.దీంతో పోలీసులు అతన్ని మహారాష్ట్రలోని అంబోలీ జిల్లా వద్ద అడ్డుకున్నారు. పృథ్వీషా ఎంత ప్రాదేయపడినా పోలీసులు కనికరించలేదు. అందరికి రూల్స్ ఒకటేనని, స్టార్ క్రికెటర్ అయినా.. సామన్య పౌరుడైనా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమిలేక పృథ్వీ షా గంటన్నర పాటు నిరీక్షించి మొబైల్ ఫోన్ ద్వారా అనుమతి పొందాడు. పూర్తి వివరాళ్లోకి వెళితే... కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్‌ 2021 సీజన్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసినా విషయం తెలిసిందే. సజావుగా సాగుతున్న లీగ్‌లోకి దూసుకొచ్చిన వైరస్ వేగంగా ఆటగాళ్లకు సోకింది. దాంతో ప్లేయర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని లీగ్‌ను తాత్కలికంగా రద్దు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా ఇటీవల హోం ఐసోలేషన్‌ను పూర్తి చేసుకున్నాడు. అయితే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో పృథ్వీషాకు చోటు దక్కలేదు. దాంతో ఈ విరామ సమయాన్ని గోవాలో ఆస్వాదిద్దామనుకున్నాడు.

  దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ కేంద్రం అన్ని విమానాలపై నిషేధం విధించింది. దీంతో తన సొంత కారులోనే పృథ్వీ షా గోవాకు బయలుదేరాడు. అయితే కరోనా విజృంభిస్తున్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్న ఈ పాస్‌ ఉంటేనే పోలీసులు అనుమతిస్తున్నారు. పృథ్వీ షా వద్ద ఈపాస్‌ లేకపోవడంతో అంబోలీ జిల్లా చెక్‌పోస్టు వద్ద పోలీసులు అతని కారును అడ్డుకున్నారు. అనుమతి లేకుండా గోవా వెళ్లడం కుదరదన్నారు. పృథ్వీ షా ఎన్నిసార్లు అడిగినా పోలీసులు ఒప్పుకోకవడంతో.. గంటపాటు వేచిఉండి తన మొబైల్‌ నుంచే ఈ పాస్‌‌కు దరశాస్తు చేశాడు. అనుమతి వచ్చిన తర్వాత పోలీసులకు చూపించి బయల్దేరాడు.

  మరోవైపు, ఇంగ్లండ్ పర్యటనకు పృథ్వీ షా ను ఎంపిక చేయలేదు సెలక్టర్లు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయ్. ఎందుకంటే, పృథ్వీ షా మంచి ఫామ్ లో ఉన్నాడు. విజయ హజారే ట్రోఫి లో దుమ్మురేపడమే కాకుండా..ఐపీఎల్ 2021 సీజన్ లోనూ సూపర్ షోతో సత్తా చాటాడు.ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో, అతన్ని సెలక్ట్ చేయాలని చాలా మంది మాజీలు అభిప్రాయపడ్డారు.
  Published by:Sridhar Reddy
  First published: