విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న తర్వాత.. బీసీసీఐ (BCCI) అతడిని వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కోహ్లీ.. తనకు తానే స్వయంగా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్, సహచరులు, టీమిండియా మాజీ క్రికెటర్లు కోహ్లీ ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి హైదరాబాదీ గల్లీబాయ్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)చేరాడు. సిరాజ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ పోస్టు చేశాడు.''నువ్వే నా సూపర్ హీరో. నీ నుంచి నాకు లభించిన మద్దతుకు, ప్రోత్సాహానికి కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదు. నువ్వు నాకు ఎప్పుడూ పెద్ద అన్నవే. ఇన్నేళ్లుగా నన్ను నమ్మి, నన్ను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. నేను చెత్త ప్రదర్శన ఇచ్చిన ప్రతి సారి నా లోని గొప్ప ఆటగాడిని చూసినందుకు ధన్యావాదాలు. ఎప్పటికీ నా కెప్టెన్ నువ్వే'' అంటూ సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో కూడిన పోస్టులో రాసుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే మహమ్మద్ సిరాజ్ వన్డే, టీ20 క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అంతేకాకుండా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కోహ్లీ నాయకత్వంలోనే ఆడాడు. కొత్త బంతిని స్వింగ్ చేయగల సిరాజ్ సామర్థ్యాన్ని తరచుగా విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. అయితే గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనలో మూడో టెస్టు మ్యాచ్‌కు సిరాజ్ దూరమయ్యాడు. అలాగే బుధవారం జరగనున్న తొలి వన్డేలో కూడా సిరాజ్ ఆడడం అనుమానంగానే ఉంది.
2014లో ధోని నుంచి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ ఏడేళ్ల పాటు సారథిగా కొనసాగాడు. ఈ క్రమంలో 68 టెస్టు మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన కోహ్లీ 40 మ్యాచ్‌ల్లో భారత్‌ను విజేతగా నిలిపాడు. 11 మ్యాచ్‌లు డ్రా కాగా, 17 మ్యాచ్‌ల్లో జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో కోహ్లీ కెప్టెన్‌గా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
సౌతాఫ్రికా పర్యటన (India Tour Of South Africa)లో టీమిండియా (Team India) ఓటమి పాలైన తర్వాత కోహ్లీ (Virat Kohli) టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన భారత్ తొలి టెస్టు మ్యాచ్ గెలిచి మంచి ఊపులో కనిపించింది. కానీ అనూహ్యంగా ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి ఏకంగా సిరీస్‌నే కోల్పోయింది. బౌలర్లు స్థాయికి తగ్గట్టు రాణించినప్పటికీ బ్యాటర్లు రాణించకపోవడమే టీమిండియా కొంప ముంచింది.
దీంతో, టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దాంతో భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ప్రస్థానం ముగిసింది. యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌తోనే టీ20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పగా.. ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని వన్డే సారథ్య బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించింది. అయితే వన్డే, టీ20 సారథ్యాన్ని కోల్పోయినా.. తనకు నచ్చిన సుదీర్ఘ ఫార్మాట్లో కెప్టెన్‌గా కోహ్లీ కొనసాగుతాడని అంతా భావించారు. కానీ ఏమైందో ఏమో కానీ కోహ్లీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. 100వ టెస్ట్ మైలురాయికి అడుగు దూరంలో ఉన్న కోహ్లీ.. కెప్టెన్‌గానే ఆ ఘనతను అందుకుంటాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.