టెస్ట్‌ల్లో నెం. 1 విరాట్‌ను మించినోడు మన ‘విహారి’!

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 63 మ్యాచుల్లో 59.79 సగటు తో 5142 పరుగులు సాధించిన హనుమ విహారి... ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, టీమిండియా కెప్టెన్ విరాట్ కంటే బెస్ట్ యావరేజ్... ఇంగ్లండ్ టూర్‌కి ఎంపిక!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: August 24, 2018, 1:38 PM IST
టెస్ట్‌ల్లో నెం. 1 విరాట్‌ను మించినోడు మన ‘విహారి’!
హనుమ విహారి
  • Share this:
ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో టాప్‌లో కొనసాగుతున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ సృష్టించిన అనితర సాధ్యమైన రికార్డులను ఒక్కొక్కటిగా కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఏడాది కాలం పాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ కూడా స్టార్ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఈ ఇద్దరికీ సమానమయ్యే బ్యాట్స్‌మెన్ (ముఖ్యంగా రికార్డుల్లో...) మరొకరు లేరు. కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం ఓ కుర్రాడున్నాడు. ఈ లెజండరీ బ్యాట్స్‌మెన్స్ కంటే అధిక సగటుతో... ఇన్నాళ్లూ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి మాత్రమే పరిమితమైన హనుమ విహారి, ఇంగ్లండ్ టూర్‌లో మిగిలిన రెండు టెస్ట్‌లకు సెలక్ట్ అయ్యి వెలుగులోకి వచ్చాడు. హనుమ విహారి తెలుగువాడు కావడం విశేషం.


రంజీల్లో ఆంధ్ర కెప్టెన్‌గా ఉన్న 24 ఏళ్ల గాదె హనుమ విహారి, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 63 మ్యాచుల్లో 5142 పరుగులు సాధించాడు. సగటు 59.79. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో విహారిదే అత్యుత్తమ సగటు. 118 మ్యాచుల్లో 10424 పరుగులు సాధించిన ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, 57.28 సగటుతో రెండో స్థానలో ఉన్నాడు. ప్రస్తుతం టెస్ట్‌ల్లో నెం. 1 స్థానాన్ని సాధించిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సగటు 54.58 మాత్రమే.


ఆఖరి ఐదు రంజీ సీజన్లలో 11 సెంచరీలు సాధించిన విహారి... సెలక్టర్లను ఆకర్షించి ఇంగ్లండ్ టూర్‌కి ఎంపికయ్యాడు. బౌలర్లకి విసుగు తెప్పించేలా జిడ్డు బ్యాటింగ్ చేసే విహారి... ఆఫ్ స్పిన్నర్‌ కూడా. రెండు దశాబ్దాల క్రితం భారత జట్టులో స్థానం సంపాదించుకున్న ఎమ్మెస్కే ప్రసాద్ తర్వాత టీమిండియాకు సెలక్ట్ అయ్యి ఆంధ్రా కుర్రాడు విహారియే కావడం విశేషం.

17 ఏళ్ల వయసులో రంజీల్లో ఆరంగ్రేటం చేసిన విహారి మొదట్లో హైదరాబాద్ జట్టుకు ఆడాడు. రెండేళ్ల పాటు హైదరాబాద్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. 2016లో ఆంధ్రా జట్టుకు మారాడు. 2016-17 సీజన్లో ఆడిన 9 రంజీ మ్యాచుల్లో ఒక సెంచరీతో పాటు 688 పరుగులు సాధించాడు. 2017-18 సీజన్లో ఆడిన ఆరు మ్యాచుల్లో 94 సగటుతో 752 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ త్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఈ ఏడాది ఇరానీ కప్‌లోనూ 183 పరుగులు సాధించడమే కాదు, ఏడో వికెట్‌కు 216 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

భారతజట్టులో స్థానం లభించడమే సంతోషాన్ని వ్యక్తం చేశాడు హనుమ విహారి.

క్రీజులో సుదీర్ఘంగా నిలదొక్కుకోవడమే నాకున్న ప్రధాన లక్ష్యం, లక్షణం. టెస్ట్ క్రికెట్‌లో మన ఆలోచనలు స్థిరంగా ఉండాలి. అందుకే ఒక్కసారి క్రీజులోకి దిగాక ప్రత్యర్థి కంటే ఓ అడుగు ముందుండేలా ప్రయత్నిస్తా... ఎటువంటి అంచనాలు లేకుండా లండన్‌కి వెళ్లాలనుకుంటున్నా...
హనుమ విహారి, ఆంధ్రా క్రికెటర్
Published by: Ramu Chinthakindhi
First published: August 24, 2018, 1:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading