TEAM INDIA MYSTERY SPINNER VARUN CHAKRAVARTHY RECEPTION PHOTOS VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA SRD
Varun chakravarthy Wedding : రిసెప్షన్ లో భార్యతో క్రికెట్ ఆడిన మిస్టరీ స్పిన్నర్.. వీడియో వైరల్
వరుణ్ చక్రవర్తి పెళ్లి
Varun chakravarthy Wedding : వరుణ్ చక్రవర్తి.. ఐపీఎల్ 2020 టోర్నీలో సత్తాచాటిన ఈ మిస్టరీ స్పిన్నర్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసిని శుక్రవారం వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ స్పిన్నర్ రిస్పెన్షన్ లో ఏకంగా భార్యతో క్రికెట్ ఆడాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓ ఇంటివాడయ్యాడు. చాలా కాలంగా నేహా ఖెడెకర్తో ప్రేమాయణం నడుపుతున్న వరుణ్ చక్రవర్తి తాజాగా పెద్దల సమక్షంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక కేకేఆర్ పంచుకున్న వీడియోలో రిసెప్షన్ వేదికపై వరుణ్ చక్రవర్తి బంతి విసరగా.. అతని సతీమణి నేహా బ్యాటింగ్ చేసింది. ఈ వీడియోకు 'వివాహ బంధంతో భార్య, భర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వరుణ్ చక్రవర్తి, నేహా ఖెడెకర్కు అభినందనలు.'అని క్యాప్షన్‌గా పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఇక వాస్తవానికి వరుణ్, నేహా పెళ్లి ఈ ఏడాది ఆరంభంలో జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడిందని కేకేఆర్ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయంలో వరుణ్ చెన్నైలో ఉండగా.. నేహా ముంబైలో ఉండిపోయిందని తెలిపింది. పైగా వరుణ్ ఉన్న ప్రాంతం కంటైన్మెంట్ జోన్ కావడంతో వారి పెళ్లికి అవకాశమే లేకుండా పోయిందని పేర్కొంది. ఐపీఎల్ 2019 సీజన్ వేలంలో రూ. 8.4 కోట్లకు వరుణ్ చక్రవర్తిని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. కానీ ఆ ఏడాది ఈ స్పిన్నర్‌కు నిరాశే ఎదురైంది.
ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట పంజాబ్ వదిలేయగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.4 కోట్లకే కొనుగోలు చేసింది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వరుణ్ చక్రవర్తి 6.84 ఎకానమీతో బౌలింగ్ చేసి 17 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లు తీసి భారత సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ గాయం కారణంగా ఆఖరి క్షణంలో జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. అతన్ని తప్పించిన భారత సెలెక్టర్లు.. తమిళనాడుకే చెందిన టి. నటరాజన్‌కు ఆ అవకాశం కల్పించారు. అతని స్థానంలో చోటు దక్కించుకున్న నట్టూ సంచలన ప్రదర్శనతో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్నాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.