టీమిండియా (Team India) హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాక రవిశాస్త్రి(Ravi Shastri) బీసీసీఐపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన దగ్గర నుంచి బీసీసీఐపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తన మాటల తూటాలు పేల్చుతున్నాడు. . టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ మరో రెండేళ్లు కొనసాగి ఉండేవాడని, కానీ, అతడి విజయాలను చూసి చాలా మంది ఓర్వలేకపోయారని రవిశాస్త్రి లేటెస్ట్ గా కామెంట్ చేశాడు. విరాట్ కోహ్లీ కచ్చితంగా మరో రెండేళ్లు టీమిండియా టెస్టు కెప్టెన్‌గా కొనసాగేవాడని బోర్డు పెద్దల ఒత్తిడి వల్లే తప్పుకున్నాడని తెలిపాడు. రానున్న రెండేళ్లలో టీమిండియాకు అన్ని హోం సిరీస్‌లే ఉన్నాయని, అవి కూడా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బాగా వెనుక ఉన్న జట్లతో అని చెప్పాడు. దీంతో టెస్ట్ క్రికెట్లో కోహ్లీ విజయాల సంఖ్య 50 నుంచి 60కి పెరిగేది అన్నాడు. కోహ్లీకి అలాంటి రికార్డులు దక్కడం ఇష్టం లేక, అతడు సాధించిన ఘనతలు చూసి జీర్ణించుకోలేక, కొందరు అతడిపై ఒత్తిడి తెచ్చి కెప్టెన్సీ నుంచి తనకు తానుగా తప్పుకునేలా చేశారని వ్యాఖ్యానించాడు.
ఇక, తాజాగా దేశవాళి క్రికెట్ టోర్నీ రంజీ (Ranji Trophy) ట్రోఫీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ క్రికెట్ సక్సెస్ కావడంలో రంజీ ట్రోఫీ పాత్ర ఎంతో ఉందన్నాడు. భారత క్రికెట్‌కు వెన్నెముకగా (Backbone) ఉన్నటువంటి రంజీ ట్రోఫీని విస్మరిస్తే భవిష్యత్తులో భారత జట్టులో నాణ్యమైన స్పిన్నరే ఉండడంటూ ట్విట్టర్ వేదికగా ఆయన బాంబు పేల్చాడు. కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన రంజీ ట్రోఫీ జరగలేదు.
కరోనా కాస్త శాంతించడంతో ఈ ఏడాది జరుపుతామని బీసీసీఐ ప్రకటించింది. జనవరి 19 నుంచి రంజీ ట్రోఫీ జరిగేలా షెడ్యూల్‌ను కూడా తయారు చేసింది. అయితే ఒమిక్రాన్ (Omicron) రూపంలో కరోనా మరోసారి దేశంలో పడగ విప్పడంతో ఈ నెలలో ఆరంభం కావల్సిన రంజీ ట్రోఫీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పుడు ఈ నిర్ణయంపైనే రవిశాస్త్రి కాస్త గుర్రుగా ఉన్నాడు. భారత జట్టుకు క్వాలిటీ స్పిన్నర్లను అందించడంలో రంజీ ట్రోఫీ పాత్ర మరువలేనిదని... అటువంటి ప్రతిష్టాత్మక ట్రోఫీని జరిపేందుకు బీసీసీఐ (BCCI) ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై టీమిండియా మాజీ గురువు తనదైన స్టైల్లో స్పందించాడు.
రెండు దశల్లో రంజీ ట్రోఫీ
కరోనాతో వాయిదా పడ్డ రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించేందుకు తాము ప్రణాళికలు రచిస్తోన్నట్లు బీసీసీఐ కోశాధికారి అర్జున్ ధుమాల్ పేర్కొన్నారు. దీనిపై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీతో కూడా చర్చించినట్లు ఆయన స్పష్టం చేశారు. మార్చి 27 నుంచి ఐపీఎల్ ఆరంభమవుతుండటంతో రంజీ ట్రోఫీని రెండు దశల్లో జరగొచ్చు అంటూ ముందునుంచే వార్తలు వస్తున్నాయి. తాజాగా అర్జున్ వ్యాఖ్యలు వాటికి బలాన్నిచ్చాయి.
ఫిబ్రవరి-మార్చి మధ్య తొలి దశను... జూన్-జూలై నెలల్లో రెండో దశను నిర్వహించేలా బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.
త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కరోనాతో గతేడాది జరగాల్సిన రంజీ ట్రోఫీ రద్దు కాగా... కేవలం విజయ్ హజారే వన్డే ట్రోఫీని, సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలు మాత్రమే జరిగాయి. ఈ ఏడాది కూడా ఈ రెండు పరిమిత ఓవర్ల టోర్నీలు మాత్రమే జరగ్గా... ఒమిక్రాన్ వల్ల రంజీ ట్రోఫీ ఆగిపోయింది. గతేడాది రంజీ ట్రోఫీ జరగకపోవడంతో ఆటగాళ్లకు నష్టపరిహారంగా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతాన్ని బీసీసీఐ చెల్లించింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.