హోమ్ /వార్తలు /క్రీడలు /

Minister Tiwary : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి ఇప్పుడు మంత్రి.. దీదీ తనకు ఏ శాఖ కేటాయించిందంటే..

Minister Tiwary : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి ఇప్పుడు మంత్రి.. దీదీ తనకు ఏ శాఖ కేటాయించిందంటే..

అప్పుడు క్రికెటర్.. ఇప్పుడు మినిస్టర్

అప్పుడు క్రికెటర్.. ఇప్పుడు మినిస్టర్

  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Benarjee) తన క్యాబినెట్‌ను (Cabinet) విస్తరించారు. బెంగాల్ అసెంబ్లీలో 44 మంది మంత్రులుగా ఉండటానికి అవకాశం ఉన్నది. ఇప్పటికే మమత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో మరో 43 మందిని మంత్రులుగా నియమించింది. సోమవారం వీరంతా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. మమత క్యాబినెట్‌లో టీమ్ ఇండియా (Team India) మాజీ క్రికెటర్ మనోజ్ తివారీకి (Manoj Tiwary) చోటు దక్కింది. ఈ సారి మంత్రి వర్గంలో 15 మంది కొత్త వాళ్లకు చోటు లభించగా.. వారిలో మనోజ్ తివారి ఒకరు. తివారీకి స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ శాఖను (Sports and Youth Minister) మమత కేటాయించారు. ఈ సందర్భంగా మనోజ్ తివారి ముఖ్యమంత్రి మమతకు కృతజ్ఞతలు తెలిపారు. 'మంత్రిగా ప్రమాణం చేయడం నాకు ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించింది. ఈ అవకాశం ఇచ్చిన మమత దీదీకి, అభిషేక్ భయ్యాకు నా ధన్యవాదాలు. వారు నాపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతల పట్ల సంతోషం' అంటూ మనోజ్ ట్వీట్ చేశారు. అతడు మంత్రిగా ప్రమాణం చేయడం పట్ల సహచర క్రికెటర్లు అభినందనలు తెలియజేశారు.

  35 ఏళ్ల మనోజ్ తివారి 12 అంతర్జాతీయ వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొన్నటి బెంగాల్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే రాజకీయాల్లోకి వచ్చిన మనోజ్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాడు. మమత ఆయనకు పశ్చిమ బెంగాల్‌లోని హౌరా పరిధి శిబ్‌పూర్ నియోజకవర్గం టికెట్ కేటాయించారు. మనోజ్ తన సమీప బీజేపీ అభ్యర్థి రథిన్ చక్రబొర్తిపై గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 'ఎన్నికల్లో గెలవడం అనేది చాలా విషయం. రాష్ట్రంలో ప్రబలుతున్న కరోనా వైరస్ నుంచి గెలుపొందడమే అసలైన గెలుపు.' అని మనోజ్ అన్నాడు. తాను గెలవడానికి సహకరించిన శిబ్‌పూర్ ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పాడు. కోవిడ్ క్లిష్ట సమయంలో తాను అందరికీ సహాయం చేయడానికి ముందుంటానని చెప్పుకొచ్చాడు.


  కాగా, మనోజ్ తివారీతో పాటు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మరో మాజీ క్రికెటర్ కూడా పోటీ చేశాడు. బెంగాల్ రంజీ క్రికెటర్, మాజీ టీమ్ ఇండియా ఆటగాడు అశోక్ దిండా బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందాడు. తన సహచర క్రికెటర్ అధికార పక్షంలో మంత్రిగా ఉండగా.. దిండా ప్రతిపక్షంలో ఉండటం గమనార్హం.

  Published by:John Kora
  First published:

  Tags: Cricket, Sports, Team India, West Bengal

  ఉత్తమ కథలు