హోమ్ /వార్తలు /క్రీడలు /

Sourav Ganguly Biopic: బయోపిక్​కు ఓకే చెప్పిన గంగూలీ.. దాదా లైఫ్‌ స్టోరీ బడ్జెట్ ఎంతంటే..

Sourav Ganguly Biopic: బయోపిక్​కు ఓకే చెప్పిన గంగూలీ.. దాదా లైఫ్‌ స్టోరీ బడ్జెట్ ఎంతంటే..

కరోనా వల్ల ఐపీఎల్‌కు కలిసొచ్చిందంటున్న సౌరవ్ గంగూలీ [PC: BCCI]

కరోనా వల్ల ఐపీఎల్‌కు కలిసొచ్చిందంటున్న సౌరవ్ గంగూలీ [PC: BCCI]

Sourav Ganguly Biopic: ఇప్పటికే గంగూలీ బయోపిక్​ స్క్రిప్ట్ రెడీ అయిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. నిర్మాతతోనూ గంగూలీ పలుసార్లు చర్చలు జరిపాడని టాక్ నడుస్తోంది.

భారత క్రికెట్ జట్టు గతిని మార్చిన మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితంపై బాలీవుడ్​లో బయోపిక్​ తెరకెక్కడం ఖాయమైపోయింది. హిందీలో ఈ చిత్రం రూపొందనుంది. దాదాపు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల భారీ బడ్జెట్​తో దాదా బయోపిక్​ రానుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్​ పనులు అప్పుడే జరుగుతున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గంగూలీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.

ఈ విషయంపై సౌరవ్ గంగూలీ న్యూస్ 18తో మాట్లాడాడు. “అవును, నేను బయోపిక్​కు అంగీకరించాను. ఈ సినిమా హిందీలో రూపొందుతుంది. అయితే డైరెక్టర్ ఎవరో ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు. ఇంకొన్ని రోజుల సమయం పడుతుంది. అన్ని పనులు చేసేందుకు కొంత టైం అవసరం” అని దాదా స్పష్టం చేశాడు. అయితే ఇప్పటికే గంగూలీ బయోపిక్​ స్క్రిప్ట్ రెడీ అయిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. నిర్మాతతోనూ గంగూలీ పలుసార్లు చర్చలు జరిపాడని టాక్ నడుస్తోంది.

గంగూలీ పాత్రలో ఎవరు నటిస్తారన్న అంశం పెద్ద చర్చగా మారింది. రణ్​బీర్ కపూర్​ దాదా పాత్రకు సరిగ్గా సరిపోతాడని సినీ వర్గాలు అంటున్నాయి. అతడే సరైన చాయిస్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గంగూలీ కూడా రణ్​బీర్ పేరును ప్రస్తావించాడు. అలాగే హృతిక్ రోషన్ కూడా గంగూలీ పాత్రకు సరిపోతాడని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ విషయంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అలాగే మరో ఇద్దరు నటుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. చిన్నతనం నుంచి బీసీసీఐ అధ్యక్షుడు అయ్యే వరకు గంగూలీ మొత్తం జీవితం సినిమాగా రానుంది.

గంగూలీ జీవితంలో సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. అతడి లైఫ్​స్టైల్​ నుంచి క్రికెట్ వరకు అన్నీ ఆసక్తికర విషయాలే. భారత జట్టు సంక్షోభంలో ఉన్నప్పుడు ధైర్యంగా అతడు టీమ్​ను ముందుకు నడిపిన తీరు అద్భుతం. క్రికెట్​తో పాటు గంగూలీ వ్యక్తిగత జీవితం కూడా చాలా ఆసక్తికరం. దాదా ప్రేమ వివాహం సినిమాను తలపిస్తుంది.

అయితే గంగూలీ బయోపిక్​ను ఎప్పుడు విడుదల చేస్తారన్నది పస్తుతానికి స్పష్టం కాలేదు. భారత్​కు రెండు ప్రపంచకప్​లు అందించిన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ జీవితంపై తీసిన ‘ధోనీ అన్​టోల్డ్ స్టోరీ’ సినిమా భారీ హిట్టయింది. ఆ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. అలాగే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జీవితంపైనా ఓ డాక్యుమెంటరీ మూవీ విడుదలైంది. 1983 ప్రపంచకప్ విజయం రూపొందుతున్న చిత్రంలో రణ్​బీర్ కపూర్​.. అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు భారత మహిళా క్రికెటర్లు మిథాలీరాజ్​, జులన్​ గోస్వామి బయోపిక్​లపైనా చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా భారత క్రికెట్ బాస్ సౌరవ్ గంగూలీ ఆ జాబితాలో చేరిపోయాడు.

First published:

Tags: Sourav Ganguly, Team India

ఉత్తమ కథలు