Breaking: యజువేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్ కరోనా పాజిటివ్.. 8 మంది క్రికెటర్లు శ్రీలంకలోనే..

కరోనా బారిన పడిన చాహల్, క్రిష్ణప్ప గౌతమ్ (Twitter)

టీమ్ ఇండియాకు కరోనా మరోసారి ఎదురు దెబ్బ తీసింది. శ్రీలంక పర్యటన ముగించుకొని ఇండియాకు తిరిగి వద్దామని అనుకున్న సమయంలో మరో ఇద్దరు క్రికెటర్లు కరోనా పాజిటివ్‌గా తేలారు.

  • Share this:
    శ్రీలంక పర్యటనకు (Srilanka Tour) వెళ్లిన టీమ్ఇండియా (Team India) క్రికెటర్లలో మరో ఇద్దరు కరోనా పాజిటివ్‌గా నిర్దారించబడ్డారు. ఇప్పటికే కరోనా సోకి ఐసోలేషన్‌లో ఉన్న కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన యజువేంద్ర చాహల్ (Yazuvendra Chahal),  కృష్ణప్ప గౌతమ్ (Krishnappa Gowtham) కరోనాతో బాదపడుతున్నట్లు తేలింది. కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మందిలో ఈ ఇద్దరు కూడా ఉన్నారు. దీంతో కృనాల్ పాండ్యా, యజువేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్ సహా మిగిలిన ఆరుగురు క్రికెటర్లు శ్రీలంకలోనే ఉండిపోనున్నారు. మిగిలిన క్రికెటర్లు ఇండియా బయలు దేరి వస్తున్నట్లు సమాచారం. గురువారం రాత్రి మూడో టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా క్రికెటర్లు తిరిగి ఇండియా రావడానికి సిద్దపడ్డారు. కృనాల్ పాండ్యా కరోనా కారణంగా కచ్చితంగా వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి. దీంతో అతడు మాత్రం శ్రీలంకలో ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. అయితే అతడితో సన్నిహితంగా ఉన్న యజువేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్‌లు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఐసోలేషన్‌లో ఉన్న ఆరుగురు క్రికెటర్లను కూడా అక్కడే ఉంచేసి మిగిలిన క్రికెటర్లు ఇండియాకు బయలుదేరారు. చాహల్, గౌతమ్‌లను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేస్తుండగా.. హార్దిక్ పాండ్యా, పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్. మనీష్ పాండే., దీపక్ చాహర్, ఇషాన్ కిషన్‌లను వేర్వేరుగా ఉంచారు.

    శ్రీలంక ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారందరినీ కొలంబోలోనే ఐసోలేట్ చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. కోవిడ్ సోకిన వ్యక్తులు పది రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉన్న తర్వాత నెగెటివ్ వస్తేనే దేశం విడిచి వెళ్లడానికి అక్కడ ప్రభుత్వం అంగీకరిస్తుంది. దీంతో చాహల్, గౌతమ్‌లు పది రోజుల పాటు కొలంబోనే గడపాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండు ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించి నెగెటివ్ వస్తేనే వాళ్లు ముగ్గురు ఇండియాకు తిరిగివస్తారు. కృనాల్‌కు కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత చాహల్, గౌతమ్‌లు ఇద్దరూ టీమ్ బస చేసిన హోటల్‌లోనే విడిగా గడిపారు. ఇప్పుడు మిగతా ఆరుగురు క్రికెటర్లు కూడా అక్కడే క్వారంటైన్ అయ్యారు.

    కాగా, పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌ల పరిస్థితిపై బీసీసీఐ సమీక్షిస్తున్నది. వాస్తవానికి వారిద్దరూ అక్కడి నుంచే లండన్ వెళ్లాల్సి ఉన్నది. టీమ్ ఇండియా టెస్టు జట్టుతో వారిద్దరూ కలవాల్సి ఉన్నా.. ఇప్పుడు ఐసోలేషన్‌లో ఉండటంతో వారి టూర్ మరింత ఆలస్యం కానున్నది. ఒకవేళ కరోనా వస్తే వారిద్దరూ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేది అనుమానమే అని సమాచారం. పృథ్వీ షా ఎన్నో రోజులుగా టెస్టు జట్టులోకి తిరిగి రావాలని పట్టు దలతో ఉన్నాడు. మరోవైపు సూర్య కుమార్ యాదవ్‌కు తొలి సారి టెస్టు జట్టు నుంచి పిలుపు వచ్చింది. కానీ శ్రీలంక పర్యటనలో కరోనా వారి ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.
    Published by:John Naveen Kora
    First published: