Team India : నాలుగు నెలల పాటు టీమ్ ఇండియా బయోబబుల్‌లోనే.. సిద్దం కావాలని చెప్పిన బీసీసీఐ

మరోసారి బయోబబుల్‌లోకి టీమ్ ఇండియా [PC : Twitter @ BCCI]

గత సెప్టెంబర్ నుంచి టీమ్ ఇండియా వరుసగా బయోబబుల్స్‌లో ఉంటూ వస్తున్నది. ఐపీఎల్ 2020, ఆస్ట్రేలియా టూర్, స్వదేశంలో ఇంగ్లాండ్ సిరీస్, ఐపీఎల్ 2021... ఇలా వరుసగా బయోబబుల్స్‌లో ఉన్నది. ఇప్పుడు మరో సారి సుదీర్ఘ బబుల్‌ కోసం సిద్దం కావాలని బీసీసీఐ చెబుతున్నది.

  • Share this:
    టీమ్ ఇండియా (Team India) క్రికెటర్లు నాలుగు నెలల పాటు మరో బయోబబుల్‌లో (BioBubble) ఉండటానికి సిద్దపడాలని బీసీసీఐ (BCCI) సమాచారం అందించినట్లు తెలుస్తున్నది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ (ICC WTC Final) కోసం భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లాల్సి ఉన్నది. జూన్ మొదటి వారంలో ఇంగ్లాండ్ వెళ్లడానికి గతంలో ఏర్పాట్లు చేశారు. కానీ ప్రస్తుతం ఐపీఎల్ వాయిదా పడటంతో షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇండియాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో బ్రిటన్ మన దేశాన్ని రెడ్ లిస్ట్‌లో పెట్టింది. రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా ప్రభుత్వంలాగా ఫ్లైట్ల నిషేధం విధిస్తే మరిన్ని కష్టాలు ఎదురవుతాయి. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. టీమ్ ఇండియాను కొన్ని రోజులు ముందుగానే ఇంగ్లాండ్ పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మే చివరి వారంలో జట్టు ఇంగ్లాండ్ బయలు దేరి వెళ్లనున్నది. అక్కడ 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరి కావడంతో.. ప్రభుత్వం ఏర్పాటు చేసే హోటల్స్‌లో క్వారంటైన్‌లో ఉంటారు. ఆ తర్వాత వెంటనే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశిస్తారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసినా.. టీమ్ ఇండియా అక్కడే ఉండనున్నది. అగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనున్నది. మొత్తంగా మే చివరి వారంలో ఇంగ్లాండ్ వెళ్లే భారత జట్టు సెప్టెంబర్ మూడో వారం వరకు అంటే దాదాపు 4 నెలల పాటు బయోబబుల్‌లో ఉండనున్నది.

    టీమ్ ఇండియా ముందుగానే ఇంగ్లాండ్ చేరుకోవడం వల్ల మున్ముందు రాబోయే ఆంక్షల నుంచి తప్పించుకోవడంతో పాటు అక్కడి వాతావరణానికి అలవాటు పడే అవకాశం ఉన్నదని బీసీసీఐ భావిస్తున్నది. ఎక్కువ రోజుల పాటు ఇంగ్లాండ్‌లో సాధన చేయడం ద్వారా డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసంమే కాకుండా ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్టు సిరీస్‌లో కూడా రాణించే అవకాశం ఉంటుందని బీసీసీఐ అంటున్నది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఇండియాతో తలపడనున్న న్యూజీలాండ్ జట్టు క్రికెటర్లు ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమ్ ఇండియాతో కలసి ఇంగ్లాండ్ వెళ్లాలని భావించారు. కానీ ఇప్పుడు ఐపీఎల్ వాయిదాతో కివీస్ ప్లేయర్లు సొంత దేశానికి వెళ్లిపోతున్నారు. జూన్ మొదటి వారంలో కివీస్ జట్టు ఇంగ్లాండ్ చేరుకుంటారని తెలుస్తున్నది. ట్రెంట్ బౌల్ట్, కేన్ విలియమ్‌సన్, ఇతర కివీస్ ప్లేయర్లు మరి కొన్ని గంటల్లో చార్టెడ్ ఫ్లైట్లలో న్యూజీలాండ్ వెళ్లిపోనున్నారు.

    భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన షెడ్యూల్

    డబ్ల్యూటీసీ ఫైనల్ - జూన్ 18 నుంచి 22 (సౌతాంప్టన్)

    తొలి టెస్టు - అగస్టు 4 నుంచి 8 (నాటింగ్‌హామ్)

    రెండో టెస్టు - అగస్టు 12 నుంచి 16 (లండన్)

    మూడో టెస్టు - అగస్టు 25 నుంచి 29 (లీడ్స్)

    నాలుగోటెస్టు - సెప్టెంబర్ 2 నుంచి 6 (లండన్)

    ఐదో టెస్టు - సెప్టెంబర్ 10 నుంచి 14 (మాంచెస్టర్)
    Published by:John Naveen Kora
    First published: