Rishabh Pant: రిషబ్ పంత్‌కు కరోనా డెల్టా వేరియెంట్.. అక్కడికి వెళ్లడం వల్లే వచ్చిందా?

రిషభ్ పంత్

IND vs ENG: వచ్చే నెల నుంచి ఇంగ్లండ్, భారత జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఆగస్టు 4 నుంచి నాటింగ్‌హమ్ వేదికగా మొదటి టెస్ట్ ప్రారంభం అవుతుంది. ఇరుజట్లు మొత్తం 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి.

  • Share this:
    మన దేశంలో కోవిడ్ రెండో దశ వ్యాప్తికి కారణమైన డెల్టా వేరియెంట్ ఇప్పుడు భారత క్రికెట్ జట్టులోనూ కలకలం రేపుతోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టెస్ట్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకిందన్న విషయం తెలిసిందే. అందులో ఒకరు రిషబ్ పంత్ అని స్పోర్ట్స్ టాక్ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. వారం రోజుల క్రితం రిషబ్ పంత్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని పేర్కొంది. ఐతే ఎలాంటి లక్షణాలు లేవని తెలిపింది. ప్రస్తుతం రిషబ్ పంత్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో భారత  ముందుగా ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా. దుర్హమ్‌లో కౌంటీ ఛాంపియన్‌ఫిప్-XI జట్టుతో తలపడనుంది. కరోనా నేపథ్యంలో ఆ మ్యాచ్‌కు రిషబ్ పంత్ అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. జులై 20 నుంచి వార్మప్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

    ఇటీవల రిషబ్ పంత్‌తో పాలు మరికొందరు ఆటగాళ్లు యూరో కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించారు. వెంబ్లీ స్టేడియంలో జరిగిన ఇంగ్లండ్, జర్మనీ మ్యాచ్‌ను గ్రౌండ్‌కు వెళ్లి చూశారు. కనీసం మాస్క్ కూడా ధరించలేదు. స్టేడియంలో భౌతిక దూరం పాటించ లేదు ఆ తర్వాతే పంత్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంగ్లండ్‌లో కొన్ని రోజులుగా డెల్టా వేరియెంట్ కేసులు పెరుగుతున్నాయి. కొత్త కేసులు పెద్ద మొత్తంలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌కు వెళ్లడం వల్లే రిషబ్ పంత్‌కు కరోనా సోకి ఉండవచ్చని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.



    ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లలో ఇద్దరికి కరోనా వచ్చినట్లు ANI వార్తా సంస్థ తెలిపింది. అందులో ఒకరు రిషబ్ పంత్ కాగా..మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. కొన్నిరోజుల క్రితం భారత ఆటగాళ్లకు బీసీసీఐ కార్యదర్శి జైషా కీలక సూచనలు చేశారు. ఆటగాళ్లు తీసుకున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ కేవలం రక్షణ మాత్రమే ఇస్తుందని... వైరస్‌ను పూర్తిగా అడ్డుకోలేదని చెప్పారు. అందుకే కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ.. ఆటగాళ్లు ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని చెప్పారు. ఇంగ్లండ్‌లో జరిగే వింబుల్డన్, యూరో కప్ మ్యాచ్‌లకు వెళ్లకూడదని చెప్పారు. కానీ కొందరు ఆటగాళ్లు మాత్రం లైట్ తీసుకున్నారు. ముఖ్యంగా రిషబ్ పంత్ ఫుట్ బాల్ మ్యాచ్‌ చూడడానికి వెళ్లడం.. అక్కడ కనీసం మాస్క్ కూడా ధరించకపోవడం... చర్చనీయాంశమయింది.

    కాగా, వచ్చే నెల నుంచి ఇంగ్లండ్, భారత జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఆగస్టు 4 నుంచి నాటింగ్‌హమ్ వేదికగా మొదటి టెస్ట్ ప్రారంభం అవుతుంది. ఇరుజట్లు మొత్తం 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇప్పటికే ఆటగాళ్లందరికీ వ్యాక్సిన్ వేశారు. ఐతే భారత జట్టులో ఇద్దరికి కరోనా రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ టెస్ట్ సిరీస్ అనుకున్న షెడ్యూల్‌కే జరుగుతుందా? లేదా? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: