TEAM INDIA COLLAPSE FOR 78 IN 3RD TEST ENGLAND BOWLERS DOMINATED FIRST DAY IN LEEDS JNK
INDvENG: లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన భారత్.. 78 పరుగులకే ఆలౌట్
కుప్పకూలిన టీమ్ ఇండియా.. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 78కి ఆలౌట్ (PC: England Cricket/Twitter)
భారత జట్టు లీడ్స్‌లో జరుగుతున్న మూడోటెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. ఇంగ్లాండ్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్ చెలరేగడంతో కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
లార్డ్స్ టెస్టు (Lord's Test) విజయం హ్యాంగోవర్లో ఉన్న టీమ్ ఇండియాకు (Team India) లీడ్స్‌లో ఇంగ్లాండ్ (England Team) బౌలర్లు మత్తు వదిలించారు. ఇంగ్లాండ్ పర్యటనలో తొలి సారి టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ (Virat Kohli) లీడ్స్ టెస్టులో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండో టెస్టులో విజయం సాధించిన జట్టును ఏ మాత్రం మార్చకుండానే బరిలోకి దిగిన కోహ్లీ సేన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియాను తొలి ఓవర్లోనే జేమ్స్ అండర్సన్ దెబ్బ తీశాడు. ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా విశేషంగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ (0)ను తొలి ఓవర్లోనే పెవీలియన్ పంపించాడు. నయా వాల్‌గా పిలవబడుతున్న చతేశ్వర్ పుజార తన పేలవ ప్రదర్శనను లీడ్స్‌లో కూడా కొనసాగించాడు. అండర్సన్ బౌలింగ్‌లో చతేశ్వర్ పుజార (1) జాస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఐదు ఓవర్లలోపే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్ కోహ్లీ ఆదుకుంటాడని అందరూ భావించారు. కానీ ఆఫ్ స్టంప్ అవతల పడే బంతులను ఆడలేని బలహీనతను మరోసారి బయటపెట్టుకున్నాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (7) జాస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దీంతో భారత జట్టు కేవలం 21 పరుగులకే టాప్ 2 బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ రోహిత్ శర్మతో కలసి వైస్ కెప్టెన్ అజింక్య రహానే కాసేపు ఇన్నింగ్స్ నిలబట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలసి నాలుగో వికెట్‌కు 35 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఇక క్రీజులో తొలి సెషన్ ముగిస్తారని భావిస్తున్న సమయంలో అజింక్య రహానే (18) ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లో జాస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో భారత జట్టు లంచ్ విరామ సమయానికి 4 కీలక వికెట్లు నష్టపోయి 56 పరుగులు మాత్రమే చేసింది.
రెండో సెషన్లో ఓపెనర్ రోహిత్ శర్మ్ సాధ్యమైనంత వరకు వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడుప్పుడు పరుగులు రాబట్టాలని ప్రయత్నించినా.. అతడికి మరో ఎండ్ నుంచి సపోర్ట్ లభించలేదు. ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ (2) జాస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ (105 బంతుల్లో 19) ఓవర్టన్ బౌలింగ్‌లో ఓలీ రాబిన్సన్కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత బంతికే రెండో టెస్టు హీరో మహ్మద్ షమి (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా (4), జస్ప్రిత్ బుమ్రా (0), మహ్మద్ సిరాజ్ (3) కూడా చేతులెత్తేశారు. భారత జట్టు 67 పరుగుల వద్ద ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఇక ఇషాంత్ శర్మ (8) ఒక్కడే నాటౌట్‌గా మిగిలాడు. మొత్తానికి టీమ్ ఇండియా టీ విరామ సమయానికి ముందే కేవలం 40.4 ఓవర్లు మాత్రమే ఆడి 78 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జేమ్స్ అండర్సన్, క్రెయిగ్ ఓవర్టన్ చెరి 3 వికెట్లు, ఓలీ రాబిన్సన్, సామ్ కర్రన్ తలా 2 వికెట్లు తీశారు.
Innings Break!#TeamIndia are all out for 78 in the first innings of the 3rd Test.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.