టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి షాక్ తగిలింది. రన్ మెషీన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. బీసీసీఐ అధికారిక కిట్ స్పాన్సర్ గా ఉన్న మొబైల్ ప్రీమియర్ లీగ్ సంస్థలో కోహ్లీకి పెట్టుబడులు ఉండటమే.. టీమండియా కెప్టెన్ ను చిక్కుల్లో పడేసింది. పరస్పర విరుద్ద ప్రయోజనాల కింద కోహ్లీకి షాక్ తగలనుంది. గతేడాది జనవరిలో ఎంపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లీ నియమితుడయ్యాడు. అప్పుడే అతని పేరిట రూ.33.32 లక్షల విలువైన 68 సీసీడీలను కేటాయించారు. వీటిని పదేళ్ల తర్వాత ఈక్విటీ షేర్లలోకి మార్చుకోవచ్చు. ఆ లెక్కన విరాట్ కోహ్లీకి ఎంపీఎల్ కంపెనీలో 0.051 శాతం వాటా ఉన్నట్లే. ఇదే ఎంపీఎల్ స్పోర్ట్స్‌ను గతేడాది నవంబర్ 17న అధికారిక కిట్ స్పాన్సర్‌గా బీసీసీఐ ప్రకటించింది. ఈ ఎంపీఎల్ లోగో ఉన్న జెర్సీలను ఆస్ట్రేలియా టూర్ నుంచే టీమిండియా వేసుకుంటోంది. మూడేళ్ల పాటు ఈ సంస్థతో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కోహ్లికి ఈ సంస్థలో వాటా ఉన్నట్లు బీసీసీఐకి తెలియదని ఓ బోర్డు అధికారి చెప్పడం ఇక్కడ కొస మెరుపు.
విరాట్ కోహ్లీ లాంటి టాప్ ప్లేయర్‌కు ఇలాంటి కనెక్షన్లు ఉండటం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. నిజానికి గతేడాది జులైలోనే కోహ్లీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ లేవనెత్తారు. ఇప్పుడు మరోసారి తెరమీదికి వచింది. మరి ఈ అంశంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ విషయంలోనే గతంలో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ సహా అనేక మందిపై మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశారు. బీసీసీఐ రాజ్యాంగంలోని 38 (4) నిబంధనకు వ్యతిరేకమని తెలిపారు.
ప్రస్తుతం టీమిండియా-ఆస్ట్రేలియా ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. తన భార్య అనుష్క శర్మ మరికొద్ది రోజుల్లో మొదటి బిడ్డకు జన్మనివ్వనుండటంతో టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు కోహ్లీ. పెటర్నటి లీవ్ మీద భారత్ కు తిరిగొచ్చాడు కోహ్లీ. రేపటి నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.
Published by:Sridhar Reddy
First published:January 06, 2021, 20:54 IST