Kohli Golden Duck: భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెత్త ఫాం కంటిన్యూ అవుతోంది. ఇటీవల వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పెడుతున్న ఈ పరుగుల మిషన్.. మరోసారి అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. దీంతో మరోసారి గోల్డెన్ డక్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అండర్సన్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ కోహ్లి స్లిప్‌లో ఉన్న బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా కోహ్లి టెస్టుల్లో గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం ఇది ఐదోసారి. ఈ ఐదింటిలో మూడుసార్లు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో కోహ్లి ఇలా గోల్డెన్‌డక్‌గా వెనుతిరిగాడు. ఇందులో 2014లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో లియామ్ ప్లంకెట్ బౌలింగ్‌లో, 2018లో ఓవల్ వేదికగా జరిగిన టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో రెండుసార్లు గోల్డెన్ డక్ అయ్యాడు. తాజాగా అండర్సన్ బౌలింగ్‌లో మరోసారి గోల్డెన్ డక్ అయ్యాడు. కాగా గోల్డెన్ డక్ విషయంలో కోహ్లి మరోచెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా మూడుసార్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో ఈ చెత్త రికార్డుల్లో భారత నెంబర్ వన్ కెప్టెన్ గా నిలిచాడు. లాలా అమర్‌నాథ్, కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీలు టెస్టు కెప్టెన్లుగా రెండేసీ సార్లు గోల్డెన్ డక్ అయ్యారు.
ఇక అండర్సన్ 12 టెస్టుల తర్వాత కోహ్లిని అవుట్ చేయడం మరో విశేషం. చివరగా 2014లో ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టులో కోహ్లిని అండర్సన్ అవుట్ చేశాడు. కెప్టెన్ కోహ్లీ అవుట్ తో తొలి టెస్టులో భారత్ పై మరింత ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా పరుగుల ఖాతా తెరువకుండానే ఔటవ్వడం ఇతర బ్యాట్స్ మెన్ పై ఒత్తిడిని పెంచింది. దీంతో తొలిరోజు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా రెండో రోజు ఆటలో తడబడుతుంది. లంచ్ విరామం వరకు వికెట్ నష్టానికి 97 పరుగులతో పటిష్టంగా కనిపించిన భారత్.. తరువాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. వెలుతురు సరిగా లేని కారణంగా ప్రస్తుతం అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇప్పటివరకు టీమిండియా 46.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 57, పంత్ 7 పరుగులతో ఆడుతున్నారు.
మరోవైపు ఈ మ్యాచ్ లో అజింక్యా రహానే అనూహ్యంగా రనౌట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రహానే ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓలి రాబిన్‌సన్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్ రెండో బంతిని స్ట్రైక్‌లో ఉన్న కేఎల్ రాహుల్ ఢిపెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశలో ఉన్న బెయిర్ స్టో దగ్గరికి వెళ్లింది. అయితే రాహుల్ క్రీజు నుంచి కదలడంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రహానే పరుగు కోసం ముందుకు వచ్చాడు. రాహుల్ వద్దంటూ చేయితో సిగ్నల్ ఇచ్చినప్పటికి రహానే అది పట్టించుకోకుండా క్రీజు దాటి బయటకు వచ్చేశాడు. అప్పటికే బంతిని అందుకున్న బెయిర్ స్టో రహానే ఉన్న వైపు విసిరాడు. బంతి నేరుగా వికెట్లను గిరాటేయడంతో రహానే రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. రహానే రనౌట్‌పై నెటిజన్లు వినూత్న రీతిలో స్పందించారు.'' ఏంటి రహానే ఇలా చేశావు.. అంత తొందరెందుకు నీకు.. రాహుల్ సిగ్నల్ చూస్తే బాగుండు... అనవసర తప్పిదంతో రనౌట్ అయ్యావు'' అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే రహానె ఔట్ తరువాత కీలక వికెట్లు గా భావించిన పుజారా, కోహ్లి కూడా వెనువెంటనే వెనుదిరగడంతో టీమిండియా కష్టాల్లో పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Ind Vs Eng 2018, Sports, Virat kohli