ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా (Team India) అదరగొడుతోంది. ఇప్పటికే ఐదు టెస్ట్ ల సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది కోహ్లీ సేన. ప్రస్తుతానికి ఈ టెస్ట్ సిరీస్ గెలవడంపైనే టీమిండియా దృష్టి నెలకొంది. అయితే, రానున్న టీ-20 ప్రపంచకప్ పై కూడా ఓ నజర్ వేసినట్లు తెలుస్తోంది. ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌లు లేకపోగా.. యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్ 2021( IPL 2021) మలి దశ మాత్రమే అందుబాటులో ఉంది. ఆ మ్యాచులనే భారత్ పక్కా ప్రణాళికలతో ఉపయోగించుకోనుందట. ఈ క్రమంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)తో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly)తో భేటీ అయ్యాడట. లండన్‌లో రెండో టెస్టు సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, సెక్రటరీ జే షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారని సమాచారం తెలిసింది. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌పైనే వీరు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారత్ లక్ష్యం ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్ గెలవడమే అయినా.. అక్టోబర్-నవంబర్‌లో జరిగే ప్రపంచకప్ కూడా కోహ్లీ కెప్టెన్సీకి ఎంతో కీలకం. ఎందుకంటే విరాట్ సారథ్యంలో భారత్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో రాబోయే ఐసీసీ ట్రోఫీ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే బీసీసీఐ పెద్దలు జట్టు సారథిని కలవడం అందరిలో ఆసక్తి నెలకొంది.
ఈ సమావేశంలో చర్చించిన అంశాలు బయటకు చెప్పడం మంచిది కాదంటూనే.. ఐపీఎల్ తర్వాత భారత్ ఆడాల్సింది టీ20 ప్రపంచకప్పే అయినందున దాని గురించే చర్చించి ఉంటారని ఆ అధికారి పేర్కొన్నారు. " నిజమే.. బీసీసీఐ పెద్దలు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సమావేశమయ్యారు. టీ20 ప్రపంచకప్ 2021కు చాలా తక్కువ సమయం ఉంది. ఐపీఎల్ 2021 వెంటనే మెగా టోర్నీ జరగనుంది. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ గురించి చర్చించుకొని ఉంటారు" అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్ 2021 జరగనుండగా.. అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.