భారత జట్టు (Team India) ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ (Stuart Binny) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ వెంటనే అమలులోనికి వస్తుందని ఒక ప్రకటన విడుదల చేశాడు. భారత మాజీ ఆటగాడు రోజర్ బిన్నీ కొడుకే స్టువర్ట్ బిన్నీ. 1983 వరల్డ్ కప్ విన్నింగ్ (1983 World Cup) జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ అడుగు జాడల్లోనే ఆయన కొడుకు స్టువర్ట్ బిన్నీ క్రికెటర్‌గా మారాడు. టీమ్ ఇండియా తరపున మొత్తం 23 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 14 వన్డేలు, 6 టెస్టులతో పాటు మూడు టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. స్టువర్ట్ బిన్నీ దాదాపు 17 ఏళ్ల పాటు కర్ణాటక జట్టు తరపున దేశవాళీ క్రికెట్ ఆడాడు. 2013-14 సీజన్‌లో బిన్నీ 443 పరుగులు చేయడంతో పాటు 14 వికెట్లు తీసి ఆ సీజన్‌లో కర్ణాటక జట్టు రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 4796 పరుగులతోపాటు 146 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్‌లో రాణించడంతో బిన్నీకి జాతీయ జట్టులో అవకాశం లభించింది. 2014లో తొలి సారిగా బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఆ పర్యటనలో భాగంగా మీర్పూర్‌లో జరిగిన రెండో వన్డేలో బిన్నీ కేవలం 4 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఇప్పటికీ వన్డేల్లో భారతీయ బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన అదే కావడం గమనార్హం. బంగ్లాదేశ్ పర్యటన అనంతరం బిన్నీ 2014లో ఇంగ్లాండ్ పర్యటనకు (England Tour) ఎంపికయ్యాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక అదనపు బౌలర్ కావాలనే ఉద్దేశంతో బిన్నీని ఎంపిక చేశారు. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన టెస్టుతో బిన్నీ సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా లభించలేదు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టును ఆదుకున్నాడు. 78 పరుగులు చేసి భారత జట్టును ఓటమి నుంచి తప్పించాడు.
ఇక బిన్నీ 2015 వరల్డ్ కప్‌కు కూడా ఎంపికయ్యాడు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. చివరి సారిగా 2016లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ వన్డే ఆడాడు. ఇక స్టువర్ట్ బిన్నీ 2010లో తొలి సారిగా ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుతో ఐపీఎల్ (IPL) కెరీర్ ప్రారంభించిన బిన్నీ.. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌కు మారాడు. ఆ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా బిన్నీ కొనసాగాడు. 6 సీజన్ల పాటు రాజస్థాన్ జట్టుతో ఉన్నాడు. 2016లో రాజస్థాన్ రాయల్స్ జట్టును సస్పెండ్ చేయడంతో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అతడిని రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి సారిగా ఐపీఎల్‌లో తన సొంత ఊరు బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే కేవలం రెండేళ్లు మాత్రమే ఆర్సీబీ జట్టుతో ఉన్నాడు. రెండేళ్ల తర్వాత తిరిగి రాజస్థాన్ రాయల్స్ జట్టుకే తిరిగి వచ్చాడు. అయితే గత ఏడాది ఐపీఎల్ ఆక్షన్ సందర్భంగా బిన్నీని రాజస్థాన్ రాయల్స్ జట్టు విడుదల చేసింది. అప్పటి నుంచి అతడు అన్‌సోల్డ్ గా మిగిలిపోయాడు. ఇక గత సీజన్‌లోనే స్టువర్ట్ బిన్నీ కర్ణాటక రంజీ జట్టు నుంచి నాగాలాండ్ క్రికెట్ టీమ్‌కు మారాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడి క్రికెట్ కెరీర్ ముగిసినట్లైంది.
Stuart Binny has announced his retirement from all formats of the game. He holds India's best bowling figures in an ODI match.
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 30, 2021
స్టువర్ట్ బిన్నీ ప్రముఖ స్పోర్ట్స్ ప్రెజెంటేటర్ మయాంతి లాంగర్‌ను 2012లో పెళ్లి చేసుకున్నాడు. గత వారం భారత జట్టు లీడ్స్‌లో ఘోరమైన ఓటమి తర్వాత మయాంతి లాంగర్ ఒక ట్వీట్ చేసింది. భారత క్రికెటర్లు జేమ్స్ అండర్సన్ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోతుంటే.. 2014 పర్యటనలో బిన్నీ ఏ విధంగా జేమ్స్ అండర్సన్‌ను ఎదుర్కున్నాడో గుర్తు చేస్తూ ఒక ఫొటో పోస్టు చేసింది. కానీ ఆ పోస్టు పెట్టిన రెండు రోజులకే స్టువర్ట్ బిన్నీ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం గమనార్హం. 'నా దేశం కోసం క్రికెట్ ఆటడం నాకు ఎంతో గర్వకారణం, సంతోషం. నా క్రికెట్ ప్రయాణంలో సహాయం చేసిన బీసీసీఐకి నా ధన్యవాదములు. ఇన్నాళ్లు నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కనుక నన్ను ప్రోత్సహించకపోతే ఇన్నాళ్ల నా కెరీర్ ఉండేది కాదు. నన్ను కెప్టెన్‌గా చేసి ఎన్నో ట్రోఫీలు నా రాష్ట్రానికి అందించడానికి వాళ్ల సహాయమే కారణం. నన్ను ప్రోత్సహించిన కోచ్‌లు, సెలెక్టర్లకు.. నాపై నమ్మకం పెట్టుకున్న నా కెప్టెన్లకు.. నా కుటుంబానికి ధన్యవాదములు. నా రక్తంలోనే క్రికెట్ ఉంది. ఆటకు ఏదో చేయాలనే తపన తోనే ఇన్నాళ్లు మైదానంలో గడిపాను. ఇక త్వరలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాను. అందరికీ ధన్యవాదాలు' అని బిన్నీ ఒక ప్రకటనలో తెలిపాడు.
Shreyas Iyer: 'నా జీవితంలో ఆ రోజులు చాలా కష్టంగా గడిచాయి.. నాకు జరిగిన దాన్ని జీర్ణించుకోలేకపోయాను'
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.