అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు రాజధాని కాబూల్‌ను ఆక్రమించుకొని అధికారాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ట్విట్టర్ వేదికగా ఏమని స్పందించారో ఒకసారి చూడండి.
అప్గానిస్తాన్‌లో (Afghanistan) ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని (Democracy) కూలదోసి తాలిబాన్లు (Talibans) ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం దేశ రాజధాని కాబూల్‌ను శివార్లకు వచ్చిన తాలిబాన్లు.. 'శాంతియుతంగా అధికార మార్పిడి జరగాలి' అనే సందేశాన్ని పంపారు. అప్పటికే అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బంది, ఇతర అమెరికా సైనికులు ఆప్గానిస్తాన్ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు. ఇంకా ప్రతిఘటించడం ద్వారా అనేక మంది దేశభక్తుల ప్రాణాలు త్యాగం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ పోరాటాన్ని విరమిస్తున్నామని పరోక్షంగా తాలిబాన్ల విజయాన్ని ఆయన అంగీకరించారు. దీనికి సంబంధించి ఫేస్బుక్లో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. మరోవైపు దేశంలోని పరిస్థితులపై ఆఫ్గానిస్తాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్ (Rashid Khan), మహ్మద్ నబీ (Mohammad Nabi) ఆందోళన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా వాళ్లు తమ దేశంలో ఉన్న ఆందోళనకరమైన పరిస్థితులపై ప్రపంచ దేశాలకు చెందిన నాయకులను వేడుకున్నారు. ఈ నెల 10న రషీద్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక భావోద్వేగమైన పోస్టు చేశాడు. 'ప్రపంచ నేతలారా నా దేశం ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నది. వేలాది మంది అమాయక ప్రజలు, పిల్లలు, మహిళలు ప్రతీ రోజు చనిపోతున్నారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసం చేయబడుతున్నాయి. వేలాది కుటుంబాలు చెదిరిపోయారు. మమ్మల్ని ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో వదిలివేయకండి. ఆఫ్గాన్లను చంపడం ఆపేయండి.. ఆఫ్గానిస్తాన్‌ను నాశనం చేయడం ఆపండి. మాకు శాంతి కావాలి' అంటూ పోస్టు పెట్టాడు.
రషీద్ ఖాన్ తాజాగా అగస్టు 15న 'శాంతి' అనే సింగిల్ వర్డ్‌ను ట్వీట్ చేశాడు. అప్పటికే తాలిబాన్లు కాబూల్‌ను ఆక్రమించుకొని అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కాబూల్‌లో రక్తపాతం సృష్టించకుండానే శాంతియుతంగా అధికారాన్ని తమ సొంతం చేసుకున్నారు. అయితే అప్పటికే ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం కుప్పకూలడంతో చేసేదేమి లేక రషీద్ ఖాన్ అలా ట్వీట్ చేసి ఉంటాడని.. లేకపోతే అతడికి తాలిబాన్ల నుంచి ముప్పు ఉంటుందిని భయపడి ఉంటాడని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. మరో క్రికెటర్ మహ్మద్ నబీ కూడా అగస్టు 11న వరుసగా రెండు ట్వీట్లు చేశాడు. 'ఒక ఆఫ్గాన్ పౌరుడినా.. నా దేశం రక్తపాతంలో ఉండటం చూస్తున్నాను. దేశంలో ఎంతో ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎటు చూసినా విషాదమే కనపడుతున్నది. మానవత్వం అనేది మచ్చుకు అయినా లేదు. అనేక కుటుంబాలు కాబూల్‌లోని సొంత ఇళ్లు వదిలేసి తెలియని ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు. వాళ్ల ఇళ్లను ఆక్రమించుకుంటున్నారు. నేను ప్రపంచ దేశాల నాయకులకు వేడుకుంటున్నాను.. మా దేశాన్ని ఇలా వదిలేయకండి. మాకు మీ సహాయం అవసరం. మాకు ఇప్పుడు శాంతి కావాలి' అని ట్వీట్లలో ప్రాధేయపడ్డాడు.
Dear World Leaders! My country is in chaos,thousand of innocent people, including children & women, get martyred everyday, houses & properties being destructed.Thousand families displaced..
Don’t leave us in chaos. Stop killing Afghans & destroying Afghaniatan🇦🇫.
We want peace.🙏
అఫ్గానిస్తాన్‌లో అత్యధిక ట్యాక్స్ పేయర్లలో క్రికెటర్లు ముందు వరుసలో ఉన్నారు. దేశం తరపునే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక క్రికెట్ లీగ్స్‌లో పాల్గొంటున్నారు. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ఇద్దరూ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నారు. ఆఫ్గానిస్తాన్‌లో కనీసం క్రికెట్ ప్రాక్టీస్ చేసే పరిస్థితులు కూడా లేకపోవడంతో వీళ్లు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ స్టేడియంలలో ప్రాక్టీస్ చేస్తుంటారు. అంతే కాకుండా బీసీసీఐ వీళ్ల కోసం డెహ్రాడూన్ స్టేడియంను ఇచ్చింది. ఇతర దేశాలతో సిరీస్‌లను ఆఫ్గాన్ జట్టు ఇండియాలోనే ఆడుతుంటుంది. ఇక త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 రెండో దశలో ఆఫ్గానిస్తాన్ క్రికెటర్లు పాల్గొంటారా లేదా అనే దానిపై సందిగ్దత వీడింది. ప్రస్తుతం ఈ ఇద్దరు క్రికెటర్లు అఫ్గానిస్తాన్‌లో కాకుండా 'ది హండ్రెడ్' లీగ్ ఆడుతూ యూకేలో ఉన్నారు. త్వరలో వీళ్లు యూఏఈ చేరుకుంటారని తెలుస్తున్నది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.