T20 World Cup: దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సూపర్ 12లో వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడిపోయిన డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్.. సెమీఫైనల్ అవకాశాలను క్లిష్టతరం చేసుకున్నది.
ఐసీసీ (ICC) పురుషుల టీ20 వరల్డ్ కప్ 2021 (T20 World Cup) సూపర్ 12లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం వెస్టిండీస్‌తో (West Indies) జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa) 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 144 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు సరైన ఆరంభం లభించలేదు. తొలి ఓవర్లోనే కెప్టెన్ తెంబా బవుమా (2) రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత రీజా హెన్రిక్స్, రస్సీ డస్సెన్ కలసి ఇన్నింగ్స్ చక్కదిగ్గారు. వెస్టిండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటూ పరుగులు రాబట్టారు. ముఖ్యంగా క్వింటన్ డికాక్ స్థానంలో జట్టులోకి వచ్చిన రీజా హెన్రిక్స్ చెలరేగిపోయాడరు. వేగంగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతడికి తోడుగా డస్సెన్ కూడా చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కలసి రెండో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రీజా హెన్రిక్స్ (43) హోస్సెన్ బౌలింగ్‌లో హెట్మెయర్కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు.
ఇక ఆ తర్వాత వచ్చిన ఏడెన్ మార్క్రమ్ తన ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించాడు. విండీస్ బౌలర్లపై ఏ మాత్రం దయ చూపకుండా చితక బాదాడు. మైదానం నలువైపులా బంతిని తరలిస్తూ వేగంగా పరుగులు రాబట్టాడు. కేవలం 26 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సులతో చెలరేగి 51 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా డస్సెన్ 43 పరుగులు చేశాడు. వీరిద్దరూ వెస్టిండీస్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకొని పోయారు. మూడో వికెట్‌కు అజేయంగా 83 పరుగులు జోడించారు. దీంతో 18.2 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా జట్టు 2 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు విండీస్‌పై 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్నది.
ఈ పరాజయంతో వెస్టిండీస్‌కు సెమీఫైనల్ ఆశలు క్లిష్టంగా మారాయి. డిఫెండింగ్ చాంపియన్ అయిన విండీస్ వార్మప్‌లో రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో పాటు సూపర్ 12లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఘోర పరాజయం పాలైంది. తాజాగా దక్షిణాఫ్రికాపై కూడా ఓడిపోయింది. మిగిలిన మూడు మ్యాచ్‌లు భారీ తేడాతో గెలిచినా.. మిగిలిన జట్ల గెలుపోటములపైనే విండీస్ సెమీఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టుకు ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్ (16), ఎవిన్ లూయీస్ (56) శుభారంభాన్ని అందించారు. ఎవిన్ లూయీస్ వేగంగా పరుగులు రాబట్టి వరల్డ్ కప్‌లో తొలి అర్ద సెంచరీ సాధించాడు. కానీ లెండిల్ సిమ్మన్స్ 35 బంతులు ఆడి కేవలం 16 పరుగులే చేయడంతో తర్వాత బ్యాటర్లపై భారం పడింది. కిరాన్ పొలార్డ్ (26), నికొలస్ పూరన్ (12), క్రిస్ గేల్ (12) తక్కువ పరుగులకే పరిమితం అయ్యారు. ఇక మిగిలిన బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.