హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup: భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. టీ20 వరల్డ్ కప్ కూడా...

T20 World Cup: భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. టీ20 వరల్డ్ కప్ కూడా...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్‌ను నిర్వహించాలని భావిస్తున్నారు. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుందని ESPN cricInfo తెలిపింది.

కోవిడ్ మహమ్మారి ప్రభావం క్రీడా రంగంపై తీవ్రంగా పడిన విషయం తెలిసిందే. వైరస్ కారణంగా ఎన్నో టోర్న‌మెంట్‌లు వాయిదాపడ్డాయి. ఈ క్రమంలో భారత క్రికెట్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్. ఇప్పటికే ఐపీఎల్ టోర్నీ మధ్యలో నిలిచిపోయింది. మిగిలిన మ్యాచ్‌లను యూఏఈకి తరలించారు. ఐతే త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌ను కూడా యూఏఈకి తరలించనున్నట్లు తెలుస్తోంది. భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌, నవంబర్‌లలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ మన దేశంలో జరగడం కష్టమేనని తెలిసింది. భారత్‌లో కరోనా పరిస్థితుల నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ యూఏఈకి తరలిపోయే అవకాశముందని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. ANI వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

''మన దేశంలో ఇపుడున్న కరోనా పరిస్థితుల దృష్ట్యా భారత్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ ను యూఏఈకి తరలించే అవకాశం ఉంది.. ప్రస్తుత పరిస్థితులను బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తోంది. క్రికెటర్ల ఆరోగ్యం, భద్రత మాకు ముఖ్యం. టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటాం.'' అని జైషా తెలిపారు.

కాగా, ఐపీఎల్ 2020 టోర్నీ ఏప్రిల్ నెలలో మధ్యలోనే వాయిదా పడిన విషయం తెలిసిందే. పలువురు ఆటగాళ్లకు కరోనా సోకడంతో మ్యాచ్‌లను నిలిపివేశారు. ఐపీఎల్ 2021లో 29 మ్యాచ్‌లే జరిగాయి. మిగిలిన వాటిని గత ఏడాది లాగే యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. టోర్నీ రెండో భాగం సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. అక్టోబరు 15న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్‌ను నిర్వహించాలని భావిస్తున్నారు. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుందని ESPN cricInfo తెలిపింది.

టీ20 వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు ఆడనున్నాయి. టీ20 ర్యాంకింగ్‌లో టాప్ 8లో ఉన్న జట్లు నేరుగా సూపర్ 12లో ఆడతాయి. సూపర్ 12లో ఆడేందుకు మరో 8 జట్లు (బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్, పపువా న్యూగినియా) తలపడతాయి. ఈ 8 జట్ల రెండు గ్రూప్‌లుగా విభజించి రౌండ్ 1 నిర్వహిస్తారు. ఇందులో 12 మ్యాచ్‌లు ఉంటాయి. రెండు గ్రూప్స్‌లో టాప్-2 స్థానాలు సాధించే 4 జట్లను సూపర్ 12కు పంపిస్తారు. ఇక సూపర్ 12 దశే టీ20 వరల్డ్ కప్‌లో అసలు సిిసలైన సమరం. సూపర్ 12లో తలపడే 12 జట్లను 6 టీమ్స్ చొప్పున.. రెండు గ్రూప్‌లుగా విభజించి.. మొత్తం 30 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. అక్టోబరు 24 నుంచి సూపర్ 12 జరుగుతుంది. ఈ రెండు గ్రూప్‌ల నుంచి టాప్-2 స్థానాలు సాధించే జట్లు సెమీ ఫైనల్‌కు వెళ్తాయి. అక్కడ విజయం సాధించే రెండు టీమ్స్ ఫైనల్లో తలపడతాయి. రౌండ్ 1 మ్యాచ్‌లను యూఏఈతో పాటు ఒమన్‌లో కూడా నిర్వహిస్తారు. సూపర్ 12 మ్యాచ్‌లకు మాత్రం యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియాలు ఆతిథ్యమిస్తాయి.

First published:

Tags: Cricket, Sports, T20 World Cup 2021, UAE

ఉత్తమ కథలు