హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup Final : కేన్ మామే న్యూజిలాండ్ సైన్యం.. ఆస్ట్రేలియా ముందు ఫైటింగ్ టోటల్..

T20 World Cup Final : కేన్ మామే న్యూజిలాండ్ సైన్యం.. ఆస్ట్రేలియా ముందు ఫైటింగ్ టోటల్..

Kane Williamson (Image Credit : ICC)

Kane Williamson (Image Credit : ICC)

T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ అదరగొట్టింది. కేన్ మామ సూపర్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ పై పట్టు సాధించింది. ఇక, బౌలర్లపైనే ఆ జట్టు భారం.

  దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ అదరగొట్టింది. కేన్ మామ సూపర్ బ్యాటింగ్ తో తన టీమ్ కు మంచి టోటల్ అందించాడు. విలియమ్సన్ అదిరే బ్యాటింగ్ తో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ ( 48 బంతుల్లో 85 పరుగులు..10 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇదే రెండో అత్యధిక స్కోరు. అంతకుముందు 2016 ఫైనల్ లో ఇంగ్లండ్ పై మార్లన్ శామ్యూల్స్ కూడా 85 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అయితే, 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కేన్ విలియమ్సన్ క్యాచ్ ని హాజెల్ వుడ్ మిస్ చేశాడు. దీంతో భారీ మూల్యం చెల్లించుకుంది.

  టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను ఆ జట్టు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. డారిల్ మిచెల్, మార్టిన్ గుప్తిల్ చెత్త బంతుల్ని బౌండరీలు తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. అయితే, డారిల్‌ మిచెల్‌(11) రూపంలో న్యూజిలాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ ఐదో బంతికి షాట్‌ ఆడే ప్రయత్నంలో కీపర్‌ వేడ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత గుప్తిల్ తో కలిసిన కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ ని స్లోగా ముందుకు తీసుకువెళ్లాడు. వీరిద్దరి ఆచి తూచి ఆడటంతో ఫస్ట్ 10 ఓవర్ల ముగిసేసరికి న్యూజిలాండ్ వికెట్‌ నష్టపోయి 57 పరుగులు మాత్రమే చేసింది. అయితే, 48 పరుగుల విలువైన భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. 28 పరుగులు చేసిన మార్టిన్‌ గప్టిల్‌ జంపా బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  అయితే, న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో హీరోగా కెప్టెన్ విలియమ్సన్ నిలిచాడు. తనదైన క్లాసిక్ బ్యాటింగ్ తో స్కోరు వేగం తగ్గకుండా ప్రయత్నించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. విలియమ్సన్ 3బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత తన గేమ్ మార్చాడు కేన్ మామ. మిచెల్ స్టార్క్ వేసిన 16 వ ఓవర్ లో ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. అయితే, భారీ షాట్ కు ప్రయత్నించిన గ్లెన్ ఫిలిప్స్ (18 పరుగులు) హాజెల్ వుడ్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. ఆ వెంటనే కేన్ విలియమ్సన్ కూడా ఔటయ్యాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న కేన్ మామ కూడా హజెల్ వుడ్ బౌలింగ్ లోనే స్మిత్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఖర్లో, నీషమ్ 7 బంతుల్లో 13 పరుగులు సాధించాడు.

  అయితే, ఈ మ్యాచ్ లో కేన్‌ విలియమ్సన్‌ ఒక అరుదైన రికార్డు సాధించాడు. టి20 ప్రపంచకప్‌ చరిత్రలో ఫైనల్‌ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించిన రెండో కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.ఇంతకముందు శ్రీలంక కెప్టెన్‌గా కుమార సంగక్కర 2009 టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఇక విలియమ్సన్‌ మరో ఘనత కూడా అందుకున్నాడు. టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అత్యంత వేగంగా హాఫ్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా విలియమ్సన్‌ నిలిచాడు. 33 బంతుల్లో ఈ ఫీట్ ను సాధించాడు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Australia, Cricket, David Warner, Kane Williamson, New Zealand, T20 World Cup 2021

  ఉత్తమ కథలు