హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup Final : నయా చాంపియన్ ఆస్ట్రేలియా.. మరోసారి న్యూజిలాండ్ కు నిరాశే..

T20 World Cup Final : నయా చాంపియన్ ఆస్ట్రేలియా.. మరోసారి న్యూజిలాండ్ కు నిరాశే..

Photo Credit : ICC

Photo Credit : ICC

T20 World Cup Final : ఆస్ట్రేలియా నయా చాంపియన్ గా అవతరించింది. పొట్టి కప్ లోటును తీర్చుకుంది కంగారూల జట్టు. మరోసారి ఫైనల్ లో బోల్తాపడింది న్యూజిలాండ్ టీమ్.

  టీ20 వరల్డ్ కప్ 2021 విజేతగా ఆస్ట్రేలియా అవతరించింది. కివీస్ సెట్ చేసిన టార్గెట్ ను ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఫినిష్ చేసింది. 8 వికెట్ల తేడాతో మెడిన్ ధనాధన్ టోర్నీని తమ ఖాతాలో వేసుకుంది ఆస్ట్రేలియా. దీంతో పొట్టి కప్ లేని లోటును తీర్చుకుంది కంగారూల టీమ్. మిచెల్ మార్ష్ ( 50 బంతుల్లో 77 పరుగులు.. 6 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 53 పరుగులు.. 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తో ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మాత్రమే రెండు వికెట్లతో మెరిశాడు.172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకి ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్ లో లేని ఆరోన్‌ ఫించ్‌(5) మరోసారి నిరాశపర్చాడు. బౌల్ట్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు ఆరోన్ పించ్. అయితే, ఆ తర్వాత మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు. కివీస్ బౌలర్లను టార్గెట్ చేసుకుని రెచ్చిపోయారు. ఈ ఇద్దరి దూకుడుతో ఆస్ట్రేలియా 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 77 పరుగులు చేసింది.

  ఈ క్రమంలో డేవిడ్‌ వార్నర్‌ 35 బంతుల్లో అర్థసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వార్నర్‌ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు.. 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే, దూకుడు మీదున్న వార్నర్ బౌల్ట్ బోల్తా కొట్టించాడు. బౌల్ట్ బౌలింగ్ లో వార్నర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వార్నర్ ఔటైనా.. మిచెల్ మార్ష్ మాత్రం తన దూకుడును ఆపలేదు. అతనికి జతగా కలిసిన గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా ధనాధన్ బ్యాటింగ్ చేయడంతో కివీస్ చేతులేత్తేసింది. ఈ క్రమంలో మిచెల్ మార్ష్ కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

  అంతకు ముందు టాస్ ఓడిపోయిన కివీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 172 ప‌రుగులు చేసింది. న్యూజిలాండ్‌ను సారథి కేన్ విలియ‌మ్స‌న్ (85: 10 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 10 ఓవ‌ర్ల వ‌ర‌కు స్వల్ప స్కోర్‌కే ప‌రిమితం అయిన న్యూజిలాండ్‌.. 10 ఓవ‌ర్లు దాటాక స్కోర్‌ను అమాంతం పెంచేసింది. విలియ‌మ్స‌న్ వ‌రుస‌గా ఫోర్లు, సిక్సులు బాది స్కోర్ స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. కివీస్ కెప్టెన్ 48 బంతుల్లో 85 ప‌రుగులు చేశాడు. కేన్ తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.

  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ డారిల్ మిచెల్‌ (8 బంతుల్లో 11: ఒక సిక్స్‌) దూకుడుగా ఆడేందుకు యత్నించినా త్వరగానే ఔటయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్‌ కేన్‌విలియ‌మ్స‌న్తో కలిసి మార్టిన్‌ గప్తిల్ (28) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి 48 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన గప్తిల్‌ ఆసీస్‌ ఫీల్డర్‌ మార్కస్ స్టాయినిస్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ (18: ఒక ఫోర్, ఒక సిక్స్)తో కలిసి కేన్‌ విజృంభించాడు. ఆరంభంలో నిదానంగా ఆడిన కేన్‌.. తర్వాత దూకుడు పెంచాడు. ఈ క్రమంలో కెరీర్‌లో 14వ అర్ధ శతకం నమోదు చేశాడు.

  ఒక పక్క ధాటిగా ఆడుతుండటం.. మరోవైపు బంతులు ఉండటంతో టీ20ల్లో కేన్‌ విలియమ్సన్‌ తొలి సెంచరీ సాధిస్తాడని అభిమానులు ఆశించినప్పటికీ.. అది సాధ్యపడలేదు. 85 పరుగుల వద్ద జొష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో బౌండరీ లైన్‌ వద్ద స్టీవ్ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. చివర్లలో టీమ్ సీఫర్ట్‌ (8 నాటౌట్), జేమ్స్ నీషమ్‌ (13 నాటౌట్) బ్యాటింగ్‌తో కివీస్‌ స్కోరు 170 పరుగులు దాటింది. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3, జంపా ఒక వికెట్‌ తీశారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Australia, David Warner, Kane Williamson, New Zealand, T20 World Cup 2021

  ఉత్తమ కథలు