WI vs IRE : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో పెను సంచలనం నమోదైంది. రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్ (West Indies) జట్టు సూపర్ 12కు చేరకుండానే ఇంటి దారి పట్టింది. సూపర్ 12కు చేరాలంటే తప్పకుండా నెగ్గాల్సిన మ్యాచ్ లో నికోలస్ పూరన్ (Nicholas Pooran) నాయకత్వంలోని విండీస్ జట్టు చేతులెత్తేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన డూ ఆర్ డై పోరులో ఐర్లాండ్ (Ireland) 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై ఘనవిజయం సాధించింది. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (48 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాడు. 147 పరుగులతో బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ 17.3 ఓవర్లలో వికెట్ మాత్రమే నష్టపోయి 150 పరుగులు చేసి నెగ్గింది. లోర్కాన్ టక్కర్ (35 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ ఆండ్రీ బల్ బిర్నీ (23 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తమ వంతు పాత్ర పోషించారు. టి20 ప్రపంచకప్ లో సూపర్ 12కు చేరుకోవడం ఐర్లాండ్ కు ఇదే తొలిసారి
ఛేదనలో ఐర్లాండ్ కు ఓపెనర్లు ఆండ్రీ, స్టిర్లింగ్ శుభారంభం చేశారు. ఇద్దరు తొలి ఓవర్ నుంచే విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. పేస్ ను ఉపయోగిస్తూ బౌండరీల వర్షం కురిపించారు. దాంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో కదిలింది. వీరిద్దరూ తొలి వికెట్ కు 73 పరుగులు జోడించారు. అనంతరం ఆండ్రీ అవుటయ్యాడు. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన టక్కర్ కూడా చక్కగా ఆడాడు. అయితే స్మిత్ బౌలింగ్ లో కాటన్ బౌల్డ్ అయినా నో బాల్ కావడంతో టక్కర్ బతికిపోయాడు. ఇక మరో ఎండ్ లో అద్భుతంగా ఆడిన స్టిర్లింగ్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక వీరిద్దరూ అజేయమైన రెండో వికెట్ కు 77 పరుగులు జోడించి ఐర్లాండ్ ను సూపర్ 12కు చేర్చారు.
Ireland are through to the Super 12 ???? A comprehensive performance in Hobart sees them knocking West Indies out of the tournament#T20WorldCup |#IREvWI | ????: https://t.co/LNaSAJSEKW pic.twitter.com/iT0mYvnNzP
— ICC (@ICC) October 21, 2022
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో గ్యారెత్ గెలానీ 3 వికెట్లతో సత్తా చాటాడు. బ్యారీ మెక్ కార్తి, సిమి సింగ్ చెరో వికెట్ సాధించారు. బ్రాండన్ కింగ్ (48 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. చివర్లో ఒడెన్ స్మిత్ (12 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, T20 World Cup 2022, West Indies