T20 World Cup 2022 : ఆసియా కప్ (Asia Cup) చాంపియన్ శ్రీలంక (Sri Lanka) క్రికెట్ జట్టుగా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొన్న మదుషాన్ గాయం బారిన పడితే.. నిన్న గుణతిలకకు గాయం అయ్యింది. తాజాగా కీలక బౌలర్ దుష్మంత చమీర (Dushmanata Chameera) మళ్లీ గాయం బారిన పడ్డాడు. యూఏఈ (UAE)తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ చమీర పిక్క గాయం బారిన పడ్డాడు. ఇదే గాయంతో గత నెలలో జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్ నుంచి కూడా దుష్మంత చమీర తప్పుకున్నాడు. తాజాాగా మళ్లీ అదే గాయం తిరగబెట్టింది. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో 3.5 ఓవర్లు వేసిన చమీర 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. తన కోటాలో చివరి బంతిని వేసే క్రమంలో కాలి పిక్క కండరాలు పట్టేయడంతో చివరి బంతిని వేయకుండానే మైదానం వీడాడు.
శ్రీలంక సూపర్ 12కు అర్హత సాధించాలంటే గురువారం నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచ్ లో తప్పుకుండా నెగ్గాల్సిన పరిస్థితిలో నిలిచింది. ఇక ఈ మ్యాచ్ నుంచి చమీర తప్పుకున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు పేర్కొంది. ఓడితే మాత్రం ఇంటి దారి పడుతుంది. ఒక వేళ వర్షంతో మ్యాచ్ రద్దయితే మాత్రం నెదర్లాండ్స్ సూపర్ 12కు చేరుకుంటుంది. ఇక శ్రీలంక భవితవ్యం నమీబియా, యూఏఈ మ్యాచ్ పై ఆధారపడి ఉంటుంది. ఆ మ్యాచ్ కూడా వర్షంతో రద్దయితే అప్పుడు నెదర్లాండ్స్, నమీబియాలు సూపర్ 12కు చేరుకుంటాయి. నెట్ రన్ రేట్లో నమీబియా శ్రీలంక కంటే కూడా మెరుగ్గా ఉంది.
అలా జరగకుండా నెదర్లాండ్స్ పై శ్రీలంక నెగ్గి.. యూఏఈపై నమీబియా నెగ్గితే మాత్రం నమీబియా, శ్రీలంక జట్లు సూపర్ 12కు చేరుకుంటాయి. నెదర్లాండ్స్.. శ్రీలంక, నమీబియాలతో సమానంగా నాలుగు పాయింట్లతో నిలిచినా.. నెట్ రన్ రేట్ కారణంగా శ్రీలంక, నమీబియాలు సూపర్ 12కు చేరుకుంటాయి. మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. 153 పరుగుల లక్ష్యచేధనకు దిగిన యూఏఈ 17.1 ఓవర్లలో 73 పరుగులకు కుప్పకూలింది. వానిందు హసరంగా(3/8), దుష్మంత్ చమీరా(3/15)తమ బౌలింగ్‌తో తీన్మార్ వేయడంతో యూఏఈ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మహీష్ తీక్షణకు రెండు వికెట్లు దక్కగా.. ప్రమోద్ మధుషాన్, డసన్ శనక తలో వికెట్ తీసారు. యూఏఈ బ్యాటర్లలో అయాన్ అఫ్జాల్ ఖాన్(19), జునైద్ సిద్దిఖీ(18) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బౌలింగ్‌లో రాణించిన యూఏఈ.. బ్యాటింగ్‌లో కనీస పోరాటం చేయలేక ఇంటిదారి పట్టింది.
యూఏఈ బౌలర్ కార్తీక్ మెయ్యప్పన్ హ్యాట్రిక్ తీసి సంచలనం సృష్టించాడు. శ్రీలంక మొదట బ్యాటింగ్ చేయగా.. 15వ ఓవర్ లో కార్తీక్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఆ ఓవర్ లో 4,5,6 బంతుల్లో వరుసగా భానుక రాజపక్స, చరిత్ అసలంక, దసున్ షనక వికెట్లు తీసి ఈ వరల్డ్ కప్ లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇక, కార్తీక్ మొత్తం 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Sri Lanka, T20 World Cup 2022, Team India