టీ20 ప్రపంచకప్ 2022 (T20 World Cup 2022) లో నమీబియా చేతిలో ఘోర ఓటమి తర్వాత శ్రీలంక సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చింది. టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక (Sri Lanka) అదరగొట్టింది. సమష్టిగా రాణించి అద్భుత విజయంతో సూపర్ -12 ఆశల్ని నిలుపుకుంది. మంగళవారం యూఏఈ (UAE)తో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. 153 పరుగుల లక్ష్యచేధనకు దిగిన యూఏఈ 17.1 ఓవర్లలో 73 పరుగులకు కుప్పకూలింది. వానిందు హసరంగా(3/8), దుష్మంత్ చమీరా(3/15)తమ బౌలింగ్‌తో తీన్మార్ వేయడంతో యూఏఈ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మహీష్ తీక్షణకు రెండు వికెట్లు దక్కగా.. ప్రమోద్ మధుషాన్, డసన్ శనక తలో వికెట్ తీసారు. యూఏఈ బ్యాటర్లలో అయాన్ అఫ్జాల్ ఖాన్(19), జునైద్ సిద్దిఖీ(18) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బౌలింగ్‌లో రాణించిన యూఏఈ.. బ్యాటింగ్‌లో కనీస పోరాటం చేయలేక ఇంటిదారి పట్టింది.
ఇక, యూఏఈ బౌలర్ కార్తీక్ మెయ్యప్పన్ హ్యాట్రిక్ తీసి సంచలనం సృష్టించాడు. శ్రీలంక మొదట బ్యాటింగ్ చేయగా.. 15వ ఓవర్ లో కార్తీక్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఆ ఓవర్ లో 4,5,6 బంతుల్లో వరుసగా భానుక రాజపక్స, చరిత్ అసలంక, దసున్ షనక వికెట్లు తీసి ఈ వరల్డ్ కప్ లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇక, కార్తీక్ మొత్తం 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
కార్తీక్ హ్యాట్రిక్ తో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పాతుమ్ నిశ్శంక (60 బంతుల్లో 74 పరుగులు ; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు ఫైటింగ్ టోటల్ అందించాడు. ధనంజయ డిసిల్వా 21 బంతుల్లో 33 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగతా శ్రీలంక బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. కార్తీక్ మూడు వికెట్లు తీయగా, జహుర్ ఖాన్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
View this post on Instagram
ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో గ్రూప్-ఏలో ఉన్న శ్రీలంక.. గ్రూప్ టాపర్ నెదర్లాండ్స్‌తో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే శ్రీలంక సూపర్ 12కు అర్హత సాధించనుంది. లేకుంటే పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న నమీబియా ముందడుగు వేస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన యూఏఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏ, గ్రూప్-బిలో టాప్-2 టీమ్స్ సూపర్ -12కు అర్హత సాధించనున్నాయి. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న జట్లు నేరుగా సూపర్ 12 ఆడనున్నాయి. అయితే, గ్రూపు మ్యాచులు రసవత్తరంగా సాగుతుండటంతో ఏ జట్లు సూపర్ -12 స్టేజీలోకి ఎంట్రీ ఇస్తాయో ఇప్పుడే ఓ అంచనాకి రావడం కష్టం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Sri Lanka, T20 World Cup 2022, UAE