ENG vs SL : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో సెమీస్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో ఇంగ్లండ్ (England) సత్తా చాటింది. ఆరంభంలో భారీగా పరుగులు సమర్పించుకున్నా చివర్లో కమ్ బ్యాక్ చేసింది. దాంతో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక (Sri Lanka) 20 ఓవర్లలో 8 వికెట్లుకు 141 పరుగులు మాత్రమే చేసింది. మార్క్ వుడ్ 3 వికెట్లు తీశాడు. పాథుమ్ నిస్సంక (45 బంతుల్లో 67; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ శతకంతో రాణించాడు.ఇతడు మినహా మిగిలిన లంక బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. దాంతో శ్రీలంకకు ఆరంభం లభించినా భారీ స్కోరును అందుకోలేకపోయింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు నిస్సంక, కుశాల్ మెండీస్ (18) శుభారంభం చేశారు. వీరు వేగంగా తొలి వికెట్ కు 39 పరుగులు జోడించారు. కుశాల్ మెండీస్ అవుటయ్యాక.. ధనంజయ డిసిల్వా (9), చరిత్ అసలంక (8) విఫలం అయ్యారు. అయితే నిస్సంక మాత్రం ధాటిగా ఆడుతూ పరుగులు సాధించాడు. భానుక రాజపక్స (22)తో కలిసి జట్టును నడిపించాడు. అయితే నిస్సంక అవుటయ్యాక శ్రీలంక ఇన్నింగ్స్ గాడి తప్పింది. చివరి వరుస బ్యాటర్లు పరుగులు సాధించడంలో విఫలం అయ్యారు. దాంతో ఒక దశలో 180 పరుగుల సాధించేలా కనిపించిన శ్రీలంక చివరకు 141 పరుగుల వద్ద ఆగిపోయింది.
ఇక ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా శ్రీలంకకు ఒరిగేదేమి లేదు. శ్రీలంక జట్టు ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. అయితే వెళుతూ వెళుతూ తమతో ఇంగ్లండ్ ను కూడా తీసుకువెళ్తుందో లేదో చూడాలి. ఇక ఈ మ్యాచ్ ఫలితంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్ అవకాశాలు కూడా ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓడితే ఈ గ్రూప్ నుంచి కివీస్ తో పాటు ఆసీస్ సెమీఫైనల్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే మాత్రం టి20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా ప్రయాణం ఇక్కడితే ముగుస్తుంది. వాస్తవానికి ఆస్ట్రేలియా జట్టు ఈ టి20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా అడుగుపెట్టింది. అయితే న్యూజిలాండ్ చేతిలో ఎదురైన 89 పరుగుల భారీ ఓటమి ఆ జట్టు పాలిట విలన్ గా మారింది. ఫామ్ ను బట్టి చూస్తే శ్రీలంక కంటే కూడా ఇంగ్లండ్ పటిష్టంగా ఉంది. అయితే మ్యాచ్ సిడ్నీలో జరుగుతుండటం.. అదే సమయంలో శ్రీలంక జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉండటం ఇంగ్లండ్ ను కలవరపెడుతున్నాయి. సిడ్నీ స్వతహాగా స్పిన్ కు అనుకూలిస్తుంది. ఈ క్రమంలో లంక స్నిన్నర్లు హసరంగ, తీక్షణలు ఈ మ్యాచ్ లో కీలకం కానున్నారు.
తుది జట్లు
శ్రీలంక
నిస్సంక, కుశాల్ మెండీస్, ధనంజయ డిసిల్వా, అసలంక, రాజపక్సె, దాసున్ షనక (కెప్టెన్), హసరంగ, కరుణరత్నే, తీక్షణ, లహిరు కుమార, రజిత
ఇంగ్లండ్
జాస్ బట్లర్ (కెప్టెన్), అలెక్స్ హేల్స్, స్టోక్స్, మలాన్, మొయిన్ అలీ, లివింగ్ స్టోన్, బ్రూక్స్, స్యామ్ కరణ్, వోక్స్, వుడ్, ఆదిల్ రషీద్,
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, England, Sri Lanka, T20 World Cup 2022