IND vs NZ Warm Up Match : భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్ల మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. బ్రిస్బేన్ వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే భారీ వర్షంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అంతకుముందు ఇదే గ్రౌండ్ లో జరిగిన పాకిస్తాన్ (Pakistan), అఫ్గానిస్తాన్ (Afghanistan) మ్యాచ్ కూడా వానతో రద్దయ్యింది. ఇక సూపర్ 12 దశ ఈ నెల 22 నుంచి ఆరంభం కానుంది. భారత్,పాకిస్తాన్ మధ్య ఈ 23న మెల్ బోర్న్ లోని విఖ్యాత ఎంసీజీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
డేంజర్ లో మెగా టోర్నీ
ప్రస్తుతం టి20 ప్రపంచకప్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అందుకు కారణం గురువారం నుంచి ఆస్ట్రేలియా మొత్తం వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొనడమే. గురువారం (20 అక్టోబర్) నుంచి వచ్చే 10 రోజుల పాటు ఆస్ట్రేలియాకు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దాంతో మెగా టోర్నీ సజావుగా సాగుతుందా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
వారికి ప్రాక్టీస్ నిల్
భారత జట్టులో రిషభ్ పంత్, దీపక్ హుడా, అక్షర్ పటేల్ లకు ప్రాక్టీస్ లభించలేదు. ప్రాక్టీస్ మ్యాచ్ లో పంత్, హుడాలకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అదే సమయంలో అక్షర్ పటేల్ కు బౌలింగ్ చేసే చాన్స్ రాలేదు. ఇక మొహమ్మద్ షమీ ఒక్క ఓవర్ మాత్రమే వేశాడు. అయితే షమీని మినహిస్తే హుడా, పంత్, అక్షర్ పటేల్ లకు సరైన ప్రాక్టీస్ లభించలేదనే చెప్పాలి.
భారత్, పాక్ మ్యాచ్ పై అనుమానాలు
అక్టోబర్ 23న ఎంసీజీ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్ష సూచన ఉంది. అక్టోబర్ 23న (ఆదివారం) మెల్ బోర్న్ మొత్తం భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం దాదాపు 90 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. సూపర్ 12 దశకు వర్ష సూచన ఉండటంతో ప్రతి మ్యాచ్ కూడా ముఖ్యమే. ఎందుకంటే వర్షంతో మ్యాచ్ లు రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అంతేకాకుండా నెట్ రన్ రేట్ చివర్లో కీలక పాత్ర పోషించనుంది. దాంతో భారత్ కు ప్రతి మ్యాచ్ కూడా ముఖ్యమే కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs newzealand, Kane Williamson, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli