ENG vs PAK Final : నెల రోజు పాటు క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తూ వస్తోన్న టి20 ప్రపంచకప్ (T20 World cup) 2022 తుది సమరానికి చేరుకుంది. మెల్ బోర్న్ (Melbourne) వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్తాన్ (Pakistan), ఇంగ్లండ్ (England) జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం గం.1.30 నుంచి ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచినా టి20 ప్రపంచకప్ ను రెండోసారి గెలిచిన జట్టుగా నిలుస్తుంది. టి20 ప్రపంచకప్ ను రెండు సార్లు గెలిచిన ఏకైక జట్టుగా ఇప్పటికి అయితే వెస్టిండీస్ మాత్రమే ఉంది. ఇక ఇప్పుడు పాక్, ఇంగ్లండ్ జట్లలో ఒకటి విండీస్ సరసన చేరే అవకాశం ఉంది.
పాక్ గెలిస్తే సంచలనమే
ఈ టి20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ జట్టుది విచిత్రమైన కథ. భారత్ తో జరిగిన తొలి మ్యాచ్ లో పాక్ ఆఖరి బంతికి ఓడిపోయింది. ఆ తర్వాత జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లోనూ ఓడిపోయింది. దాంతో పాకిస్తాన్ పై సొంత అభిమానులు, మాజీ క్రికెటర్లు విమర్శలు చేశారు. అయితే అక్కడి నుంచి అనూహ్యంగా పుంజుకున్న పాకిస్తాన్ వరుసగా మూడు విజయాలు సాధించింది. అదే సమయంలో నెదర్లాండ్స్ రూపంలో లక్ కలిసి రావడంతో సెమీస్ గడప తొక్కింది. ఇక సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై నెగ్గిన పాక్ మూడోసారి ఫైనల్లో ప్రవేశించింది. ఇక ఇంగ్లండ్ విషయానికి వస్తే.. టైటిల్ ఫేవరెట్ గానే బరిలోకి దిగింది. అయితే ఐర్లాండ్ చేతిలో ఓటమితో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ తర్వాత మిగిలిన మ్యాచ్ ల్లో నెగ్గి (ఆస్ట్రేలియా మ్యాచ్ మినహా.. ఆ మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది) సెమీస్ చేరింది. ఇక సెమీఫైనల్లో భారత్ పై 10 వికెట్ల తేడాతో నెగ్గి సగర్వంగా ఫైనల్ చేరింది.
ఓపెనర్లే కీలకం
ఇరు జట్లలోనూ ఓపెనర్లే కీలకంగా ఉన్నారు. సెమీస్ ముందు వరకు కూడా ఏ మాత్రం ప్రభావం చూపని పాక్ ఓపెనర్లు సెమీఫైనల్స్ లో మాత్రం అదరగొట్టారు. సరైన సమయంలో ఫామ్ లోకి వచ్చిన బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ లు అర్ధ్ సెంచరీలతో పాకిస్తాన్ ను గెలిపించారు. మరోసారి వీరు ఫైనల్లో కూడా రాణిస్తే ఇంగ్లండ్ కు టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. బౌలింగ్ లో కూడా పాకిస్తాన్ బలంగా ఉంది. షాహీన్ అఫ్రిది తిరిగి లయ అందుకోవడం.. నసీం షా నిలకడగా రాణిస్తుండటం జట్టుకు కలిసి వచ్చే అంశాలు. ఇక ఆల్ రౌండర్లు నవాజ్, షాదాబ్ ఖాన్ లతో పాటు యువ సంచలనం హరీస్ అహ్మద్ భారీ షాట్లు ఆడితే ఇంగ్లండ్ కు తిప్పలు ఖాయం. ఇంగ్లండ్ కు కూడా ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జాస్ బట్లర్ కీలకం కానున్నారు. భారత్ పై జరిగిన సెమీస్ లో వీరు అజేయంగా జట్టును గెలిపించారు. వీరితో పాటు స్టోక్స్, లివింగ్ స్టోన్, మొయిన్ అలీలు కూడా కీలకం కానున్నారు. ఇక సెమీస్ కు దూరమైన వుడ్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)
ఇంగ్లండ్
జాస్ బట్లర్ (కెప్టెన్), అలెక్స్ హేల్స్, స్టోక్స్, అలీ, లివింగ్ స్టోన్, బ్రూక్స్, సాల్ట్, కరణ్, వోక్స్, వుడ్, ఆదిల్ రషీద్
పాకిస్తాన్
బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, హరీస్, ఇఫ్తికర్ అహ్మద్, షాన్ మసూద్, షాదబ్ ఖాన్, నవాజ్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, నసీం షా, రవూఫ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babar Azam, England, Pakistan, T20 World Cup 2022