దాదాపు నెల రోజులుగా క్రికెట్ అభిమానుల్ని అలరిస్తున్న టీ20 ప్రపంచకప్ 2022 (T20 World Cup 2022) ఆఖరి అంకానికి చేరుకుంది. ఈ మెగాటోర్నీలో అసలు సిసలు పోరుకు రంగం సిద్ధమైంది. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా, ఇవాళ పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ (NZ vs PAK) మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సిడ్నీలోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇక భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. గ్రూప్-1 టాపర్‌గా న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకోగా.. అదృష్టం కలిసి రావడంతో గ్రూప్-2 రన్నరప్‌గా పాకిస్థాన్ నాకౌట్ బెర్త్ సాధించింది. గురువారం జరగనున్న రెండో సెమీస్‌లో భారత్-ఇంగ్లండ్ తలపడనున్నాయి.
పాకిస్థాన్‌తో పోలిస్తే న్యూజిలాండ్ చాలా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ విషయం చూసుకున్నా పాక్ కంటే మెరుగ్గానే కనిపిస్తోంది. అయితే, టీ20 ఫార్మాట్ లో రికార్డులు మాత్రం పాక్ కే అనుకూలంగా ఉన్నాయి. పొట్టి ఫార్మాట్లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌దే పై చేయిగా ఉంది. ఇప్పటివరకు న్యూజిలాండ్-పాకిస్థాన్‌ల మధ్య మొత్తం 28 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. పాక్ 17 మ్యాచ్‌ల్లో, న్యూజిలాండ్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
టీ20 వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు 6 సందర్భాల్లో తలపడగా.. పాక్ 4 సార్లు, కివీస్ 2 సార్లు విజయం సాధించింది. అంతేకాకుండా గత 5 టీ20ల్లో పాక్ 4 మ్యాచ్‌ల్లో గెలువగా.. న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గింది.మరోవైపు ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌లోనూ న్యూజిలాండ్‌పై పాక్‌దే పైచేయిగా ఉంది. ఈ రెండు జట్లు వన్డే, టీ20 ప్రపంచకప్‌ల్లో మూడుసార్లు సెమీఫైనల్స్‌లో తలపడగా.. అన్నింటిలో పాకిస్థానే విజయం సాధించింది.
1992 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో పాక్.. న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. 1999 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 2007 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతేకాకుండా ఈ మెగా టోర్నీకి ముందు న్యూజిలాండ్ ను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించింది. ఈ రికార్డులే ఇప్పుడు న్యూజిలాండ్ శిబిరంలో టెన్షన్ తెప్పిస్తున్నాయి. అయితే, ఈ మెగాటోర్నీలో కివీస్ సూపర్ ఫాంలో ఉంది. మరోవైపు పాక్ అదృష్టం కలిసి వచ్చి సెమీస్ ఆడుతుంది. అయితే, రెండు జట్లు స్ట్రాంగ్ గా ఉండటంతో ఈ పోరు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తుది జట్లు అంచనా :
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
పాకిస్తాన్ : మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ నవాజ్, మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babar Azam, Cricket, Kane Williamson, New Zealand, Pakistan, T20 World Cup 2022