దాదాపు నెల రోజులుగా క్రికెట్ అభిమానుల్ని అలరిస్తున్న టీ20 ప్రపంచకప్ 2022 (T20 World Cup 2022) ఆఖరి అంకానికి చేరుకుంది. ఈ మెగాటోర్నీలో అసలు సిసలు పోరుకు రంగం సిద్ధమైంది. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా, ఇవాళ పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ (NZ vs PAK) మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సిడ్నీలోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇక భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. గ్రూప్-1 టాపర్‌గా న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకోగా.. అదృష్టం కలిసి రావడంతో గ్రూప్-2 రన్నరప్‌గా పాకిస్థాన్ నాకౌట్ బెర్త్ సాధించింది. గురువారం జరగనున్న రెండో సెమీస్‌లో భారత్-ఇంగ్లండ్ తలపడనున్నాయి.
పాకిస్థాన్‌తో పోలిస్తే న్యూజిలాండ్ చాలా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ విషయం చూసుకున్నా పాక్ కంటే మెరుగ్గానే కనిపిస్తోంది. సూపర్ -12 స్టేజీలో ఇంగ్లండ్ చేతిలో మాత్రమే ఓడిపోయింది. అయితే, మిగతా మ్యాచుల్లో ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించింది. ఆస్ట్రేలియా లాంటి స్ట్రాంగ్ జట్టును వారి సొంతగడ్డపైనే 89 పరుగుల తేడాతో చిత్తుగా మెగాటోర్నీని ఘనంగా ప్రారంభించింది.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాల్లో దుమ్మురేపుతుంది బ్లాక్ క్యాప్స్ జట్టు. బ్యాటింగ్ లో ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ సూపర్ ఫాంలో ఉన్నారు. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ అదరగొడుతున్నాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో 195 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. అతడు ఈ మ్యాచులో ఇదే ఫాం కంటిన్యూ చేస్తే పాక్ జట్టుకు తిప్పలు తప్పవు.
అయితే, కేన్ మామ ప్రదర్శన అంతగా బాగా లేదు. కేన్ మామతో పాటు డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్ చెలరేగాల్సి ఉంది. ఇక, బౌలింగ్ లో లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ పేస్ బాధ్యతలు మోయనున్నారు. ఈ మెగాటోర్నీలో న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్ వన్ ఆఫ్ ది బెస్ట్. స్పిన్ విభాగంలో మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీ కీ రోల్ ప్లే చేయనున్నారు.
మరోవైపు, పాక్ జట్టు అదృష్టం తోడై సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సౌతాఫ్రికా పుణ్యమా అని ఇంటికి వెళ్లాల్సిన జట్టు.. కప్పుకు చేరువైంది. పాక్ జట్టు ప్రదర్శన అనిశ్చితిగా ఉంటుంది. ఆడిన రోజు.. ఆ జట్టును ఓడించడం ఏ టీమ్ కైనా కష్టమే. అయితే, ఒక్కోక్కసారి వారి ప్రదర్శన పసికూనల కన్నా దారుణంగా ఉంటుంది. సూపర్ -12 స్టేజిలో జింబాబ్వే చేతిలో ఓడిపోవడమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.
పాక్ బ్యాటింగ్ లో స్టార్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజాం ఇంతవరుకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ముఖ్యంగా బాబర్ ఆడిన ఐదు ఇన్నింగ్స్ లో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, మిడిలార్డర్ లో షాన్ మసూద్, హ్యారిస్, ఇఫ్తికర్ రాణస్తున్నారు. ఆఖర్లో షాదాబ్ ఖాన్ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇక, బౌలింగ్ లో పాక్ జట్టుకు తిరుగులేదు. షాహీన్ షా అఫ్రిది, హారిస్ రౌవూఫ్, నసీం షా వంటి వరల్డ్ క్లాస్ పేస్ బౌలింగ్ ఆ జట్టు సొంతం. స్పిన్ విభాగంలో షాదాబ్ ఖాన్ తిరుగులేని ప్రదర్శన చేస్తున్నాడు. ఆడిన ఐదు మ్యాచుల్లో 10 వికెట్లు తీసి దుమ్మురేపాడు ఈ లెగ్ స్పిన్ మాంత్రికుడు. రెండు జట్లు స్ట్రాంగ్ గా ఉండటంతో హోరాహోరీ పోరు ఖాయమంటున్నారు నిపుణులు.
తుది జట్లు అంచనా :
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
పాకిస్తాన్ : మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ నవాజ్, మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babar Azam, Cricket, Kane Williamson, New Zealand, Pakistan, T20 World Cup 2022