T20 World Cup 2022 - NZ vs PAK 2nd : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ (New Zealand), పాకిస్తాన్ (Pakistan) జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 152 పరుగులు చేసింది. బిగ్ మ్యాచ్ ప్లేయర్ డారిల్ మిచెల్ (35 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (42 బంతుల్లో 46; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనపించాడు. చివర్లో జేమ్స్ నీషమ్ (12 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్) భారీ షాట్లు ఆడటంలో విఫలం అయ్యాడు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లతో సత్తా చాటాడు. మొహమ్మద్ నవాజ్ ఒక వికెట్ తీశాడు.
టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ స్లోగా ఉండటంతో బంతి బ్యాట్ మీదకు సరిగ్గా రాలేదు. దాంతో కివీస్ బ్యాటర్లు పరుగుల కోసం ఇబ్బందులు పడ్డారు. తొలి ఓవర్ లోనే డేంజరస్ బ్యాటర్ ఫిన్ అలెన్ (4)ను షాహీన్ అఫ్రిది అవుట్ చేశాడు. అనంతరం డెవోన్ కాన్వే (21)ను షాదాబ్ ఖాన్ అద్భుత త్రోతో నేరుగా వికెట్లను గిరాటేసి రనౌట్ చేశాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గ్లెన్ ఫిలిప్స్ (6) నిరాశ పరిచాడు. దాంతో కివీస్ 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జట్టను కేన్ విలియమ్సన్, మిచెల్ ఆదుకున్నారు. వీరు నాలుగో వికెట్ కు 68 పరుగులు జోడించారు. అయితే వేగంగా పరుగులు సాధించే క్రమంలో స్కూప్ షాట్ కు ప్రయత్నించి కేన్ మామ షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక చివర్లో మిచెల్, నీషమ్ సింగిల్స్, టుస్ తేస్తూ పరుగులు సాధించడంతో న్యూజిలాండ్ 150 పరుగుల మార్కును దాటగలిగింది.
తుది జట్లు :
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
పాకిస్తాన్ : మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ నవాజ్, మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babar Azam, Kane Williamson, New Zealand, Pakistan, T20 World Cup 2022