క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా ధనాధన్ టోర్నీ టీ20 వరల్డ్ కప్ 2022 (T20 World Cup 2022)ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. కొన్ని జట్లు ప్రాక్టీస్ లో నిమగ్నమైతే.. మరికొన్ని టీమ్స్.. ఇతర జట్లతో సిరీస్ లు ఆడుతూ కావాల్సినంత ప్రాక్టీస్ సంపాదించుకుంటున్నాయి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా (Australia) వేదికగా టి20 ప్రపంచకప్ (T20 World Cup) జరగనుంది. 15 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న టి20 ప్రపంచకప్ ను ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలగా టీమిండియా (Team India) ఉంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఈ నెల 23న జరిగే మ్యాచ్ తో భారత్ తన ప్రపంచకప్ టైటిల్ వేటను ఆరంభిస్తుంది. అయితే, అంతకుముందే కంగారూల గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా అదిరే ఆరంభం అందుకుంది.
టీ20 ప్రపంచకప్ ప్రస్థానాన్ని విజయంతో మొదలుపెట్టింది టీమిండియా. మెగా టోర్నీ కోసం పెర్త్ వేదికగా సన్నదమవుతున్న రోహిత్ సేన.. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో దుమ్మురేపింది. సమష్టిగా రాణించి ఈ వామప్ మ్యాచ్‌లో 13 పరుగులతో విక్టరీ కొట్టింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ తన జోరును కొనసాగించగా.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ సత్తా చాటారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 52) హాఫ్ సెంచరీతో మెరవగా.. దీపక్ హుడా(14 బంతుల్లో 22), దినేశ్ కార్తీక్(19 నాటౌట్) రాణించారు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(3) మరోసారి నిరాశపర్చాడు. అయితే, హార్దిక్ పాండ్యా(20 బంతుల్లో 27) పర్వాలేదనిపించాడు.
కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ సైతం ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.
ఇది కూడా చదవండి : బీసీసీఐ, రోహిత్ కు పెద్ద తలనొప్పిగా శ్రేయస్ అయ్యర్.. అందుకు ఈ లెక్కలే సాక్ష్యం!
దాంతో రిషభ్ పంత్(9) ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే అతను ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. వెస్టర్న్ ఆసీస్ బౌలర్లలో జాసన్ బెహ్రండార్ఫ్, మాథ్యూ కెల్లీ, ఆండ్రూ టై వికెట్లు తీశారు. ఆ తర్వాత 159 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టర్న్ ఆస్ట్రేలియా టీమిండియాకు షాకిచ్చేలా కన్పించింది. అయితే, అర్ష్ దీప్, భువీ సూపర్ బౌలింగ్ తో విజయాన్ని సొంతం చేసుకుంది రోహిత్ సేన.
159 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో సామ్ ఫాన్నింగ్(59) హాఫ్ సెంచరీతో పోరాడాడు. ఇక భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/6) మూడు వికెట్లతో సత్తా చాటగా.. యుజ్వేంద్ర చాహల్(2/15), భువనేశ్వర్ కుమార్(2/26) రెండేసి వికెట్లతో సత్తా చాటారు. ప్రాక్టీస్ మ్యాచులో రోహిత్ శర్మ నిరాశపర్చాడు. అయితే, బౌలర్లు సత్తా చాటడం ప్లస్ పాయింట్. ఇదే జట్టుతో భారత్ మరో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి స్ట్రాంగ్ జట్లతో భారత్ రెండు వార్మప్ మ్యాచ్‌లను ఆడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli