టి20 ప్రపంచకప్ (T20 World Cup) వేటను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ వార్మప్ మ్యాచులో టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 57 పరుగులు ; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (33 బంతుల్లో 50 పరుగులు ; 6 ఫోర్లు, 1 సిక్సర్ ) రాణించారు. కార్తీక్ (20 పరుగులు), కోహ్లీ (19 పరుగులు), రోహిత్ (15 పరుగులు) ఫర్వాలేదన్పించారు. హార్దిక్ పాండ్యా మాత్రమే రెండు పరుగులు చేసి నిరాశపర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కేన్ రిచర్డ్ సన్ నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు. స్టార్క్, మ్యాక్స్ వెల్, ఆగర్ చెరో వికెట్ తీశారు.
మొయిన్ ఫైట్ కు ముందు తమ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి టీమిండియాకు ఇదో గోల్డెన్ ఛాన్స్.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు అదిరే ఓపెనింగ్ ఆరంభం అందింది. రోహిత్ ను ఓ వైపు ఉంచి.. కేఎల్ రాహుల్ దంచి కొట్టాడు. దొరికిన బంతిని బౌండరీ తరలిస్తూ స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. మరో ఎండ్ లో రోహిత్ కేఎల్ రాహుల్ కి స్ట్రైక్ ఇస్తూ.. నెమ్మదిగా ఆడాడు. ఈ క్రమంలో రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న రాహుల్ ను మ్యాక్స్ వెల్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో 78 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత రోహిత్ కూడా అగర్ బౌలింగ్ ఔటయ్యాడు.
కోహ్లీ చూడచక్కని షాట్లతో అలరించినా.. స్టార్క్ బౌన్సర్ కి బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ త్వరగా ఔటైన.. సూర్య, దినేష్ కార్తీక్ తో కలిసి స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. వీరిద్దరూ చూడచక్కని షాట్లతో చెలరేగగా.. ఆఖర్లో ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో టీమిండియా 200 పరుగుల మార్కును అందుకోలేకపోయింది.
షమీకి కీలకం
ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో మొహ్మద్ షమీ తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ను ఆడాడు. అనంతరం అతడు మళ్లీ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ ను ఆడలేదు. ఇతర బౌలర్లు గాయపడటం.. అవేశ్ ఖాన్ పూర్ ఫామ్ వంటి కారణాలతో స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో షమీ చేరాడు. ఇక బుమ్రా గాయంతో టోర్నీకి దూరం కావడంతో అతడి స్థానంలో చివరి నిమిషంలో షమీ ప్రపంచకప్ జట్టులోకి వచ్చాడు. అతడు గత మూడు నెలలుగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. దాంతో అతడికి ఈ రెండు వార్మప్ మ్యాచ్ లు కీలకం కానున్నాయి. అదే సమయంలో హర్షల్ పటేల్, చహల్, భువనేశ్వర్ కుమార్ లకు కూడా ఈ వార్మప్ మ్యాచ్ లు కీలకం. సమస్యలు ఏవైనా ఉంటే ఇక్కడే సరి చేసుకోవాల్సి ఉంది.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, అశ్విన్, హర్షల్ పటేల్, షమీ, భువనేశ్వర్ కుమార్, చహల్, అర్ష్ దీప్ సింగ్.
ఆస్ట్రేలియా
ఫించ్ (కెప్టెన్), వార్నర్, స్మిత్, మ్యాక్స్ వెల్, అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, ఇంగ్లిస్, మార్ష్, హేజల్ వుడ్, కేన్ రిచర్డ్ సన్, స్టార్క్, స్టొయినిస్, వేడ్, జంపా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs australia, KL Rahul, Surya Kumar Yadav, T20 World Cup 2022, Team India