టి20 ప్రపంచకప్ (T20 World Cup) వేటకు టీమిండియా రెడీ అయింది. ఆస్ట్రేలియాతో సన్నాహక మ్యాచ్ తో భారత్ (India) తమ వేటను మొదలుపెట్టనుంది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సూపర్ 12 దశ ఈ నెల 22 నుంచి ఆరంభం కానుండగా.. అందుకు సన్నాహకాల్లో భాగంగా భారత్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లను ఆడనుంది. తొలి పోరు అక్టోబర్ 17న ఆస్ట్రేలియాతో.. రెండో పోరు 19న న్యూజిలాండ్ తో ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగే పోరుతో టైటిల్ వేటను ఆరంభించనుంది. ఇక ఈ మ్యాచ్ లో అందరూ ఆటగాళ్లు ప్రాక్టీస్ లో పాల్గొనే ఛాన్స్ ఉంది. మొయిన్ ఫైట్ కు ముందు తమ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి టీమిండియాకు ఇదో గోల్డెన్ ఛాన్స్.
అసలైన టోర్నీ ముందు భారత్ ఆడనున్న చివరి రెండు వార్మప్ మ్యాచ్ లు ఇవే కావడంతో వీటిని చక్కగా ఉపయోగించుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ కంటే కూడా ముందు వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో భారత్ రెండు వార్మప్ మ్యాచ్ లను ఆడింది. అయితే ఒక దాంట్లో గెలిచి మరో దాంట్లో ఓడిపోయింది. ఇప్పుడు మరో రెండు వార్మప్ మ్యాచ్ లను ఆడనుంది. ఈ రెండింటిలోనూ ప్లేయర్లందరికీ చక్కటి ప్రాక్టీస్ కల్పించాలనే ఉద్దేశంతో టీం ఉంది. ఇక ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో మొత్తం 15 మంది జట్టు సభ్యులకు కూడా బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉంది. అయితే కోచ్ ద్రవిడ్ అందరికీ అవకాశం ఇస్తాడా? లేక పక్కా ప్లేయింగ్ ఎలెవన్ తో ప్రాక్టీస్ చేస్తాడా? అనేది తేలాల్సి ఉంది.
షమీకి కీలకం
ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో మొహ్మద్ షమీ తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ను ఆడాడు. అనంతరం అతడు మళ్లీ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ ను ఆడలేదు. ఇతర బౌలర్లు గాయపడటం.. అవేశ్ ఖాన్ పూర్ ఫామ్ వంటి కారణాలతో స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో షమీ చేరాడు. ఇక బుమ్రా గాయంతో టోర్నీకి దూరం కావడంతో అతడి స్థానంలో చివరి నిమిషంలో షమీ ప్రపంచకప్ జట్టులోకి వచ్చాడు. అతడు గత మూడు నెలలుగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. దాంతో అతడికి ఈ రెండు వార్మప్ మ్యాచ్ లు కీలకం కానున్నాయి. అదే సమయంలో హర్షల్ పటేల్, చహల్, భువనేశ్వర్ కుమార్ లకు కూడా ఈ వార్మప్ మ్యాచ్ లు కీలకం. సమస్యలు ఏవైనా ఉంటే ఇక్కడే సరి చేసుకోవాల్సి ఉంది.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, అశ్విన్, హర్షల్ పటేల్, షమీ, భువనేశ్వర్ కుమార్, చహల్, అర్ష్ దీప్ సింగ్.
ఆస్ట్రేలియా
ఫించ్ (కెప్టెన్), వార్నర్, స్మిత్, మ్యాక్స్ వెల్, అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, ఇంగ్లిస్, మార్ష్, హేజల్ వుడ్, కేన్ రిచర్డ్ సన్, స్టార్క్, స్టొయినిస్, వేడ్, జంపా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs australia, Rohit sharma, Surya Kumar Yadav, T20 World Cup 2022, Team India, Virat kohli