SL vs NAM : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 తొలిరోజే పెను సంచలనం నమోదైంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన మెగా టోర్నీ ఆరంభ పోరులో ఆసియా చాంపియన్ (Asia Cup) శ్రీలంక (Sri Lanka)కు పసికూన నమీబియా (Namibia) భారీ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో శ్రీలంకపై నమీబియా 55 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 19 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. నమీబియా బౌలర్లలో డేవిడ్ వీస్, బెర్నార్డ్, షికాంగో, జాన్ ఫ్రైలింక్ తలా రెండు వికెట్ల చొప్పున తీశారు. శ్రీలంక తరఫున దాసున్ షనక (23 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
చేతులెత్తేసిన లంకేయులు
164 టార్గెట్ అయినప్పటికీ శ్రీలంక లాంటి అనుభవం ఉన్న జట్టు ఈజీగానే గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే శ్రీలంక ఇన్నింగ్స్ లో 5 ఓవర్లు ముగిసే సరికి అంతా తారుమారు అయ్యింది. వీస్, ఫ్రైలింక్ లు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ శ్రీలంక బ్యాటర్లను వరుస విరామాల్లో అవుట్ చేశారు. కుశాల్ మెండీస్ (6), నిస్సంక (9), గుణతిలక (0), ధనంజయ డిసిల్వా (12) ఇలా వచ్చి అలా వెళ్లారు. అయితే భానుక రాజపక్స్ (20), కెప్టెన్ షనక ఇంకా క్రీజులో ఉండటంతో శ్రీలంక విజయంపై నమ్మకాన్ని కోల్పోలేదు. అయితే అనవసరపు షాట్లు ఆడిన భానుక రాజపక్స, షనక పెవిలియన్ కు చేరారు. ఆ తర్వాత హసరంగ (4), కరుణరత్నే (5) కూడా విఫలం అవ్వడంతో శ్రీలంక ఓటమి ఖాయమైంది. ఈ ఓటమితో శ్రీలంక సూపర్ 12 ఆశలు సంక్లిష్టం అయ్యాయి. తర్వాత జరిగే రెండు మ్యాచ్ ల్లోనూ శ్రీలంక భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. అంతేకాకుండా నెట్ రన్ రేట్ కూడా పెంచుకోవాలి. వర్షంతో ఏ మ్యాచ్ అయినా రద్దయితే శ్రీలంక టి20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.
అంతకుమందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో నమీబియా 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. జాన్ ఫ్రై లింగ్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. జె జె స్మిత్ (16 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆఖర్లో ధాటిగా బ్యాటింగ్ చేశాడు. శ్రీలంక బౌలర్లలో మదుషాన్ 2 వికెట్లు తీశాడు. చమిక కరుణరత్నే, తీక్షణ, దుష్మంత చమీర, హసరంగా తలా ఒక వికెట్ తీశారు. 15 ఓవర్లకు నమీబియా స్కోరు 6 వికెట్లకు 95 పరుగులుగా ఉంది. అయితే చివరి 5 ఓవర్లలో లింగ్, స్మిత్ ఏకంగా 68 పరుగులు సాధించడం విశేషం. చివరి ఐదు ఓవర్లలో వీరిద్దరూ శ్రీలంక బౌలింగ్ ను ఉతికి ఆరేశారు. స్మిత్ భారీ సిక్సర్లతో చెలరేగితే లింగ్ క్లాసిక్ షాట్లతో ఫోర్లు రాబట్టాడు. ఇక చివర్లో శ్రీలంక ఫీల్డింగ్ లో పేలవ ప్రదర్శన చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Sri Lanka, T20 World Cup 2022, Team India