ENG vs SL : టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో గ్రూప్ ‘1’ నుంచి సెమీఫైనల్ కు చేరే జట్లు ఏవో తేలాయి. ఇప్పటికే న్యూజిలాండ్ (New Zealand) సెమీఫైనల్ కు చేరగా.. తాజాగా ఇంగ్లండ్ (England) కూడా నాకౌట్ దశకు చేరుకుంది. సెమీఫైనల్ కు చేరాలంటే తప్పకుండా నెగ్గాల్సిన కీలక పోరులో శ్రీలంక (Sri Lanka)పై ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. దాంతో నాకౌట్ దశకు అర్హత సాధించింది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసి నెగ్గింది. అలెక్స్ హేల్స్ (30 బంతుల్లో 47; 7 ఫోర్లు, 1 సిక్స్), బెన్ స్టోక్స్ (36 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. కెప్టెన్ జాస్ బట్లర్ (28) తన వంతు పాత్ర పోషించాడు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార, హసరంగ, ధనంజయ డిసిల్వా తలా రెండు వికెట్లు తీశారు.
142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు హేల్స్, బట్లర్ అదిరిపోయే శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్ కు కేవలం 44 బంతుల్లోనే 75 పరుగులు జోడించారు. భారీ షాట్ కు ప్రయత్నించి బట్లర్ పెవిలియన్ కు చేరాడు. కాసేపటికే హేల్స్ కూడా అవుటయ్యాడు. హ్యారీ బ్రూక్స్ (4), లివింగ్ స్టోన్ (4), మొయిన్ అలీ (1) శ్రీలంక స్పిన్నర్లును ఎదుర్కొనలేక పెవిలియన్ కు చేరుకున్నారు. అయితే మరో ఎండ్ లో బెన్ స్టోక్స్ మాత్రం మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. స్యామ్ కరణ్ (6) కూడా లేని షాట్ కు వెళ్లి బౌండరీ దగ్గర ఫీల్డర్ చేతికి చిక్కాడు. 18వ ఓవర్ వేసిన లహిరు కుమార కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి స్యామ్ కరణ్ ను అవుట్ చేశాడు. అయితే మరో ఎండ్ లో ఉన్న బెన్ స్టోక్స్.. క్రిస్ వోక్స్ (5 నాటౌట్)తో కలసి జట్టును గెలిపించడమే కాకుండా ఇంగ్లండ్ ను సెమీస్ లో నిలిపాడు. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక (Sri Lanka) 20 ఓవర్లలో 8 వికెట్లుకు 141 పరుగులు మాత్రమే చేసింది. మార్క్ వుడ్ 3 వికెట్లు తీశాడు. పాథుమ్ నిస్సంక (45 బంతుల్లో 67; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ శతకంతో రాణించాడు.ఇతడు మినహా మిగిలిన లంక బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. దాంతో శ్రీలంకకు ఆరంభం లభించినా భారీ స్కోరును అందుకోలేకపోయింది.
పాపం ఆస్ట్రేలియా
శ్రీలంకపై ఇంగ్లండ్ నెగ్గడంతో ఆ జట్టు ఖాతాలో 7 పాయింట్లు చేరాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు 7 పాయింట్లతో సమంగా నిలిచాయి. చిత్రంగా ఈ మూడు జట్లు కూడా ఆడిన 5 మ్యాచ్ ల్లో మూడింటిలో గెలిచి మరో దాంట్లో ఓడింది. మరో మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. దాంతో ఈ మూడు జట్లు కూడా 7 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే నెట్ రన్ రేట్ లో న్యూజిలాండ్ మెరుగ్గా ఉండటంతో ఆ జట్టు గ్రూప్ టాపర్ గా నిలిచింది. ఇక ఇంగ్లండ్ నెట్ రన్ రేట్ +0.473తో -0.173తో ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టింది. దాంతో ఇంగ్లండ్ గ్రూప్ రన్నరప్ గా సెమీస్ చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, England, Sri Lanka, T20 World Cup 2022