ఆస్ట్రేలియా గడ్డపై జగజ్జేతగా నిలిచింది ఇంగ్లండ్. మెల్బోర్న్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది ఇంగ్లండ్. 138 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. దీంకో 5 వికెట్లతో విజయకేతనం ఎగురువేసింది. బెన్ స్టోక్స్ (49 బంతుల్లో 52 పరుగులు నాటౌట్ ; 5 ఫోర్లు, 1 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ తో మరోసారి ఇంగ్లండ్ ను చాంపియన్ గా నిలిపాడు., జాస్ బట్లర్ (26 పరుగులు), హ్యారీ బ్రూక్ (20 పరుగులు), మొయిన్ అలీ (19 పరుగులు) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో హారీస్ రౌఫ్ రెండు వికెట్లుతో సత్తా చాటాడు. షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ తీశారు. అయితే, అఫ్రిదికి కీలక సమయంలో గాయమైంది. దీంతో, అతడు 2.1 ఓవర్లు మాత్రమే వేశాడు.
138 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. టీమిండియాపై సెమీస్ లో రెచ్చిపోయిన అలెక్స్ హేల్స్1 పరుగుకే షాహీన్ షా అఫ్రిది బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో.. 7 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బట్లర్, సాల్ట్ కాసేపు బౌండరీలతో అలరించారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న సాల్ట్ ని హారిస్ రౌఫ్ బోల్తా కొట్టించాడు. సాల్ట్ 10 పరుగులు చేసి రౌఫ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ కాసేపటికే 17 బంతుల్లో 26 పరుగులు చేసిన జోస్ బట్లర్ ని కూడా హారిస్ రౌఫ్ పెవిలియన్ పంపాడు. దీంతో..45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పీకల్లోతు కష్టాల్లో పడి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను స్టోక్స్ ఆదుకున్నాడు. యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ తో 39 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పాడు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ ఔటైనా.. మొయిన్ అలీతో కలిసి మెరుపులు మెరిపించాడు. ఈ ఇద్దరూ ఆఖర్లో పాక్ బౌలర్లపై విరుచుకపడటంతో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది.
అంతకుముందు.. క్లైమాక్స్ ఫైట్ లో పాకిస్తాన్ (Pakistan) తడబడింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. దీంతో.. ఇంగ్లండ్ ముందు సాధారణ లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. పాకిస్తాన్ బ్యాటర్లలో షాన్ మసూద్ (28 బంతుల్లో 38 పరుగులు ; 2 ఫోర్లు, 1 సిక్సర్), బాబర్ ఆజాం (28 బంతుల్లో 32 పరుగులు ; 2 ఫోర్లు), షాదాబ్ ఖాన్ (14 బంతుల్లో 20 పరుగులు ; 2 ఫోర్లు) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. అదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లతో సత్తా చాటాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, England, Pakistan, T20 World Cup 2022